ఎముకల దృఢత్వానికి ఏం చేయాలి?

ఆంధ్రజ్యోతి, 11-07-2017: ఒకప్పుడు తూనీగల్లా ఎగిరిన వాళ్లే కానీ, ఇప్పుడేమో వారలో కొందరు తూగుతూ, జోగుతూ అడుగు తీసి అడుగు వేయడానికే నానా అవస్థలు పడటం కనిపిస్తుంది.

 
ఏదో పర్వతాన్ని భుజానెత్తుకుని మోస్తున్నట్లు ఆ అడుగులు అలా తడబడటం ఏమిటి?
 
పందిరి గుంజలు బలంగా లేకపోతే పందిరి అంతా అటూ ఇటూ ఊగడం మనకు తెలియనిదా! ఇదీ అంతే...!
 
ఎంతసేపూ భవనాల ఆకృతీ, అందాల గురించి మాట్లాడటమే గానీ, ఆ భవంతి అలా నిలబడటానికి కారణమైన దాని పిల్లర్లు, బీమ్‌ల గురించిన ప్రస్తావనే మన ముందుకు రాదు. మానవ సౌందర్య, సౌష్టవాల విసయంలో కూడా పిల్లర్లు బీమ్‌ల వంటి ఎముకల గురించి ఏమీ మాట్లాడుకోం. ఎముకలు బలంగా ఉంటేనే కదా! ఏ మనిషైనా నిండుగా, బలంగా అడుగులు వేస్తాడు. ఇంతకీ ఈ ఎముకల కథా కమామిషు ఏమిటట.
 
ఎముకలు అనగానే చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది క్యాల్షియం ఒక్కటే. అయితే, అంతకు మించిన మరెన్నో మూలక ద్రవ్యాలు ఎముకల్లో ఉంటాయి. నిజానికి, ఎముకలు కేవలం క్యాల్షియంతో నిర్మితమైన సుద్ద పెంకులేమీ కాదు. ఎముకల తయారీలో క్యాల్షియంతో పాటు భాస్వరం, దానికి తోడు ప్రొటీన్ల వంటి మాంస ధాతువు (కొలాజెన్‌)లు కూడా ఉంటాయి. వీటిల్లో భాగంగానే నాడీ మండలం, రక్తప్రసార వ్యవస్థ కూడా ఉంటాయి. ఈ క్రమంలో రక్త ఉత్పత్తికి మూలమయ్యే, మూలుగ (మజ్జ) అనే మరో కణజాల వ్యవస్థకు కూడా ఎముకలు ఆశ్రయాన్నిస్తాయి.
 
ఎముకల క్రియాశీలత గురించి.....
ఎముకల కణ వ్యవస్థ ఒకే ఒక్కటిగా, విడిగా ఏమీ ఉండదు. అందులో భాగమై సప్తధాతువులూ ఉంటాయి. ఈ ధాతువుల్లో ఒకటైన శుక్రధాతువు నుంచే మూలకణ వ్యవస్థ (స్టెమ్‌సెల్‌) ప్రారంభమవుతుందీ అంటే ఎముకల భూమిక ఎంత విశిష్టమో గ్రహించవచ్చు. అయితే, శరీర కదలికలకు సారథ్యం వహించే మాంస కండరాలు ఎముకల్ని ఆశ్రయించి ఉంటే, కండరాల్ని ఆశ్రయించి కొవ్వు, రక్త ధాతువులు ఉంటాయి. అందుకే ఎముకలు సారవంతంగా దృఢంగా ఉండడం శరీరానికి ఎంతో అవసరమయ్యింది. ఎముకల్లో మౌలికంగా ’ ఆస్టియో బ్లాస్టులు‘ ‘ఆస్టియో సైటులు’ అనే కణాలుంటాయి. ఇవి చనిపోతే, వాటిని తొలగించడానికి ‘ఆస్టియో క్లాస్టులు’ అనే మరో కణజాలం కూడా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఆస్టియో బ్లాస్టులనే కణాలు, క్యాల్షియం, పాస్పేట్లు, ప్రొటీన్లను ఉపయోగించుకుంటూ ఎముకల దారుఢ్యాన్ని కాపాడుతుంటాయి. అయితే ఎముకల్లో పెళుసుదనం ఏర్పడకుండా ’ కొలాజెన్‌’ రూపంలో ఉండే ప్రొటీన్లు కూడా ఒక నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాయి. ఈ కొలాజెన్ల వల్లే ఎగిరినప్పుడు దుమికినప్పుడు బరువులెత్తినప్పుడు ఎముకలు విరిగిపోకుండా ఉంటాయి.
 
క్యాల్షియం ఎముకల కోసమేనా?
శరీరంలోని 99 శాతం క్యాల్షియం ఎముకల్లోనే ఉన్నా, ఇతరమైన మరెన్నో జీవక్రియలకు కూడా క్యాల్షియం అవసరమవుతుంది. వాటిల్లో రక్తం తయారీ, రక్తం గడ్డకట్టడం వంటి ప్రక్రియలతో పాటు కండరాల, వివిధ అవయవాల కదలికలన్నింటికీ క్యాల్షియం అవసరమవుతుంది. అత్యవసరంగా శరీరంలో ఏ భాగానికి క్యాల్షియం కావలసి వచ్చినా, ఈ ఎముకలే ఆ అవసరాలు తీర్చే సరఫరా కేంద్రాలుగా కూడా పనిచేస్తాయి. ఇంతటి వైవిధ్యం గల ఈ క్యాల్షియం ఒంటికి ఇమడాలంటే, కొవ్వులతో (కొలెస్ట్రాల్‌) తయారయ్యే ‘క్యాల్సిట్రయోల్‌’ (ప్రీ- విటమిన్‌- డి), కోలికాల్సిఫెరాల్‌ ( విటమిన్‌ - డి), అవసరమవుతుంది. ఈ క్యాల్సిట్రయోల్‌ చర్మం, మూత్ర పిండాల సాయంతో సూర్యకిరణాల ద్వారా ఒంట్లోకి చేరుతుంది. ఆహార రూపంలో మాత్రం జంతువుల, చేపల లివర్‌లో ఎక్కువగా ఉంటుంది. ఇవి కాక, పాలు, పాల ద్వారా వచ్చే వెన్న, నెయ్యి లల్లో కొంత వరకు ఉంటుంది. అందుకే క్యాల్షియం ఎముకల్లోకి చేరాలంటే, మాంసాహారులు లివర్‌ను, శాకాహారులు పాల ఉత్పత్తులను ఆహారంలో చేర్చుకోవడం అవసరం. క్యాల్షయం స్థిరపడాలంటే, కొలాజెన్‌ రూపంలోని ప్రొటీన్లు కూడా అంతే అవసరం. అలాగే కేవలం అణువుల రూపంలోనే కాక క్యాల్షియం పాస్పేట్‌ అనే లవణ రూపంలో భాస్వరంతో కలిస్తేనే క్యాల్షియం, సాధ్యమవుతుంది. కాబట్టి క్యాల్షియంతో పాటు భాస్వరం (పాస్పరస్‌) కూడా అవసరమే. అందువల్ల ఎముకలు దృఢంగా ఉండాలంటే మన ఆహారంలో ప్రతిరోజూ ప్రొటీన్లు, కొవ్వులు, క్యాల్షియం, పాస్పరస్‌ అనే పోషకాలు ఉండే ఆహార పదార్థాలను ఎంచుకోవాలి. అయితే మంచి పోషకాహారం తీసుకోగానే సరిపోదు. వాటిని అరిగించుకునే జీర్ణశక్తి ఉండాలి. జీర్ణమైన వాటిని ఒంటికి ఇమిడ్చే (శోషణ శక్తి) గ్రహణ వ్యవస్థ పేగుల్లో ఉండాలి. ఒకవేళ ఈ వ్యవస్థ సరిగా లేకపోతే అందుకు తగిన ఆయుర్వేద చికిత్సలు తీసుకోవాలి.
 
ఏం తినాలి?
రాగులు, ఉలవలు, రాజమాలు, సోయాబీన్స్‌, శనగలు, మినుములు, పెసలు, బఠాణీలు, సజ్జలు
 
ఆకు, కూరగాయలు.......
గోబి పువ్వు ఆకులు, చేమ ఆకులు, మెంతి ఆకులు, కొత్తిమీర, పాలకూర, ఉల్లి ఆకు, క్యాబేజి, ముల్లంగి, మునక్కాయలు.
 
మాంసాహారంలో.....
పీతలు, బాతు, రవ్వు చేప కొర్రమీను, రొయ్యలు, పొంప్లెట్‌
 
పాల ఉత్పత్తులు
పాలు, జున్ను, కోవా, పెరుగు, కోడిగుడ్లు.
 
ఆయుర్వేద ఔషధాల్లో ’క్యాల్షియం కార్బనేట్‌’ కోసం, కొన్ని జంతువుల, పక్షుల, సముద్రజీవుల కవచాలను (షెల్స్‌) ‘భస్మం’ గా తయారు చేసి ఉపయోగిస్తారు. కోడిగుడ్డు పెంకులు, గవ్వలు, నత్తగుల్లలు, పశువుల గిట్టలు, కొమ్ములు, ఏనుగు దంతాలు, జింక, దుప్పి కొమ్ములను కూడా ఇందులో ఉపయోగిస్తారు. ఇవే కాకుండా గుగ్గులు, తిక్తక ఘృతం వంటి నెయ్యితో తయారు చేసే మందులు, గంధ తైలం వంటి కొన్ని రకాల తైలాలు కూడా ఇస్తారు. మూలికల్లో అయితే నల్లేరు తీగలు ప్రశస్తమైనవి. పైకి కనిపించే చర్మం, దాని సౌందర్యం, దాని ఆరోగ్యం విషయాల్లో మనమెంతో శ్రద్ద వహిస్తాం. కానీ, అంతకన్నా 100 రెట్ట అధిక శ్రద్ధ ఈ ఎముకల పట్ల చూపాల్సి ఉంటుంది.
 
ప్రొఫెసర్‌ చిలువేరు రవీందర్‌
డాక్టర్‌ బి.ఆర్‌.కె. ఆర్‌ ఆయుర్వేద కళాశాల, హైదరాబాద్‌