గర్భనిరోధక ఇంజెక్షన్‌.. ఒక్కసారి వేయించుకుంటే..!

10-09-2017: అవాంచిత గర్భాన్ని అడ్డుకొనేందుకు సులువైన మార్గం అందుబాటులోకి రాబోతోంది. ఒకే ఒక్క ఇంజెక్షన్‌తో మూడు నెలల పాటు గర్భధారణను వాయిదా వేసుకోవచ్చు. ఈ ఇంజెక్షన్లు త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి రాబోతున్నాయి. దేశంలో జనాభా నియంత్రణకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇంట్రా మస్క్యులర్‌ ఇంజెక్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ ఇంజెక్షన్‌ను ప్రజారోగ్య వ్యవస్థలో లాంఛనంగా ప్రారంభించారు. తొలి దశగా పది రాష్ట్రాల్లో దీన్ని అందుబాటులోకి తెస్తున్నారు. దేశంలో ఇదే తొలి ఇంజెక్టబుల్‌ కాంట్రసెప్టివ్‌. శాస్త్రీయంగా దీనిని డీఆక్సీ మెడ్రాక్సి ప్రొజెస్టిరాన్‌ ఎసిటేట్‌గా పిలుస్తారు.
 
ఈ గర్భనిరోధక ఇంజెక్షన్‌ను మహిళ తుంటికి లేదా చేతి కండరాలకు చేస్తారు. ఈ ఇంజెక్షన్‌ చేయించుకున్న తర్వాత మూడు నెలల పాటు అండాల విడుదల నిలిచిపోతుంది. ఫలితంగా మహిళ గర్భం ధరించే అవకాశం ఉండదు. 18 నుంచి 45 ఏళ్ల వివాహిత మహిళలు ఈ ఇంజెక్షన్లను వినియోగించుకొని అవాంఛిత గర్భధారణను నిరోధించవచ్చని వైద్య శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. గర్భనిరోధక ఇంజెక్షన్లను తొలి దశలో ప్రభుత్వ బోధనాస్పత్రులకు, జిల్లా కేంద్ర ఆస్పత్రులకు పంపిణీ చేస్తారు. అనంతరం దశల వారీగా ప్రాంతీయ ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేస్తారు.
 
కొత్తగా వీటిని ప్రవేశపెట్టడంతో మహిళలకు అవగాహన కల్పించేందుకు ఆశాలతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఒక్కసారి ఇంజెక్షన్‌ చేస్తే మూడు నెలల పాటు అండాల విడుదలను నిలిచిపోతుండడంతో జనాభా నియంత్రణ, అవాంచిత గర్భ నిరోధానికి ఇది సులవైన మార్గంగా కేంద్రం భావిస్తోంది. ఫ్యామిలి ప్లానింగ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ను కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దీని ద్వారా ఏ జిల్లాలో గర్భనిరోధ సాధనాల అవసరం ఎంత మేరకు ఉందనే విషయాన్ని తెలుసుకుని డిమాండ్‌కు తగినట్లుగా కేంద్రం సరఫరా చేస్తుంది. గర్భ నిరోధక సాధనాలు అందుబాట్లో లేకపోవడమే 12.9 శాతం అవాంఛిత గర్భాలకు కారణమని తాజా సర్వేలో వెల్లడైంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పీహెచ్‌సీ స్థాయి వరకు గర్భనిరోధక ఇంజెక్షన్‌లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.
 
జనాభా నియంత్రణకు కీలక అడుగు
జనాభా నియంత్రణ కోసం ఇప్పటి వరకు ప్రజారోగ్య వ్యవస్థలో కండోమ్‌లు, కాపర్‌ టీ, గర్భ నిరోధక మాత్రలు, ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ వంటి పద్ధతులు అమల్లో ఉన్నాయి. కొత్తగా గర్భ నిరోధక ఇంజెక్షన్లను ప్రవేశపెట్టారు. ఇది జనాభా నియంత్రణలో కీలక అడుగుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది. బిడ్డకు బిడ్డకు ఎడం ఉంచేందుకు ఈ ఇంజెక్షన్లు ఎంతగానో ఉపయోగపడతా యి. దీనివల్ల 30 శాతం మాతృ మరణాలు, 10 శాతం శిశు మరణాలను కూడా నిరోధించవచ్చని పేర్కొన్నాయి.