క్రమం తప్పుతోంది.. ఎందుకు?

31-10-2017: డాక్టర్‌! నా వయసు 40 ఏళ్లు. గత కొన్ని నెలలుగా రుతుక్రమం సక్రమంగా రావడం లేదు. రుతుస్రావంలో హెచ్చుతగ్గులు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ లక్షణాలను మెనోపాజ్‌గా భావించాలా? లేక అనారోగ్యానికి సూచన అనుకోవాలా?

- స్వప్న, రామగుండం.
 
స్వప్న గారూ! 40 ఏళ్ల వయసు నుంచి మెనోపాజ్‌ లక్షణాలు కనిపిస్తున్నాయంటే మీరు ప్రీ మెనోపాజ్‌ దశలో ఉన్నారని అర్థం. రుతుక్రమం పూర్తిగా ఆగిపోలేదు కాబట్టి మీరు కచ్చితంగా మెనోపాజ్‌కు చేరుకున్నారని చెప్పలేం. రుతుక్రమం రావాల్సిన సమయానికి రాకపోయినా, రుతుస్రావంలో హెచ్చుతగ్గులు కనిపించినా మెనోపాజ్‌కు దగ్గరవుతున్నట్టు భావించాలి. మెనోపాజ్‌ దశ వ్యక్తికీ వ్యక్తికీ మారుతూ ఉంటుంది. ఇది తల్లి నుంచి బిడ్డకు వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. తల్లి ఏ వయసులో మెనోపాజ్‌కు చేరుకుంటే పుట్టిన ఆడపిల్ల కూడా అదే వయసుకు మెనోపాజ్‌కు చేరుకునే అవకాశాలున్నాయి. అయితే రుతుక్రమం సమయంలో నొప్పి, దుర్వాసన, దురద మొదలైనవి లేనట్లయితే భయపడనవసరం లేదు. మెనోపాజ్‌కు చేరుకున్నాం కాబట్టి స్త్రీత్వం లేదని కుంగిపోవటమూ సరికాదు. పాజిటివ్‌ యాంగిల్‌లో ఆలోచించి, అందుకు మనసును సన్నద్ధం చేసుకోవాలి. మెనోపాజ్‌ దశలో ఒంట్లో నుంచి వేడి ఆవిర్లు, కోపం, చిరాకు లాంటి లక్షణాలు ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తగ్గటం వల్ల కనిపించే ప్రధాన లక్షణాలు. వీటిని అదుపు చేసే హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ లాంటి చికిత్సలున్నాయి. జీవనశైలిని మెరుగుపరుచుకోవటం, సమతులాహారం, వ్యాయామం...ఈ మూడింటిని అనుసరిస్తే మోనోపాజ్‌లో కూడా నాణ్యమైన జీవితాన్ని గడపొచ్చు.
- డాక్టర్‌. నళిని, గైనకాలజిస్ట్‌, గుంటూరు.