కీళ్లనొప్పులనుంచి ఉపశమనం

ఆంధ్రజ్యోతి, 16-05-2017:శరీరంలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన ఆమ్లం (వ్యర్థ, విషపదార్థాలు) కీళ్లల్లో చేరిపోయి నొప్పి కలుగుతుంది. ఈ కీళ్ల నొప్పులను ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే అది గుండెను సైతం బలహీనపరుస్తుంది. అందుకే సమస్య ప్రారంభమైన తొలి దశలోనే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కీళ్లనొప్పులు అక్కడితోనే అదృశ్యమైపోతాయి. అలాంటి జాగ్రత్తలు కొన్ని....

10 తులాల ఆవనూనెలో గానీ, నువ్వుల నూనెలో గానీ, నాలుగు వెల్లుల్లిపాయలు వేసి వేడిచేసి నొప్పులున్న భాగాన రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి.

జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలక్కాయలు వీటిని ఒక్కొక్క భాగంగా తీసుకుని శొంఠి చూర్ణం, తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

వేపనూనెలో జిల్లేడు వేరు చూర్ణం కలిపి నొప్పి ఉన్న భాగాన మర్దన చేసుకుంటే చాలా త్వరితంగా కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

ఒక తులం సునాముఖి ఆకులను 250 మి. లీ. ఆవుపాలలో వేసి కాచి, చల్లారిన తర్వాత ఆకులు తీసివేసి, ఆ పాలు తాగితే కీళ్లనొప్పులు తగ్గుతాయి.

చేదు పుచ్చ వేరు, పిప్పళ్లు, బెల్లం కలిపి వాటిని మాత్రలుగా చేసుకుని ఉదయం ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.