కోపం తగ్గించుకోండిలా..

ప్రతి చిన్న విషయానికీ కోపగించుకునే వాళ్లు ఉన్నారు. కొన్నిసార్లు శారీరక ఉద్రేకాలు కూడా కోపాన్ని ప్రేరేపిస్తుంటాయి. ఇలాంటి ఉద్వేగాలను కనక పెంచుకుంటూ పోతే.. అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం ఖాయం. కోపాన్ని అణుచుకోవడం కంటే.. అసలు కోపం తెచ్చుకోకుండా శరీరాన్ని సమాయత్తం చేసుకోవడం ఉత్తమం. ఇందుకు ధ్యానం ముఖ్య సాధనం. ఉదయాన్నే అరగంట నడకతో మొదలు పెట్టి.. నలభై నిమిషాల పాటు యోగా చేసి.. మరో పదిహేను నిమిషాలు ధ్యానం చేయాలి.

ఉదయం ఎంత ఆహ్లాదంగా ఉంటే.. ఆ రోజు అంతే ప్రశాంతంగా గడుస్తుంది. ఇక, ఆహారాన్ని మార్చుకోక తప్పదు. ఉద్రేకాలను ప్రేరేపించే మసాలాలు, ఉప్పు, కారం తగ్గించుకోవాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. ఈ వేసవిలో వీలైనంత వరకు రోజూ కీరా ముక్కలు, పుచ్చకాయ, టొమాటో రసం, ఫ్రూట్‌ సలాడ్స్‌, పల్చటి మజ్జిగ తీసుకోవాలి. మంసాహారం తగ్గించాలి. ధూమపానం, మద్యం కూడా ఉద్రేకాలకు కారణం అవుతాయి. ఇక, కోపతాపాలకు నిద్రాభంగం కూడా ఒక కారణం. సుఖవంతమైన నిద్ర కరువైతే చికాకులు ఎక్కువవుతాయి. నిద్రను మాత్రం దూరం చేసుకోవద్దు. ఇవన్నీ చేసినా కోపం తగ్గకపోతే మానసిక వైద్యుల సహాయం తీసుకోవడం మంచిది.