అయిదు అపోహలు

ఆంధ్రజ్యోతి,11-04-2017: జీవితం అంటే పరుగులు తీయడమే అనుకుంటాం. కానీ, ఉన్నట్లుండి ఒక్కోసారి పరుగులు తీసే ఆ కాళ్లకు పగ్గాలు పడతాయి. పరుగుల మాట అటుంచి అసలు కాలు కదపలేని స్థితి కూడా ఏర్పడుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్‌లో జరిగేదే అది మరి! కీళ్లల్లో వాపు, నొప్పి, కీళ్లు బిగుసుకుపోవడం వంటి ఆర్థరైటిస్‌ లక్షణాలు, ఏదో ఒక కీలును గానీ, అనేక కీళ్లను గానీ, తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అందుకు గల బాహ్య కారణాలు కొన్నయితే, శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ, విషపదార్థాలు మరో కారణం. అయితే ఆర్థరైటిస్‌ విషయంలో చాలా మందిలో అవగాహన ఉన్నా, అపోహలు కూడా ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోలేకపోతే ఆ సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి అపోహల్లో కొన్ని: 

 
ఈ సమస్య వృద్ధులకేనా?
నిజమే...!ఆర్థరైటిస్‌తో బాధపడే వాళ్లల్లో అత్యధికులు కాస్త వయసు పైబడిన వాళ్లే. కాకపోతే, వారిలో 60శాతం మంది ఇంకా తమ ఉద్యోగ, వ్యాపారాల్లో కొనసాగుతున్న వాళ్లే. నిజానికి ఆర్థరైటిస్‌ సమస్యకు పూర్తిస్థాయి చికిత్స ఏదీ లేదు కానీ, తొలిదశలోనే చికిత్సలు తీసుకుంటే వ్యాధి లక్షణాలను, అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి. సమస్య మరింత విషమించకుండా నియంత్రించే అవకాశాలూ ఉంటాయి. 
 
పొడివాతావరణమే మేలా?
ఆర్థరైటిస్‌ బాధితులు వె చ్చని లేదా పొడి వాతావరణంలో ఉన్నప్పుడు కాస్త కీళ్లు బలపడినట్లు, కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది. కానీ, ఈ సమస్య దీర్ఘకాలికంగా కొనసాగినప్పుడు ఈ తరహా ఉపశమనాలు కీళ్లు మరింత క్షీణించకుండా 
ఆపలేవు. 
 
కీళ్లల్లోంచి శబ్దాలొస్తే ప్రమాదమా?
కొంత మంది కీళ్లల్లో అడుగు తీసి అడుగు వేసిన ప్రతిసారీ కటకట మంటూ శబ్దాలు వస్తాయి. అయితే, ఈ శబ్ధం సమస్య మరింత తీవ్రమవుతోందని చెప్పే చిహ్నమేమీ కాదు. కీళ్లల్లో ఉండే సైనోవియల్‌ ఫ్లూయిడ్‌ మీద పడే ఒత్తిడి అటూ ఇటూ మారడం వల్ల అక్కడుండే నీటి బుడగలు చిట్లడం వల్ల ఈ శబ్దాలు వస్తాయి. ఆ బుడగలు అలా చిట్లడం వల్ల కీళ్లకు కలిగే నష్టం మాత్రం 
ఏమీ లేదు. 
 
ఎక్స్‌రేలు నిజాలు చెబుతాయా?
నిజానికి, ఎక్స్‌రేలు కీళ్ల లోతుపాతుల్ని పెద్దగా చెప్పలేవు. ఎందుకంటే ఎక్స్‌రేల్లో అంతా నార్మల్‌ అని వచ్చినా ఆ పేషంట్‌ తీవ్రమైన కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉండొచ్చు. ఇందుకు విరుద్ధంగా, రిపోర్టులు ఆర్థరైటిస్‌ సమస్య చాలా తీవ్రంగా ఉందని సూచించినప్పుడు పేషంట్‌కు అసలు నొప్పే తెలియకపోవచ్చు. అందువల్ల కీళ్లు బిగుసుకుపోవడం, నొప్పి, శక్తి హీనత వంటి లక్షణాల ద్వారానే సమస్యను గుర్తించాలి. లేదంటే కొన్ని రక్తపరీక్షల ద్వారా రుమాటాయిడ్‌ ఆర్థరైటిస్‌, గౌట్‌ వంటి సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవచ్చు.
 
ఆర్థరైటిస్‌ సమస్య ఉన్నవాళ్లు వ్యాయామం చేస్తే కీళ్లు మరింత దెబ్బ తింటాయనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ, వ్యాయామాలు ఆర్థరైటి్‌సను బాగా తగ్గిస్తాయి. పలు పరిశోధనల్లో ఈ నిజం పలుమార్లు వెల్లడయ్యింది. కాకపోతే సాధారణ వ్యాయామాల కన్నా థెరప్యూటిక్‌ వ్యాయామాల ద్వారా వీరికి ఎక్కువ ప్రయోజనం 
కలుగుతుందనేది వాస్తవం.