అర్థ మత్స్యేంద్రాసన యోగ!

29-01-2018: అర్థ మత్స్యేంద్రాసన లేదా వక్రాసన అనేది హఠ యోగాలోని 12 స్థూల ఆసనాల్లో ఒకటి. ఈ ఆసనాన్ని ఉదయాన్నే పరగడుపున లేదా భోజనం చేసిన 4 నుంచి 6 గంటల తర్వాత మాత్రమే వేయాలి. ఈ ఆసనం వేసే సమయంలో కడుపు ఖాళీగా ఉండాలి.

ఆసనం ఇలా!
కటి ఎముకలు నేలకు తగిలేటట్టుగా కూర్చుని, కుడి కాలు మడిచి, పాదం ఎడమ పిరుదుకు తగిలేలా ఉంచాలి.
ఎడమ కాలును కుడి కాలు మీదుగా అవతలకు వేసి పాదాన్ని నేలకు తాకించాలి.
నడుము పై భాగాన్ని ఎడమ వైపుకు తిప్పాలి.
చేతులు రెండూ జోడించి ఉంచాలి.
ఈ భంగిమలో 30 నుంచి 60 సెకండ్లపాటు ఉండి, రెండోవైపు చేయాలి.
ఈ ఆసనం వేస్తున్నంతసేపు నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవాలి.
 
ఆసనం వల్ల లాభాలు
ఈ ఆసనం వల్ల వెన్ను బలంగా తయారవుతుంది. వెన్నుపాము పనితీరు మెరుగవుతుంది.
వెన్నుపూసల మధ్య బిగుతును తొలగించి, వెన్ను నొప్పిని తొలగిస్తుంది.
పిత్తాశయాన్ని ప్రేరేపించి, మధుమేహం సమస్యను తగ్గిస్తుంది.
అడ్రినలిన్‌, బైల్‌ స్రావాలను క్రమబద్ధం చేస్తుంది.
నడుములో బిగుసుకున్న కీళ్లను వదులు చేస్తుంది.
కటి ప్రదేశానికి రక్తప్రసరణను మెరుగు పరిచి, పోషకాలు, రక్తం, తద్వారా ఆక్సిజన్‌ అందేలా చేసి, పునరుత్పత్తి, మూత్ర వ్యవస్థలు సక్రమంగా పని చేసేలా ప్రోత్సహిస్తుంది.