పెయిన్‌కిల్లర్స్‌తో కండరాల ముప్పు!

వాషింగ్టన్‌, ఆగస్టు 30: ఏ చిన్న నొప్పి వచ్చినా వెంటనే పెయిన్‌ కిల్లర్స్‌ను, ముఖ్యంగా ఐబ్రూఫెన్‌ మాత్రను వాడుతున్నారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త! ఐబ్రూఫెన్‌ వంటి నొప్పి నివారణ మందులను తరచుగా తీసుకోవడం వల్ల కండరాల పెరుగుదల మందగిస్తుందట. స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యంగా కండరాల పెరుగుదల కోసం వ్యాయామం చేసే వారు తప్పనిసరిగా ఐబ్రూఫెన్‌ వంటి నొప్పి నివారణ మందులకు దూరంగా ఉండాల్సిందేనని వారు తేల్చిచెప్పారు. కఠినతర వర్కవుట్ల తర్వాత కండరాల పెరుగుదలను ఐబ్రూఫెన్‌ నియంత్రిస్తోందని తెలిపారు. మరికొన్ని ఇతర నొప్పి నివారణ మాత్రలు కూడా కండరాల పెరుగుదలకు అవరోధకాలుగా మారుతున్నాయని వెల్లడించారు.