గర్భిణుల దగ్గర ఇవి ఎప్పుడూ ఉండాలి...

20-11-2017:తల్లి కాబోతున్న మహిళలు బయటకు వెళ్లేటప్పుడు కింద పేర్కొన్న వాటిని తప్పనిసరిగా దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే గర్భవతులుగా ఉండేటప్పుడు వీరి శరీరంలో రకరకాల మార్పులు చోటుచేసు కుంటుంటాయి. హార్మోన్ల సంఖ్య పెరుగుతుంది. ఆ టైములో ఆరోగ్యం, పరిశుభ్రానికి సంబంధించిన పలు సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఎక్కడికి వెడుతున్నా ఈ కింది వాటిని తీసుకెళ్లడం మరవొద్దు. అవి...

 
 గర్భిణులు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంచినీటిని దగ్గర పెట్టుకోవాలి. నీళ్లు బాగా తాగాలి. నీళ్లు బాగా తాగడం వల్ల తల్లితోపాటు కడుపులోని బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు ప్రసవ సమయంలో నె ప్పుల తీవ్రత ఎక్కువగా ఉండదు. శరీరంలో నీరు సమృద్ధిగా ఉండడం వల్ల శారీరకంగా, మానసికంగా కూడా వీళ్లు ఎంతో ఉల్లాసంగా ఉంటారు.
మంచినీళ్లతోపాటు కొన్ని స్నాక్స్‌ కూడా అంటే బాదంపప్పులు, యాపిల్‌ ముక్కలు లాంటి వాటిని గర్భిణీలు తమ వెంట తీసుకెళ్లాలి. ఈ సమయంలో వీరికి ఆకలి బాగా వేస్తుంది.
బయటకు వెళ్లినప్పుడు టాయిలెట్‌ అవసరం వీళ్లకి బాగా ఎదురవు తుంటుంది. కానీ బయటి వాష్‌రూమ్స్‌ శుభ్రంగా ఉంటాయో లేదోనన్న భయంతో చాలామంది గర్భిణీ స్ర్త్రీలు తమ శారీరక అవసరాన్ని ఆపుకుంటుంటారు. ఇలా చేయడం శరీరానికి మంచిది కాదు. అందుకే గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లినపుడల్లా తప్పనిసరిగా టాయిలెట్‌ సీట్‌ శానిటైజర్‌ స్ర్పే తీసుకువెళ్లాలి. ఈ స్ర్పేని ఉపయోగించడం వల్ల తల్లిబిడ్డలు ఎలాంటి ఇన్ఫెక్షన్ల బారినా పడరు.
ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది మహిళలు అజీర్ణంతో బాధపడుతుంటారు. అలాగే గుండెల్లో మంట కూడా వీళ్లకి ఉంటుంది. దీని కారణంగా వీళ్లు చాలా అసౌకర్యంగా ఫీలవుతుంటారు. ఈ సమస్య బిడ్డ పుట్టేవరకూ తల్లులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఎక్కడికి వెళ్లేటప్పుడైనా సరే తప్పనిసరిగా యాంటాసిడ్‌ టాబ్లెట్లను దగ్గర ఉంచుకుంటే మంచిది.
ప్రెగ్నెన్సీ సమయంలో వెన్నునొప్పితో చాలామంది మహిళలు బాధపడుతుంటారు. అందుకే వీళ్లు ఎక్కడికి వెళ్లినా తమ వెంట హీటింగ్‌ ప్యాడ్‌ను తీసుకెడితే మంచిది. ఇది వెన్నునొప్పి నుంచి సాంత్వన నిస్తుంది. పైగా హీటింగ్‌ ప్యాడ్స్‌ తీసుకెళ్లడానికి ఎంతో అనువుగా కూడా ఉంటాయి.