డెలివరీ తర్వాత... మళ్లీ మామూలు అయ్యేదెలా?

నాకు డెలివరీ అయి ఐదు నెలలు అవుతోంది.  గర్భధారణకు ముందు ఉన్న బరువును చేరుకోవడానికి ఏమి చెయ్యాలి?
- స్వాతి, సిద్దిపేట
మీ బిడ్డకు అయిదు నెలలే కాబట్టి, మరో నెల రోజుల వరకూ తల్లి పాలు మాత్రమే పట్టడం శ్రేయస్కరం. ఆ తరువాత ఏడాది దాకా ఘనాహారంతో పాటు, రోజుకు ఓసారైనా తల్లి పాలు ఇవ్వడం మంచిది. కాబట్టి మీకూ  పోషకాహారం అవసరం. బిడ్డకు పాలు ఇచ్చే మొదటి ఆరు నెలలూ ఆహారంలో అరవై నుంచి డెబ్బై గ్రాముల మాంసకృత్తులు ఉండాలి. దీనికోసం పాలు, పెరుగు, గుడ్లు, పప్పుధాన్యాలు, మాంసాహారం తీసుకునేవారైతే వారంలో రెండు సార్లు చికెన్‌ లేదా చేపలు తీసుకుంటే చాలు. ఇంకా రోజూ కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగడం అవసరం. బరువు తగ్గడానికి ఆహారాన్ని నియంత్రిస్తే, బిడ్డకు పాలు తక్కువయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అవసరమయ్యే దాని కంటే రెండు నుంచి మూడు వందల కెలోరీలు తక్కువ తీసుకుంటే నెమ్మదిగా బరువు తగ్గుతారు, బిడ్డ పాలకూ ఇబ్బంది ఉండదు. ఘనాహారం మొదలుపెట్టిన తరువాత మరి కొన్ని కెలోరీలు తగ్గించొచ్చు. పళ్ళు, ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు...  ఖనిజ లవణాలను అందిస్తాయి. ఆహార జాగ్రత్తలతో పాటు ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు ఏదైనా వ్యాయామం చేయాలి లేదా వేగంగా నడవాలి.