నెలసరి క్రమం తప్పితే?

02-07-2018: గర్భం దాల్చినప్పుడు, మెనోపాజ్‌కు చేరుకున్నప్పుడు తప్ప మహిళల నెలసరి ఎప్పుడూ క్రమం తప్పదు. అలా తప్పిందంటే అందుకు శారీరక సమస్యే కారణం అయి ఉంటుంది. గమనించండి!
 
అధిక ఒత్తిడి: కొంతకాలంపాటు ఒత్తిడి కొనసాగితే, మహిళల శరీరం ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి అవసరమయ్యే శక్తి కోసం అండాల విడుదలను ఆపేస్తుంది. ఏదైనా జరగకూడనిది జరిగినా, అడ్రినలిన్‌ అవసరానికి మించి స్రవించి, దాని ప్రభావం వల్ల ఈస్ట్రోజెన్‌, పునరుత్పత్తి హార్మోన్ల స్రావాల్లో తేడా రావొచ్చు. ఈస్ట్రోజెన్‌ తగినంత లేనప్పుడు గర్భాశయంలో పలచని పొర ఏర్పడే పరిస్థితి ఉండదు. ఫలితంగా నెలసరి రాదు.
 
ఆహార లోపం: యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు, ప్రోబయాటిక్స్‌ లోపించిన, ఉత్ర్పేరకాలు ఎక్కువగా ఉన్న డైట్‌ వల్ల అడ్రినలిన్‌, థైరాయిడ్‌ గ్రంథులు దెబ్బ తింటాయి. ఉదాహరణకు చక్కెరలు ఎక్కువగా ఉండి, హైడ్రోజెనేటెడ్‌ ఫ్యాట్స్‌, కృత్రిమ రంగులు, పురుగు మందులు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల థైరాయిడ్‌, అడ్రినల్‌ సమస్యలు తలెత్తుతాయి. కార్టిసాల్‌ స్రావం పెరిగితే మిగతా హార్మోన్లు, మరీ ముఖ్యంగా సెక్సువల్‌ హార్మోన్ల ప్రభావం కుంటుపడుతుంది.
 
బరువు తగ్గడం: మీ బాడీ మాస్‌ ఇండెక్స్‌ 18 - 19 కంటే తక్కువకు పడిపోతే, శరీరంలో కొవ్వు కూడా తగ్గుతుంది కాబట్టి ఆ ప్రభావం నెలసరి మీద కూడా పడుతుంది. తగినంత ఈస్ట్రోజెన్‌ తయారీకి శరీర కొవ్వు ఎంతో అవసరం. విపరీతమైన శారీరక శ్రమ వల్ల, పెరుగుతున్న పోషకాల అవసరం తీరకపోవడం వల్ల కూడా శరీర బరువు తగ్గి హార్మోన్ల అసమతౌల్యత కూడా ఏర్పడుతుంది.
 
థైరాయిడ్‌ సమస్యలు: 15% మంది మహిళల ‘అనరోయియా’ (నెలసరి సమస్య)కు థైరాయిడ్‌ గ్రంథి సమస్యలే కారణం. కాబట్టి హైపో, హైపర్‌ థైరాయిడ్‌ సమస్య ఉందేమో లక్షణాలను బట్టి గ్రహించి చికిత్స తీసుకోవాలి.