నానమ్మ ఆరోగ్యయోగం

21-06-2017:ఇక, రెండేళ్లు గడిస్తే.. సెంచరీ పూర్తి చేస్తుందీ బామ్మ! ఈ వయసులో ఏ కీలుకు ఆ కీలు చకచకా వంచేస్తుంది. పాతికేళ్ల కుర్రాళ్లు కూడా వేయలేని ఆసనాలన్నీ వేస్తుంది. ఆ యోగీశ్వరి.. కోయంబత్తూరుకు చెందిన నానమ్మ్మాళ్‌. తొంభై ఎనిమిదేళ్ల వయసులోనూ దేశమంతా తిరుగుతూ ప్రజల్లో యోగా పట్ల చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. ఇటీవలే ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని తణుకు వచ్చిన సందర్భంగా.. ‘ఆంధ్రజ్యోతితో’ మాట్లాడింది..

 
‘‘నేటి తరాన్ని చూస్తే జాలేస్తుంది. బడికి వెళ్లే బుజ్జి పిల్లలకు దబ్బ కళ్లద్దాలు. పాతికేళ్ల వయసుకే కీళ్లనొప్పులు. వెన్నునొప్పి. నడివయసుకే నడుం వంగదు. ఇంట్లో ఎవరి పనులు వాళ్లు చేసుకోలేరు. సహాయకులు ఉంటేనే జీవితం ముందుకు నడుస్తుంది. ముప్పావువంతు మందికి అధిక రక్తపోటు. మధుమేహం. గుండెజబ్బులు. ఇక, మహిళల అవస్థలు అయితే చెప్పనక్కర్లేదు. తల్లి అయ్యాక భయం మొదలవుతుంది. సుఖప్రసవాల మాటే లేదు. అన్నీ సిజేరియన్‌ ఆపరేషన్లే! ఇద్దరు పిల్లలు పుట్టాక.. జబ్బులన్నీ ఒక్కటై శరీరాన్ని గుల్ల చేస్తున్నాయి. వీటన్నిటికీ మందులుమాకులు ఒక్కటే పరిష్కారం కాదు. వ్యాయామం, పుష్టినిచ్చే తిండి.. ఇవి రెండూ సరిగా ఉంటే మూడొంతుల రోగాలు మన దరిదాపులకు కూడా రావు. ఇదేదో నేను ఉపన్యాసం కోసం చెప్పలేదు. తొంభై ఎనిమిదేళ్ల అనుభవంతో చెబుతున్న సత్యం! అవును మరో రెండేళ్లు పూర్తయితే శతాధికవృద్ధురాలిని అవుతాను. ఇప్పటికీ నేనింత ఆరోగ్యంగా ఉన్నానంటే అందుకు కారణం - ఒకటి యోగా. రెండు సంప్రదాయ ఆహారం.
 
అమ్మకు 107! నాకు 98!!
మా సొంతూరు కోయంబత్తూరు. మా పూర్వీకులు యోగాభ్యాసకులు. ఎనిమిదేళ్ల వయసు నుంచే యోగా నేర్పించారు మా తాత. ఆయన యోగా మాస్టారు కూడా. ఇక, నాన్న అయితే వ్యవసాయదారుడు. యోగా చేశాకే పొలం పనులకు వెళ్లేవాడు. ఆయన పల్లెలు తిరుగుతూ సిద్ధ వైద్యం చేసేవారు. మాది జగమంత కుటుంబం. అమ్మ పొన్నమ్మాళ్‌ 107 ఏళ్లు జీవించింది. ఆమెకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. వాళ్లందరి పిల్లలు.. వాళ్లకు మళ్లీ పిల్లలు.. ఇలా మూడు తరాలూ యోగానే నమ్ముకున్నాయి. మా కుటుంబ సభ్యులకు ఆరు పర్యాయాలు యోగాలో జాతీయస్థాయిలో ఆరు బంగారు పతకాలు వచ్చాయి. నేను అయితే ఇప్పటి వరకు దేశమంతా తిరిగాను. వందలాది యోగా ప్రదర్శనలు ఇచ్చాను. ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక యోగా తరగతులు నిర్వహిస్తూ.. ఆరోగ్యచైతన్యం తీసుకొస్తున్నాను. నేటి ఆధునిక మహిళలు అందరూ క్రమం తప్పకుండా యోగా చేస్తే.. ఎంతో మేలు. రుతుక్రమ సమస్యలు, హార్మోన్ల ఇబ్బందులు.. అధికబరువు.. ఇలా అన్నింటికీ యోగాతో పరిష్కారం లభిస్తుంది.
 
క్రమశిక్షణ తప్పలేదు
ఏళ్ల తరబడి నాది ఒకటే జీవనశైలి. ఉదయం 4.30 గంటలకు నిద్రలేస్తాను. పాలు, పంచదారలతో కాచిన కాఫీ, టీలు తాగను. ఒకవేళ తాగాలనిపిస్తే.. ధనియాలు, అల్లం, రవ్వంత బెల్లం ఉడికించి.. కషాయం చేసుకుని తాగుతా. అదే నాకు అద్భుతమైన రుచిగా అనిపిస్తుంది. పంచదార అస్సలు వాడను. తీపివంటల్లో అవసరం అనిపిస్తే.. కేవలం బెల్లం మాత్రమే వినియోగిస్తాం. మిఠాయిలకు మాత్రం దూరం. ఉదయం నిద్ర లేచాక.. అరలీటరు మంచి నీళ్లు తాగాల్సిందే! వేప పుల్లతో పల్లు తోముకుంటా. ఏనాడూ బ్రష్‌, పేస్టు వాడింది లేదు. ఒకవేళ ఐదారు రోజులు వేరే ఊరికి వెళ్లాల్సి వస్తే - బ్యాగులో వేప పుల్లలు పెట్టుకుని వెళతా! నా దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో చూసుకోను కానీ.. వేపపుల్లలు ఉన్నాయో లేదో మాత్రం కచ్చితంగా చూసుకుంటాను. ఎందుకంటే డబ్బులు ఎవరైనా ఇస్తారు, వేప పుల్లలు ఇవ్వరు కదా! పల్లు తోముకున్నాక యోగా చేస్తాను. ఆ తరువాత ఇడ్లీ లేదా దోశతో అల్పాహారం పూర్తవుతుంది. తృణ ధాన్యాలతో చేసిన (రాగులు, కొర్రలు, సజ్జలతో చేసిన ద్రవాహారం) గంజి తప్పక తీసుకుంటాను. చిరుధాన్యాలతో అధిక పీచు, క్యాల్షియం లభిస్తుంది. ఇక, మధ్యాహ్న భోజనంలో వరి అన్నం తక్కువ ఉండేలా.. కూరగాయలు ఎక్కువ ఉండేలా జాగ్రత్త పడతాను. కూరగాయలు కూడా మా తోటలో పండించుకున్నవే తింటాం. రాత్రి ఏడున్నర లోపు డిన్నర్‌ పూర్తవుతుంది. ఒక పండు తింటాను. గ్లాసు పాలలోకి తేనె, పసుపు, మిరియాలపొడి కలుపుకుని తాగుతాను. కొన్నిసార్లు మన పూర్వీకులు తినే ఆహారం తింటాను. ఉదాహరణకు - ఒక మట్టి కుండ తీసుకుని.. అందులోకి రాత్రిపూట మిగిలిపోయిన అన్నం, పెరుగు కలిపి.. పొద్దున్నే తినేస్తుంటా. అలా తింటే చలువ చద్దన్నం మంచిదే!
 
యోగా సేవలో
ఇక, యోగా సంగతికి వస్తే - ఇప్పటి వరకు మా కుటుంబంలో సుమారు 36 మంది యోగా అధ్యాపకులు తయారయ్యారు. వాళ్లందరూ వెయ్యిమందికి పైగా సహ ఉపాధ్యాయులను తీర్చిదిద్దారు. దేశ, విదేశాల్లో యోగాను నేర్పిస్తున్నారు. గత పదేళ్ల నుంచి భారత్‌ సేవాగ్‌ సమాజ్‌ పేరిట యోగాను విశ్వవ్యాప్తం చేసే పనిలో ఉన్నారందరూ! మేము లాభాపేక్షను ఆశించి ఈ పని చేయడం లేదు. ప్రజల ఆరోగ్యం బాగుండాలని చేస్తున్నాం. ప్రభుత్వాలు ఈ మధ్య యోగాకు ప్రచారం తీసుకొస్తున్నాయి కానీ.. మేము ఎప్పటి నుండో ఆ దిశగా కృషి చేస్తున్నాం. ‘డిప్లమో ఇన్‌ నేచురోపతి అండ్‌ వేదిక్‌ సైన్స్‌’ అన్న కోర్సును అందిస్తున్నా. ఒకప్పటి కంటే ఇప్పుడు యోగా పట్ల చైతన్యం పెరిగింది.
 
అవార్డులే అవార్డులు
నాకిప్పుడు 98 ఏళ్లు. బాల్యం నుంచే యోగానే జీవితంగా చేసుకుని బతుకుతున్నాను. కేవలం యోగా, మంచి ఆహారం వల్లనే ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పటికీ నాకు కంటిచూపు బాగానే ఉంది. ఎటువంటి జబ్బులూ లేవు. క్లిష్టమైన ఆసనాలు కూడా వేస్తాను. తరగతులు నిర్వహిస్తున్నాను. మా ఇంట్లో మహిళలు ఎవరూ సిజేరియన్లు చేయించుకోలేదు. సుఖప్రసవంతో పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాలను అందరికీ తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా యోగా నేర్పిస్తున్నందుకు నన్ను ప్రభుత్వం గుర్తించింది. 2006లో యోగా చక్రవర్తి పురస్కారం, 2013లో నక్షత్ర పురస్కారం లభించింది. యోగా కలైౖమామణి, కళాభారతి పురస్కారాలు వరించాయి. బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ చేతుల మీదుగా ‘యోగారత్న’ అవార్డును తీసుకోవడం సంతోషం. వీటన్నిటికీ మరో ఎత్తు - నారీశక్తి పురస్కారం. మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో మోదీ చేతుల నుంచి ఈ అవార్డును అందుకున్నాను. యోగాకు ఇప్పుడు విశ్వకీర్తి వస్తోంది. భారతీయ యోగాలోని గొప్పతనాన్ని ప్రపంచం స్వీకరిస్తోంది.
 
 
- పి.చిన్నక్రిష్ణమూర్తి, తణుకు