మౌనమే మరక

నెలసరి సహజ ప్రక్రియ..!

సిగ్గు పడాల్సిందేముంది?
మూఢనమ్మకాలు వీడాలంటూ ఉద్యమాలు
‘ఆరోగ్యం మహిళల హక్కు’ అంటున్న బాలీవుడ్‌
బాలికలకు శానిటరీ నేప్కిన్ల సరఫరాకు పథకాలు
 
‘బ్లడీ మెన్‌.. మహిళల్లా మగాళ్లకు అరగంట బ్లీడింగ్‌ అయితే నేరుగా చస్తారు’-ప్యాడ్‌ మ్యాన్‌ సినిమా క్లైమాక్స్‌లో అక్షయ్‌ కుమార్‌ ఎమోషనల్‌ డైలాగ్‌ ఇది! ఈ మాట వాస్తవం! నెలసరిలో మహిళలు పడే బాధ వారికే తెలుస్తుంది. చాలు..! ఇన్నేళ్లుగా రోగాలతో బాధపడింది చాలు.. భరించిన అవమానాలు చాలు.. ఆచారాలు, మూఢ నమ్మకాలకు పోగొట్టుకున్న ప్రాణాలు చాలు! ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదు..! ఇది కోట్లాది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం! మహిళా దినోత్సవం
సందర్భంగా.. శానిటరీ ప్యాడ్‌ చేతిలోకి తీసుకుని.. నెలసరి సహజ ప్రక్రియ అని నినదించాల్సిన సమయం!!
 
‘మేం మహిళలం. నలుగురిలో తలదించుకోవడం కంటే రోగాలతో చావడమే నయం’ వంటి ‘ప్యాడ్‌మ్యాన్‌’ సినిమాలో రాధికా ఆప్టే డైలాగులు సమాజంలో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. నెలసరిపై శతాబ్దాలుగా కొనసాగుతున్న మౌనం, మూఢ నమ్మకాలు, అపరిశుభ్ర పరిస్థితులు వారిని రోగాలపాలు చేస్తూనే ఉన్నాయి. దేశ మహిళల్లో శానిటరీ ప్యాడ్స్‌ వాడుతున్నది 12 శాతమే. మిగతా మహిళలు అపరిశుభ్రమైన గుడ్డలు, ఆకులు, కాగితాలు, బూడిద వాడుతున్నారని అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. దీనివల్ల మహిళల్లో 70 శాతం మంది ఇన్ఫెక్షన బారిన పడుతున్నారు. కొందరైతే సర్వికల్‌ క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. దేశ వ్యాప్తంగా దాదాపు 70శాతం మంది మహిళలు తమకు శానిటరీ నేప్కిన్స్‌ కొనే స్థోమత లేదని వెల్లడించారు. ఈశాన్య భారతంలో 83 శాతం మంది మహిళలు పీరియడ్‌ ప్యాడ్స్‌ ఉపయోగించడం లేదు. విద్యార్థినుల పరిస్థితి దారుణం! 12 నుంచి 18 ఏళ్ల లోపు బాలికలు.. పీరియడ్‌ పెయిన్‌తో నెలకు నాలుగైదు రోజుల చొప్పున ఏడాదికి 50 రోజులపాటు బడికి వెళ్లడం లేదు. దేశవ్యాప్తంగా దాదాపు 23శాతం మంది బాలికలు.. పదో తరగతిలోపే చదువుకు దూరమవుతున్నారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న బాలికలకు 6 శానిటరీ నేప్కిన్స్‌ ఉన్న ప్యాక్‌ను రూపాయికీ, మిగతావారికి 5 రూపాయలకు సరఫరా చేయాలన్న పథకం దేశంలో ఎక్కడా సక్రమంగా అమలు కావడం లేదు. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, లక్నో, హైదరాబాద్‌, గోరఖ్‌పూర్‌, ఔరంగాబాద్‌, విజయవాడల్లో 31 శాతం మంది ఉద్యోగినులు నెలకు సగటున 2 రోజులపాటు పనికి దూరమవుతున్నారు.
 
ప్రపంచమంతా ‘పీరియడ్‌ పావర్టీ’
కెన్యా, భారత్‌వంటి దేశాల్లోనేకాదు.. యూకే, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ సమస్య ఉంది. శానిటరీ ప్యాడ్స్‌ కొనే స్థోమత లేక..ప్రతి నెలా స్కూలుకి వెళ్లలేని దుస్థితి యూకే అంతటా ఉంది! బ్రిటీష్‌ స్కూళ్లలో 26శాతం మంది బాలికలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికాలో 58 శాతంమంది మహిళలు నెలసరిలో అసహనానికి గురవుతున్నారు. సిగ్గుతో శానిటరీ ప్యాడ్స్‌ ఎవ్వరికీ కనిపించకుండా దాచేస్తామని 73 శాతం మంది మహిళలు వెల్లడించారు. భారత్‌లో కొన్ని సామాజిక వర్గాల్లో మహిళలను బహిష్టు సమయాల్లో వంటింట్లోకి రానివ్వరు. ఊరగాయలను తాకనివ్వరు. ఆలయాలకు వెళ్లడం, పూజల్లో పాల్గొనడం నిషిద్ధం! నేపాల్లో మహిళలు నెలసరి సమయంలో ఇంటి బయట గుడిసెల్లో లేదా పశువుల కొట్టంలో ఉండాల్సిందే! జపాన్‌లో మహిళా చెఫ్‌లు బహిష్టు సమయాల్లో వండటానికి వీల్లేదు. వాళ్లు వంట చేస్తే ఆహారంలో రుచి ఉండదని నమ్ముతారు.
 
మహారాష్ట్రలో ‘అస్మిత’
గ్రామీణ బాలికల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ‘అస్మిత’ పేరుతో మహారాష్ట్ర సర్కారు.. విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్స్‌ అందిస్తోంది. అక్కడ ప్రతి నెలా విద్యార్థినులకు 8 ప్యాడ్స్‌ ఉన్న ప్యాక్‌ను రూ.5లకు అందజేస్తారు. గ్రామీణ బాలికలకు ఆన్‌లైన్‌లో శానిటరీ ప్యాడ్స్‌ స్పాన్సర్‌ చేయొచ్చు. మహారాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖకు చెందిన ‘అస్మిత’ పోర్టల్‌లోకి వెళ్లి కనీసం రూ.182 విరాళం ఇవ్వాలి!
 
సిగ్గుపడాల్సిందేమీ లేదు..
పేద మహిళలకు పీరియడ్‌ ప్యాడ్స్‌ అందించాలన్న లక్ష్యంతో కృషి చేసిన అరుణాచలం మురుగనాథమ్‌ జీవితం ఆధారంగా తీసిన ‘ప్యాడ్‌మ్యాన్‌’ సినిమాతో అక్షయ్‌ కుమార్‌ సంచలనం సృష్టించాడు. శానిటరీ ప్యాడ్‌ అందరికీ కనిపించేలా చూపిస్తూ..‘సిగ్గు పడకండి..ఆరోగ్యం మహిళల హక్కు’ అని నినదించాడు. అక్షయ్‌తోబాటు..అమీర్‌ఖాన్‌, అరుణ్‌ ధావన్‌, అనుష్క శర్మ, కరణ్‌జోహార్‌ వంటి బాలీవుడ్‌ సెలబ్రిటీలు శానిటరీ ప్యాడ్‌తో ఫొటో దిగి..‘ప్యాడ్‌మ్యాన్‌ చాలెంజ్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. నెలసరిపై అపోహలు, మూఢ నమ్మకాలను దూరం చేయడానికి మేనకాగాంధీ నేతృత్వంలోని కేంద్ర స్త్రీ శిశుసంక్షేమ శాఖ ప్రయత్నిస్తోంది. ‘గ్రీన్‌ టు రెడ్‌’, ‘పీరియడ్‌ ఆఫ్‌ చేంజ్‌’ పేరుతో ఆన్‌లైన్‌ ఉద్యమాలు మొదలయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాచిగూడ రైల్వే స్టేషన్‌లో శానిటరీ నేప్కిన్‌ వెండింగ్‌ మెషీన్‌ ఏర్పాటు చేశారు.