మెనోపాజ్‌తో గుండె వ్యాధులు?

28-03-2018: గుండె సంబంధిత సమస్యలు మగవారిలోనే ఎక్కువ, స్త్రీలలో తక్కువ అన్న విషయం తెలిసిందే! కానీ మెనోపాజ్‌కి చేరుకున్న స్త్రీలలో గుండె సంబంధిత సమస్యలు, వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు పరిశోధకులు. దీనికి కారణం మెనోపాజ్‌కు చేరుకున్న స్త్రీలలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గిపోవడమే అని చెబుతున్నారు ఈ హార్మోను గుండె ధమనులు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందనీ, ఆలాంటిది ఇది తగ్గుముఖం పట్టడం వలన క్రమేపీ గుండె ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అయితే మెనోపాజ్‌కి చేరుకున్న స్త్రీలందరిలో ఈ విధంగా గుండె సంబంధిత సమస్యలు కనిపించకపోవచ్చనీ, ఆ దశలో పోషకాహారం తీసుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని వీరు సూచిస్తున్నారు. మెనోపాజ్‌కు చేరుకున్న స్త్రీలు హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ ద్వారా కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చంటున్నారు. అయితే డాక్టర్ల సలహా మేరకే దీన్ని తీసుకోవలని స్పష్టం చేస్తున్నారు.