యోగ ప్రొటోకాల్‌

21-06-2017:యోగ ఎలా చేయాలి? ఎలా చేయకూడదు? ఎలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది? బోలెడు సందేహాలు కదా.. ఇటువంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేసేందుకు ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ‘కామన్‌ యోగ ప్రొటోకాల్‌’ అనే బుక్‌లెట్‌ను విడుదలచేసింది. ఇవ్వాళ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఈ బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ఇందులో యోగా చరిత్రతో పాటు దానివల్ల కలిగే లాభాలు, సూచనలతో పాటు ఆసనాలను బొమ్మల ద్వారా వివరించారు. ఈ పుస్తకంలోనే యోగాలో చేయాల్సినవి, చేయకూడనివి అంటూ ఓ పది సూచనలు పేర్కొన్నారు. అవేంటంటే...

పరిసరాలను, శరీరాన్ని, మనసును శుభ్రంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి.
ఏమీ తినకుండా అంటే ఖాళీ కడుపున యోగ చేయాలి. లేదా మితాహారం తీసుకున్న తరువాత చేసినా పర్వాలేదు..
తేలికపాటి, సౌకర్యంగా ఉండే కాటన్‌ దుస్తులు వేసుకోవాలి.
ప్రార్థన చేశాక యోగ ప్రారంభించాలి.
హడావిడిగా కాకుండా ఆసనాలను నెమ్మదిగా వేయాలి.
శరీరం గురించి తెలుసుకోవాలి. అలాగే ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసలు, శ్వాస నిలపడం వంటి విషయాలను జాగ్రత్తగా గమనిస్తుండాలి.
యోగ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు ముక్కు ద్వారానే శ్వాస తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో తప్ప నోటి ద్వారా గాలి పీల్చకూడదు. వదలకూడదు.
యోగ పూర్తయ్యాక మెడిటేషన్‌ చేసి ఆ సెషన్‌ను ముగించాలి. ఈ సమయంలో నేల మీద సూది పడినా వినపడేంత నిశ్శబ్దం ఉండాలి.
యోగ చేసిన 20 లేదా 30 నిమిషాల తరువాతే స్నానం చేయాలి.
తినడం కూడా అంతే... యోగ పూర్తి చేసిన 20 లేదా 30 నిమిషాల తరువాతే.