సాఫీగా... నెలసరి!

19-09-2017: ఉన్నట్లుండి, పిల్లలు పెద్దలుగా మారిపోయే ఒక ప్రత్యేక దశ... శరీరంలో ఎన్నో మార్పులు ఏర్పడే ఒక ప్రత్యేకమైన పరిణామ దశ (ప్రీ ఎడోలసెన్స్‌). ఈ దశలో తాము ఆడపిల్లలమనే ఒక భావన ఏర్పడటంతో పాటు, మగపిల్లలకు దూరదూరంగా జరిగే ధోరణి ఒకటి తెలియకుండానే మొదలవుతుంది. ప్రతి బాలికలో సగటున 12 నుంచి 14 ఏళ్ల మధ్య రుతుస్రావ ప్రక్రియ మొదలవుతుంది. ఒక బాలిక, తన బాల్యావస్థ నుంచి యవ్వన దశలోకి (ఎడోలసెన్స్‌) ప్రవేశించింది అనడానికి ఈ తొలి రుతుస్రావమే గీటురాయి. భౌగోళిక పరిస్థితులు, ఆహార, నివాస ప్రభావాల వల్ల ఈ రుతుక్రమం వారం రోజులు అటూ ఇటుగా ఉండవచ్చు. అందుకే 21 నుంచి 35 రోజుల రుతు చక్రాలన్నింటినీ సహజంగానే తీసుకోవాలి.

 
రజస్వల కావడం కూడా ఆయా ప్రాంతాలతో ప్రభావితం అవుతూ ఉంటుంది. 11 నుంచి 16 ఏళ్ల మధ్య కాలంలో రజస్వల కావడం అన్నది ఉష్ణమండల దేశాల్లో సహజం. 14 నుంచి 18 ఏళ్ల మధ్యలో రజస్వల కావడం శీత మండల దేశాల్లో స్వాభావికం. ఒకవేళ ఈ వయసు పరిధి కంటే ముందే రజస్వల అయినా, ఒకవేళ ఆ వయోపరిధి దాటినప్పటికీ రజస్వల కాకపోయినా అది అసహజమనీ, ఆ పరిణామం కొన్ని వ్యాధులకు సంకేతమనీ వైద్యులు గుర్తిస్తారు.
 
పోషకాల పాత్ర ఎంత?
రజస్వల అయ్యింది మొదలు రజస్సు క్షీ ణించే ‘మోనోపాజ్‌’ దాటే వరకు - అంటే సగ టున 12 నుంచి 50 ఏళ్లవరకు సంతానప్రాప్తి అవకాశాలు ఉంటాయి. అయితే అనేక వైద్యపరమైన కారణాల రీత్యా 20 నుంచి 40 ఏళ్ల మఽధ్య కాలమే సంతానానికి యోగ్యమైన వయసుగా గుర్తించబడింది. ఈ యోగ్యత అనేది వారు తీసుకునే పౌష్టికాహారం మీద కూడా ఆధారపడి ఉంటుంది.
 
ప్రత్యేకించి 8 నుంచి 18 ఏళ్ల మధ్య కాలంలో శారీరకంగా, మానసికంగా, లైంగికంగా ఎదగడానికి ప్రధానంగా ఐదు పోషకాంశాలున్న భోజనం చాలా అవసరం. రుతుక్రమం ఎప్పుడూ సవ్యంగా ఉండాలంటే కణజాలాన్ని నిర్మించే మాంసకృత్తులు, జీవక్రియలకు శక్తినిచ్చే పిండిపదార్థాలు, శక్తి గిడ్డంగులుగా ఉండే కొవ్వు పదార్థాలు, జీవ వ్యాపారాలకు మాధ్యమాలుగా లవణ మూలకాలు ఉండి తీరాల్సిందే! అందువల్ల బాగా పోషకాలున్న దినుసులను భోజనంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. అందులో భాగంగా....
బియ్యం, గోధుమలతో పాటు రాగులు, సజ్జలు, కొర్రల వంటి చిరుధాన్యాలను అన్నంగా గానీ, రొట్టెగా గానీ జావగా గానీ తీసుకోవాలి. రోజుకు ఒక పూటైనా గ్రీన్‌ సలాడ్స్‌, ఆయా కాలాల్లో దొరికే పండ్లు, డ్రై ఫ్రూట్స్‌, నట్స్‌ విధిగా తీసుకోవాలి.
నువ్వులు, బెల్లం, కొబ్బరి, పాలు ఇతర పాల ఉత్పత్తులు - ఈ పెరుగుదల వయసులో చాలా అవసరం.
వీటికి తోడు సమశీతోష్ణమైన వాతావరణాన్ని కల్పించుకోవడం కూడా అంతే అవసరం. ఇదే సమయంలో జీవితాన్ని ప్రభావితం చేసే మానసిక ఒత్తిళ్లను కూడా అధిగమించే స్థితిలో ఉండాలి.
బహిష్టువేళల్లో పరిశుభ్రత
ప్రతి నెలా రుతుస్రావం రూపంలో 3 నుంచి 7 రోజుల పాటు పోయే రక్తం, రక్తనాళాల నుంచే ప్రవ హించినా ఇది మలిన రక్తమే తప్ప జీవరక్తం కాదు. ఈ మలినరక్తం సూక్ష్మక్రిములకు నెలవయ్యే ప్రమాదం ఎక్కువ కాబట్టి ఈ స్థితిలో శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.
రక్తస్రావ పరిమాణాన్ని బట్టి రోజుకు రెండు- మూడు సార్లు నేప్కిన్స్‌ మార్చుకోవాలి. జననాంగాన్ని శుభ్రపరుచుకోవడమే కాకుండా రోజూ రెండు పూటలా స్నానం చే యడం మరీ మంచిది.
నేప్కిన్స్‌ లేదా ప్యాడ్స్‌ ఇంట్లో తయారుచేసుకుంటే అవి కాటన్‌వి అయితేనే మంచిది.. ఎందుకంటే రక్తాన్ని బాగా పీల్చుకోగలిగే ధర్మం వాటికే ఉంటుంది.
ఇంట్లో తయారు చేసుకునే ప్యాడ్స్‌ గట్టిపడతాయి కాబట్టి రెండు మూడుసార్లకు మించి వాడకపోవడమే మంచిది.
వాడిన ప్యాడ్స్‌నే మళ్లీ వాడాల్సి వస్తే, వేడినీళ్లల్లో నానబెట్టి, డిటర్జెంట్‌తో ఉతికి ఆరవేసి భద్రపరుచుకోవాలి.
వాడేసిన నేప్కిన్స్‌ను ఎక్కడ బడితే అక్కడ పడేయకుండా కాగితంలో చుట్టి, డస్ట్‌బిన్స్‌లో వేయడం మంచిది.
బహిష్టు బాధల్లో కొన్ని...
కడుపు నొప్పి, నడుము నొప్పి, అతి రక్తస్రావం లేదా అల్ప రక్తస్రావం, బహిష్టు కాకపోవడం, విషమ రక్తస్రావం, వాంతులు - విరేచనాలు, తలనొప్పి, మొటిమలు, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు ఈ బహిష్టు వేళల్లో చాలా మందిని వేఽధిస్తాయి. ఈ సమస్యలు రావడానికి చాలా వరకు పోషకాంశాల లోపాలే కారణం. ప్రత్యేకించి, ప్రొటీన్‌, క్యాల్షియం లోపాలు అధికమైనప్పుడు ఈ సమస్యలు ఎక్కువవుతాయి.
 
కడుపు నొప్పి లేదా నడుము నొప్పి కారణంగా డాక్టర్‌ను సంప్రదించాలనుకుంటే అంతకన్నా ముందు గృహ వైద్య ప్రయత్నాలు చేయడం మంచిది. పొట్ట భాగాన వేడి, తడికట్లు వేసుకోవడం, కాపడం పెట్టడంతో పాటు, నొప్పిని తగ్గించే నూనెలను మృదువుగా మర్దన చేసుకోవచ్చు.
పాలల్లో ఓ నాలుగు వెల్లుల్లి పాయలు వేసి, కొన్ని నీళ్లు కూడా కలిపి పాలు మాత్రమే మిగిలేలా మరిగించి రోజూ సేవిస్తే ఎంతో ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది.
కుంకుడు గింజ పరిమాణంలో పసుపు లేదా బె ల్లంలో ఇంగువ చేర్చి రుతు సమయంలో రోజుకు రెండుసార్లు భోజనం తర్వాత సేవిస్తే నొప్పి తగ్గుతుంది.
రక్తస్రావం మరీ ఎక్కువగా ఉంటే, బూడిద గుమ్మడి రసంలో ఖండ శర్కర తగినంత కలిపి రోజుకు రెండు సార్లు సేవించవచ్చు. లేదా బూడిద గుమ్మడి హల్వా (పేటా హల్వా) తినవచ్చు.
గులాబీ రేకులు, అరటి మొవ్వ, తామర లేదా కలువ రేకులు, ఖండ శర్కర పానకంలో నానబెట్టి రోజూ తింటూ ఉంటే ఫలితం ఉంటుంది.
పైన పేర్కొన్న గృహ వైద్య చిట్కాల ద్వారా రుతు సమస్యలు సమసిపోనప్పుడు తప్పనిసరిగా దగ్గరలో ఉన్న వైద్యులను ప్రత్యేకించి ప్రసూతి - స్త్రీ రోగ వైద్యులను సంప్రదించాలి.
- ప్రొఫెసర్‌ చిలువేరు రవీందర్‌
డాక్టర్‌ బి.ఆర్‌. కె. ఆర్‌ ఆయుర్వేద కళాశాల, హైదరాబాద్‌