కీళ్లనొప్పులకు బ్రేక్‌

22-01-2018: శ్రమ ఆదాయపు వనరు మాత్రమే కాదు, ఆరోగ్యానికి గొప్ప ఔషధం కూడా. శ్రమ లేకుండా ఉండడమే సుఖపడిపోవడం అనుకుంటే, శరీరంలోని వివిధ అవయవాలు రోగగ్రస్థం కావడం ఖాయం. కాకపోతే, శరీర శ్రమలో ఎక్కువ భారం పడేది కీళ్ల పైనే కాబట్టి, శ్రమ ఒక పరిమితికి లోబడే ఉండాలి. కండరాలను, కీళ్లను, ఎముకలను ఎక్కువగా వాడినా, వాడాల్సిన దానికన్నా తక్కువగా వాడినా, అసలు వాడకపోయినా కీళ్లు నష్టపోతాయి. శరీరానికి అధిక శ్రమకు లోను చేసే వారు తక్కువే గానీ, తక్కువ శ్రమ చేసేవారు, అసలే శ్రమ చేయని వారే ఈ రోజుల్లో ఎక్కువ. వంద గజాల దూరం వెళ్లాలన్నా వాహనాన్నే ఆశ్రయించే స్థితి ఇప్పుడుంది. దీనివల్ల ముందు కండరాలు, ఆ తర్వాత కీళ్లు బలహీనమవుతాయి. కీళ్లు బలంగా ఉండాలంటే, కండరాలు, లిగమెంట్లు, టెండాన్లు బలంగా ఉండాలి. వాటికి మాధ్యమికం (మోడరేట్‌)గా శ్రమ కావాలి. ప్రకృతి ధర్మాన్నీ, శరీర ధర్మాన్నీ అనుసరించి ఆ శ్రమనూ, లేదా వ్యాయామాల్ని కొనసాగించడం ఎంతో శ్రేయస్కరం.

కారణాలేమిటి?
శరీర అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే రక్తం ఆరోగ్యంగా ఉండాలి. రక్తం ఆరోగ్యంగా ఉండడం అంటే, అందులో యాసిడ్‌ (ఆమ్లం), బేస్‌ (క్షారం) సమతుల్యంగా ఉండాలి. క్షారతత్వంలో ఉన్నంత కాలం శరీర అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. రక్తంలో ఆమ్లతత్వం పెరిగితే ఎముకలు, కీళ్లు అరుగుతాయి. కండరాలు బలహీనపడతాయి. మూత్రపిండాల్లో, పిత్తాశయం (గాల్‌ బ్లాడర్‌)లో రాళ్లు తయారవుతాయి.
 
నేడు మనం తీసుకుంటున్న ఆహార పదార్థాల్లో ఆమ్లాన్ని అధికంగా ఉత్పత్తి చేసేవే ఉంటున్నాయి. పాలు, పంచదార, తెల్లగా పాలిష్‌ పట్టిన బియ్యం, పాలతో చేసిన స్వీట్లు, ఐస్‌ క్రీంలు, తెల్లటి మైదాపిండి, తెల్లటి ఉప్పు వంటి తెల్లటి ఆహార పదార్థాలన్నీ ఆమ్లాన్ని పెంచేవే. వీటితో పాటు నిలువ ఉంచే పచ్చళ్లు, గసగసాలు, పట్టా, సాజీర, లవంగాలు, నూనె, మాంసాహారం, మసాలాలు - ఇవన్నీ ఆమ్లాన్ని పెంచేవే. మాంసాహారం జీర్ణమయ్యాక కొన్ని రకాల అమినో యాసిడ్స్‌గా విడగొట్టబడుతుంది. అందులోంచి యూరియా, యూరిక్‌ యాసిడ్‌ విడుదల అవుతుంది. యూరిక్‌ యాసిడ్‌ పెరిగితే ‘గౌట్‌’ అనే కీళ్ల వ్యాధి వస్తుంది. పిల్లలు అతిగా తింటున్న చాక్లెట్లు, బిస్కట్లు, ఐస్‌క్రీంలు, పిజ్జాలు, కూల్‌డ్రింక్స్‌, జాం, సాస్‌ ఇవి కూడా యాసిడ్స్‌ను పెంచేవే.
 
ఉప్పు ఎక్కువైతే ముప్పే
మన శరీరానికి రోజుకు 2-3 గ్రాముల ఉప్పు అవసరం. రోజూ మనం తినే ఆకుకూరల్లోనూ, కాయకూరల్లోనూ మన శరీరానికి కావలసినంత ఉప్పు సహజంగానే ఉంటుంది. అది చాలదన్నట్లు అదనంగా సగటున 15 నుంచి 20 గ్రాముల ఉప్పు తింటున్నారు. ఈ అదనపు ఉప్పులో కొంత కీళ్లల్లో పేరుకుపోతుంది ఈ ఉప్పు కీళ్లలోని ద్రవాన్ని లాక్కుంటుంది. ఫలితంగా నీరు తగ్గిపోయి, కీళ్లు పెళుసుబారిపోతాయి. నీరు తగ్గినప్పుడు సహజంగానే కీళ్లు ఒకదానితో ఒకటి రాసుకుని కార్టిలేజ్‌ అరిగిపోయి, కీళ్ల వాపు, నొప్పి వస్తాయి. అధిక బరువు కూడా పరోక్షంగా కీళ్లు తొందరగా అరిగిపోవడానికి కారణమవుతుంది.
 
నివారణ మార్గాలు
కీళ్ల గట్టితనం వాటిని అంటిపెట్టుకుని ఉన్న కండరాల పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అందుకే కండరాల పటుత్వం కోసం రోజూ ఒక గంట పాటు వ్యాయామం చేయడం అవసరం. కీళ్ల నొప్పులు ఉన్న వారికి ఇతర వ్యాయామాల కన్నా ‘యోగాసనాలు’ ఎక్కువ మేలు చేస్తాయి. ప్రత్యేకించి అర్ధ మత్స్యేంద్రియాసనం వల్ల కీళ్లు, కండరాలతో పాటు శరీరంలోని ఇతర అవయవాలు కూడా శక్తిమంతంగా మారతాయి.
 
ఆసనాలతో పాటు..
కాలి మడమను గుండ్రంగా తిప్పడం,
మోకాలును గుండ్రంగా తిప్పడం
మణికట్టును గుండ్రంగా తిప్పడం
భుజాలను గుండ్రంగా తిప్పడం
నడుమును గుండ్రంగా తిప్పడం వంటివి కండరాల పటుత్వాన్ని పెంచడానికీ కీళ్ల వ్యవస్థను బలోపేతం చేయడానికీ బాగా ఉపయోగపడతాయి.

ప్రకృతి వైద్య చికిత్సలు

కీళ్ల నొప్పులు మొదలైన తొలిదశలోనే ప్రకృతి చికిత్సా విధానాలను అనుసరిస్తే ఆ సమస్యలు అక్కడితోనే సమసిపోతాయి. అవేమీ లేకుండా కేవలం మందులకే పరిమితమైతే సమస్య నానాటికీ విషమించిపోతుంది. మౌలికంగా, కీళ్లు దెబ్బ తినడానికి అస్తవ్యస్తమైన మన జీవనశైలే అసలు కారణం. అందువల్ల జీవన శైలిని మార్చుకోకుండా, ఎన్ని మందులు వాడినా ఏ ప్రయోజనమూ ఉండదు. ఏ కారణంగా ఈ సమస్య తలెత్తిందో అర్థంచేసుకుని ఆ కారణభూతమైన వాటికి దూరంగా ఉండాలి. ఆ తర్వాత చికిత్సలు తీసుకోవాలి. అయితే, ప్రకృతిలోంచి వచ్చిన మనిషికి ప్రకృతి చికిత్సలు అపారమైన మేలు చేస్తాయి. ప్రకృతి వైద్యంలో గాలి ద్వారా, నీటి ద్వారా, తైల మర్దన ద్వారా, మలినాలను బయటికి పంపే మరెన్నో చికిత్సల ద్వారా రోగిని ఆరోగ్యవంతమైన పూర్వస్థితికి తీసుకు వచ్చే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా శరీర కణజాలంలోని మలినాలను బయటికి పంపించే ప్రక్రియ ప్రధానంగా ఉంటుంది. అందులో భాగంగా మూడు దశల్లో చికిత్సలు ఉంటాయి
 
కణంలో పేరుకున్న మలినాలను బయటికి పంపే (ఎలిమినేటివ్‌ ప్రాసెస్‌) చికిత్సా విధానం.
కణాన్ని ఆరోగ్యవంతంగా తయారు చేసే (సూథింగ్‌) విధానం.
కణానికి తిరిగి శక్తిని అందించే (కన్‌స్ట్రక్టివ్‌ ప్రాసెస్‌) విధానం
ఈ చికిత్సా విధానాల ద్వారా కీళ్లనొప్పుల నుంచి విముక్తిని పొంది, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపే అవకాశాలు మెండుగా ఉంటాయి.
 
డాక్టర్‌ టి కృష్ణమూర్తి, సూపరిటెండెంట్‌,
యోగా, నేచర్‌ క్యూర్‌ హాస్పిటల్‌ (రెడ్‌క్రాస్‌), హైదరాబాద్‌