గర్భవతులు చక్కెరకు దూరం!

21-09-2017: ఇది మామూలుగా తేల్చిన విషయం కాదు. ఓ పరిశోధనలో వెల్లడైన విషయం. గర్భతులు చక్కెరతో చేసిన తీపి పదార్థాలు తినడం వలన పుట్టబోయే సంతానంలో కొన్ని రకాల అలర్జీలతో పాటు ఆస్తమా, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతాయన్న విషయం ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. గర్భం దాల్చిన వంద మంది మీద వీరు తొమ్మిదినెలల పాటు అధ్యయనం నిర్వహించారు. వీరిలో సగం మందికి చక్కెరతో చేసిన తీపి పదార్థాలను ఇచ్చారు. మిగతా వారికి బెల్లంతో చేసిన తీపి పదార్థాలను అందించారు. ప్రసవం తరువాత వీరికి పుట్టిన పిల్లల ఆరోగ్యాన్ని పరిశీలించారు. చక్కెరతో చేసిన పదార్థాలు తీసుకున్న తల్లులకు పుట్టిన పిల్లల్లో కొంతమందికి కొన్ని రకాల అలర్జీలను గుర్తించారు. అదే బెల్లంతో చేసిన పదార్థాలు తీసుకున్న తల్లులకు పుట్టిన పిల్లల్లో అలాంటి సమస్యలను గుర్తించలేదు. అయితే  తల్లులు కేవలం చక్కెరతో చేసిన పదార్థాలు తీసుకున్నందువలనే పిల్లల్లో ఈ సమస్యలు ఎదురయ్యాయా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న విషయం మీద ఇంకా అధ్యయనాలు నిర్వహించాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఏది ఏమైనా గర్భవతులు చక్కెరతో తయారు చేసిన తీపి పదార్థాలకు దూరంగా ఉంటేనే మంచిదని వీరు సూచిస్తున్నారు.