గర్భవతుల విషయంలో ఇవన్నీ అనుమానాలేనా..

‘పెద్దల మాట చద్ది మూట’, ‘బామ్మ బాట బంగారు బాట’ ఇలాంటి పదాలు తరచూ వింటూనే ఉంటాం. ఆ తరువాత విసుక్కుంటూనే ఉంటాం. 21వ శతాబ్దంలో కూడా ఈ మాటలేంటి? ఈ నమ్మకాలంటి? అనే వారే ఎక్కువ. పెద్దలు చెప్పే కొన్ని మాటలు విసుగు తెప్పించినా, వాటిల్లో బోలడంత అర్థం దాగి ఉంటుంది. వారు చెప్పేవన్నీ జీవనసత్యాలే కానీ, పోచుకోలు కబుర్లు కావు అన్న విషయం కొన్నిసందర్భాలలో సశాస్త్రీయంగా రుజువైంది కూడా! ముఖ్యంగా గర్భవతిగా ఉన్న స్త్రీ విషయంలో పెద్దలు ఎన్నో జాగ్రత్తలు చెబుతుంటారు. పుట్టబోయేది మగపిల్లవాడా? ఆడపిల్లా? అన్న విషయాన్ని కూడా అంచనా వేసి చెబుతుంటారు. వారి అంచనాలు, జోస్యాలు చాలా వరకూ నిజమవుతుంటాయి కూడా! అందుకే వారి మాటలను తోసిపారేయకూడదు. గర్భవతుల విషయంలో వారు చెప్పే నమ్మకాలు, అంచనాల గురించి....

తొందరపడి చెప్పకూడదు: ఆడపిల్ల నెలతప్పిన విషయాన్ని అందరికీ వెంటనే చెప్పకూడదు అంటూంటారు ఇంట్లోని పెద్దవారు. దానికి వారు చెప్పే కారణాలు ఇవి. అందరి మనస్సులు స్వచ్ఛంగా ఉండవు. మనకి మంచి జరుగుతోందని తెలిస్తే బాధపడేవారే ఎక్కువగా ఉంటారు కనుక, ఈ విషయాన్ని వెంటనే అందరికీ చెప్పద్దొంటారు. నాలుగైదు నెలల తరువాత చెబితే ఎలాంటి సమస్య రాదు అన్నది వారి వాదన.

నిజం: వీరి మాటలు నూటికి నూరుపాళ్ళు నిజమే! వారి మాటలను కొద్దిసేపు పక్కన పెడితే వెంటనే అందరికీ చెప్పడం మంచిది కాదు. తొలి నెలల్లో గర్భస్రావం కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే నాలుగైదు నెలలు తరువాత అయితే గర్భస్రావం అయ్యే అవకాశాలు చాలా వరకూ తగ్గిపోతాయి. సో....గర్భవతి అయిన విషయాన్ని వెంటనే కాకుండా కాస్త నెమ్మదిగా బయటప్రపంచానికి తెలియజేస్తేనే బెటర్‌! కాకపోతే వ్యక్తిగత అంశాలనూ, చుట్టు పక్కల ఉండే పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

గుండెల్లో మంటకీ, జుత్తుకీ లింకు: గర్భవతులకు కొన్ని సార్లు గుండెల్లో మంటగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడూ వాంతులు కూడా అవుతుంటాయి. ఈ విషయాన్ని గమనించిన ఇంట్లోని వారు కడుపులో ఉన్న బిడ్డకి జుత్తు ఎక్కువగా ఉన్నట్టుంది. అందుకే ఈ మంట, వాంతులు అని అంటూంటారు.

నిజం: వీరి మాట ముమ్మాటికి నిజం అన్న విషయం పరిశోధనల ద్వారా కూడా రుజువైంది. కడుపులో ఉన్న బిడ్డ జుత్తుకీ, గర్భవతి గుండెల్లో మంటకీ అవినావ సంబంధం ఉందన్న విషయం హావ్‌కిన్స్‌ యూనివర్సిటీ వారు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. సుమారు 70 మంది గర్భవతుల మీద వీరు అధ్యయనం నిర్వహించారు. గుండెల్లో మంట, వాంతుల సమస్యతో బాధపడే తల్లులకు పుట్టిన పిల్లల జుత్తు ఒత్తుగా, పొడవుగా ఉండగా, పై లక్షణాలు లేని తల్లులకు పుట్టిన పిల్లల్లో కొందరికి జుత్తు మామూలుగా ఉండడాన్ని వీరు గుర్తించారు. దీన్ని బట్టి ఇంట్లో బామ్మలు, అమ్మమ్మలు చెప్పే మాటలు నమ్మితీరాల్సిందే అంటున్నారు నిపుణులు.

అరటిపండు తింటే అబ్బాయి: మన ఇంట్లో ఉండే పెద్దలు గర్భవతులను అరటిపండు తినమంటూ తరచూ చెబుతుంటారు. అలా తింటే అబ్బాయి పుడతాడని వీరి నమ్మకం. అదేంటి? అరటిపండు తింటే అబ్బాయి లేకపోతే అమ్మాయి పుడుతుందా? అసలు ఇది ఎలా సాధ్యం? ఇది నమ్మదగిన విషమేనా అనిపించవచ్చు. వారి మాటల్లో నిజానిజాలు ఎలా ఉన్నా, వారి మాటను వింటే ఆరోగ్యమే తప్ప ఆరోగ్య హాని జరగదు.

నిజం: బామ్మలు, అమ్మమ్మలు తరచూ చెప్పే ఈ మాటలో బోలెడం నిజం ఉంది. అరటిపండులో ఉండే పొటాషియం, ఇతర పోషకాలు హార్మోన్ల స్థితి మారడానికి దోహదం చేస్తాయి. ఇలా మారడం అనేది అబ్బాయి పుట్టడానికి దోహదం అవుతుందన్న విషయం పలు పరిశోధనల్లో వెల్లడైంది. కాకపోతే కేవలం అరటిపండు తినడం వలనే కచ్చితంగా అబ్బాయే పుడతాడా? అన్న విషయాన్ని మాత్రం వీరు నిర్ధారించలేకపోతున్నారు.

ఎక్కువ నొప్పులు వస్తుంటే అబ్బాయే: మగపిల్లల కన్నా ఆడపిల్లలే చాలా త్వరగా బయటకి వస్తారు అని మన పెద్దలు, నమ్ముతుంటారు. గర్భవతి ప్రసవవేదన ఎక్కువ పడుతుంటే అబ్బాయి పుడతాడని అంటూంటారు. ఆడపిల్ల పుట్టిన తరువాత ఏడిపిస్తే, మగపిల్లలు పుట్టక ముందు ఏడిపిస్తారు అన్నది మన అమ్మమ్మలు, బామ్మల మాట. నిజానికి ఈ నానుడిని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు. ఏ బిడ్డ అయినా తల్లికి ప్రవసవేదన తప్పదు. కానీ పెద్దల మాట నిజమే అన్న విషయం కొన్ని అధ్యయనాల్లో స్పష్టమైంది. 

నిజం: ఆరుగంటల కన్నా ఎక్కువ సేపు ప్రసవవేదన అనుభవించిన గర్భవతులకు మగపిల్లలు పుట్టిన విషయాన్ని కొన్ని అధ్యయనాలలో స్పష్టమైంది. సుమారు నాలుగు సంవత్సరాల పాటు పలువురు గర్భవతుల మీద అధ్యయనం నిర్వహించిన అనంతరం, ఆడపిల్ల కన్నా మగపిల్లలు ఆలస్యంగా పుట్టడాన్ని వీరు గమనించారు. దీనికి కారణాన్ని కూడా వీరు చెబుతున్నారు. ఆడపిల్ల కన్నా మగపిల్లలు మూడు ఔన్సుల బరువు ఎక్కువగా ఉంటారనీ, అందుకే ప్రసవవేదన ఎక్కువగా ఉంటుందనీ చెబుతున్నారు. కొన్ని సార్లు ఆడపిల్లలకు కూడా ప్రసవవేదన ఎక్కువగానే ఉంటుంది కనుక పై మాటలను నమ్మడానికీ లేదు, అలాగని కొట్టిపారేయలేం కూడా!

చనిపోయినవారి దగ్గరకు వెళ్ళకూడదు: గర్భవతులు చనిపోయిన వారిదగ్గరకు వెళ్ళకూడదని పెద్దలు చెబుతుంటారు. ఎంత దగ్గరవారైనా సరే చూడడానికి వెళ్ళొద్దని గట్టి ఆంక్షలే విధిస్తారు. కానీ అలా వెళ్ళడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు.

నిజం: చనిపోయిన వారిని చూసిన వెంటనే బాధ కలగడం సహజం. అది గర్భస్థ శిశువు మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. తల్లి తీవ్రమైన ఒత్తిడికీ, భావోద్వేగానికి గురైతే ఆ ప్రభావం గర్భస్థ శిశువు మీద పడుతుంది అంటున్నారు నిపుణులు. ఒత్తిడి, ఆందోళన వంటికి గర్భస్రావం కావడానికీ, లేదా నెలలు నిండకుండానే ప్రసవం కావడానికి కారణం కావచ్చు కనుక, పెద్దల మాటలు విని చనిపోయిన వారిని చూడకుండా ఉంటేనే మంచిది.

పొట్ట ఆధారంగా లింగ నిర్ధారణ: ఇప్పుడున్నట్టుగా పూర్వకాలంలో స్కానింగులు అవీ ఉండేవి కావు. గర్భవతి పొట్టను చూసే పుట్టబోయేది మగబిడ్డా, ఆడబిడ్డా అన్నది అంచనా వేసేవారు. పొట్ట కిందికి ఉంటే మగపిల్లవాడనీ, పొట్ట పైకి ఉంటే ఆడపిల్లని చెప్పేవారు.

నిజం: ఈ అంచనా పూర్తిగా నిరాధారమైందే అంటారు నిపుణులు. పొట్ట స్త్రీ ఆకృతి మీద ఆధారపడి ఉంటుంది తప్ప లోపల ఉన్న బిడ్డను అనుసరించి కాదని చెబుతున్నారు వారు. ఈ విషయానికి సంబంధించి ఇప్పటి వరకూ శాస్త్రీయ రుజువులేవీ లేకు కనుక ఇది మూఢనమ్మకమే అనుకోవచ్చు.

కుంకుమ పువ్వుతో రంగు: స్త్రీ గర్భవతి అని తెలియగానే పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుని తాగమని సలహా ఇస్తుంటారు ఇంట్లో ఉండే అమ్మమ్మలు, బామ్మలు. కుంకుమపువ్వు కలిపిన పాలు తాగితే కడుపులో ఉండే బిడ్డ మంచి రంగుతో పుడతాడని వారి నమ్మకం.

నిజం: ఈ విషయం కూడా శాస్త్రీయంగా ఇంత వరకూ రుజువు కాలేదు. కాకపోతే పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని తాగడం వలన తల్లీ, బిడ్డా ఆరోగ్యం చక్కగా ఉంటుంది.