నెలసరి ఆలస్యమైతే?

ఆంధ్రజ్యోతి, 05-03-2018: నెలసరి ఆలస్యమవటానికి గర్భమే కారణం కానక్కర్లేదు. ఇందుకు ఎన్నో శారీరక, మానసిక కారణాలుంటాయి. సాధారణంగా స్త్రీ జీవితంలో రెండు సందర్భాల్లో మాత్రమే నెలసరి సమస్యలొస్తాయు. అవి... 1. నెలసరి ప్రారంభంలో 2. మెనోపాజ్‌ దశలో. ఈ రెండు సందర్భాలు మినహా నెలసరి తేదీల్లో ఎప్పుడు హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నా ఈ క్రింది కారణాల మీద దృష్టి పెట్టాలి.

ఒత్తిడి: ఒత్తిడి వల్ల తలనొప్పి, చర్మ సమస్యలు, బరువు పెరగటంతో పాటు నెలసరి కూడా ఆలస్యమవుతుంది. ఒత్తిడికి లోనయినప్పుడు శరీరం అడ్రినలిన్‌, కార్టిసాల్‌ అనే స్ట్రెస్‌ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ల ప్రభావం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ గతితప్పి, నెలసరి ఆలస్యమవుతుంది.
 
రుగ్మతలు: అండం విడుదలయ్యే సమయంలో జబ్బు పడితే ఆ ప్రక్రియ ఆగిపోతుంది. దాంతో నెలసరి వాయిదా పడుతుంది. కాబట్టి నెలసరి ఆలస్యమైతే అంతకు కొన్ని వారాల ముందు రుగ్మత బారిన పడ్డారేమో గుర్తు తెచ్చుకోండి.
 
విపరీతంగా బరువు తగ్గితే: మీ బిఎమ్‌ఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) 18 కంటే తగ్గితే మీ నెలసరి ఆలస్యమవ్వొచ్చు.
 
గర్భనిరోధక సాధనాలు: గర్భనిరోధక ఇంజెక్షన్లు, మాత్రల వాడకం వల్ల కొందర్లో నెలసరి క్రమం తప్పవచ్చు.
 
థైరాయిడ్‌: అవసరానికి మించి థైరాయిడ్‌ హోర్మోన్‌ స్రవించే ‘హైపర్‌ థైరాయిడ్‌’, సరిపడా థైరాయిడ్‌ తయారుకాని ‘హైపో థైరాయిడ్‌’....ఈ రెండు పరిస్థితుల్లో నెలసరి ఆలస్యమవ్వొచ్చు.