శీతల పానీయాలతో సంతానలేమి!

29-05-2018: శరీర పోషణకోసం అంటూ మనం తీసుకునే ఆహార పానీయాల్లో కొన్ని నేడు మన ఆరోగ్యాన్నే దెబ్బ తీసే పరిస్థితులు తయారవుతున్నాయి. ఒక దశలో పునరుత్పత్తి వ్యవస్థనే నిర్జీవంగా మార్చేస్తున్నాయి. ప్రత్యేకించి సోడాలు, ఇతర శీతల పానీయాలు (సాఫ్ట్‌ డ్రింక్స్‌) కొన్ని సేవించడం వల్ల స్త్రీ పురుషులు ఇరువుల్లోనూ సంతాన లేమి సమస్యలు తలెత్తుతున్నాయి. గమనిస్తే, దాదాపు అన్నిరకాల శీతల పానీయాల్లోనూ కృత్రిమ తీపిని కలిగించే ఆస్పరేటమ్‌ అనే పదార్థం కనపడుతుంది. ఇది ఎండోక్రైన్‌ గ్రంథుల మీద దుష్ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, ఇది కూడా సంతానోత్పత్తి సమస్యలకు కారణమవుతుంది. సోడాలు, శీతలపానీయాలను అతిగా సేవించే స్త్రీలలో అండాశయ సమస్యలు ఏర్పడటంతో పాటు పీ.ఎమ్‌. ఎస్‌ (ప్రీ మెన్‌స్టురల్‌ సింటమ్స్‌) లో హెచ్చు తగ్గులు ఏర్పడతాయి. ఈ ఆస్పరేటమ్‌ వల్ల సంతానోత్పత్తి సమస్యలతో పాటు గర్భస్రావాలు, గర్భస్థ శిశు వైకల్యాలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.

 
 ఆస్పరేటమ్‌లో సహజంగానే ఫినైలలానిన్‌, ఆస్పెర్టిక్‌ యాసిడ్‌ అనే రెండు ఆమ్లాలు కూడా ఉంటాయి. వీటిని ఇతర అమైనో ఆమ్లాలతో కలిపి సేవిస్తే హానికరమేమీ కాదు. అలా మరి వేటితోనూ కలపకుండా విడిగా సేవిస్తే, శరీర కణాలు చనిపోయే అవకాశం ఉంది. మరీ ఎక్కువగా సేవిస్తే, పురుషుల వీర్యకణాలు, స్త్రీల అండకణాలు దాదాపు 90 శాతం దాకా నశించే ప్రమాదం ఉంది.
 ఎక్కువ తీయగా ఉండే ఇలాంటి పానీయాలు ఏవి తాగినా, వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తుంది. సంతానోత్పత్తికి అతి ముఖ్యమైన అంశాలు శరీరంలో తగ్గిపోతాయి. హార్మోన్ల అసమతుల్యతతో పాటు ఊబకాయం వచ్చేస్తుంది.
 శీతల పానీయాలు ఎక్కువగా తాగే పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, జీవత్వం, వాటి చలనశక్తి తగ్గే అవకాశం ఉంది. సోడాల్లో ఆమ్లాలు మరీ ఎక్కువ గా ఉంటాయి. వీటివల్ల పీ.హెచ్‌. శాతం మారిపోతూ ఉంటుంది. పీ.హెచ్‌ ఎక్కువైతే, ఫోషకాలు నిలవవు. దీనివల్ల వీర్యకణాల ఆకారం మారడం, నాణ్యత లోపించడం, లేదా వీర్యకణాలు చనిపోవడం జరగవచ్చు. వీటిల్లో ఉండే బిస్‌ ఫినాల్‌-ఎ (బిపిఎ) అనే రసాయనం వల్ల పురుషుల వీర్యధ్రవం, నాణ్యత క్షీణిస్తాయి.
 శీతల పానీయాల్లో ఎక్కువ గా కెఫిన్‌ కలుస్తుంది. ఫ్రక్టోస్‌ కూడా ఉంటుంది. స్త్రీలల్లో వీటివల్ల అండాశ య సమస్యలు, సంతానోత్పత్తి సమస్యలు ఎక్కువవుతాయి. కెఫిన్‌ కారణంగా, రక్త నాళాలు ముడుచుకుపోవడంతో, గర్భాశయంలోకి రక్తప్రసరణ తగ్గిపోతుంది. దీనివల్ల రుతుక్రమం దెబ్బతింటుంది. కెఫిన్‌, ఆస్పరటేమ్‌, ప్రక్టోస్‌ ఈ మూడింటినీ కలిపి సేవించడం వల్ల సెక్స్‌ హార్మోన్లు, హార్మోన్‌ గ్రాహకాల పై దుష్ప్రభావం పడటంతో వంధ్యత్వం కలుగుతుంది. అందుకే సంతానం కోరుకునే స్త్రీ పురుషులు ఇరువురూ సోడా, శీతల పానీయాలకు దూరంగా ఉండడం ఎంతో మేలు.
డాక్టర్‌ స్వాతి మోతే,
గైనకాలజిస్ట్‌ అండ్‌ ఐ.వి.ఎఫ్‌ నిపుణురాలు
ఇందిరా ఐవిఎఫ్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌