ధ్యానం మనసుకేనా?

 ఆంధ్రజ్యోతి(01-02-2017):  ధ్యానం పూర్తిగా ఆత్మగతమైన దీ, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినదేననే ఎక్కువమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అదీ నిజమే అయినా వాటితో పాటు అది శరీరగతమైన బాధల నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది. అయితే, అనునిత్యం శారీరక, మానసిక సంఘర్షణలకు నిలయంగా ఉండే క్రమంలో నిద్రలేమి సమస్యలు, మానసిక కుంగుబాటు (డిప్రెషన్‌) వంటి సమస్యలు వేధిస్తాయి. అయితే ధ్యానం వాటి నుంచి బయటపడేలా చేస్తుంది. కళ్లు మూసుకుని, పూర్తిగా శ్వాస మీద ధ్యాస నిలిపే ధ్యానంలో మనిషి అంతర్గత శక్తులన్నీ లోలోపలే ఉండిపోతాయి. ఇవి మానసిక ఆందోళనల నుంచి విముక్తి కలిగించడంతో పాటు, శారీరక రుగ్మతలను ఒంటినొప్పులను కూడా తగ్గిస్తాయి. 

వృత్తిపరమైన ఒత్తిడి వల్ల మనసులో ఏర్పడే అలజడి కొన్నిసార్లు నిద్రలేమి సమస్యలకు దారి తీస్తుంది. ఆ ఒత్తిడి తాలూకు ప్రతికూల అంశాలను సమూలంగా తొలగించే శక్తి ధ్యానానికి సంపూర్తిగా ఉంది. అందువల్ల రోజూ క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే, ఈ సమస్యలన్నీ దూర దూరంగా వెళ్లిపోతాయి.
మానసిక కుంగుబాటు లేదా డిప్రెషన్‌ వల్ల ఏమవుతుంది? శరీరంలోని జీవక్రియలన్నీ నిదానిస్తాయి. కుంటుపడతాయి. ఇవి వృత్తిపరమైన నిర్లిప్తతకూ, అసమర్థతకూ దారి తీస్తాయి. ఇలాంటి వారికి ధ్యానం ఒక దివ్య ఔషధం. మనోబలాన్ని అద్భుతంగా ఉత్తేజితం చేసే ధ్యానం వల్ల కానీ ఖర్చులేకుండా, డిప్రెషన్‌ నుంచి బయటపడే ఒక నిండు అవకాశం లభిస్తుంది.