అమ్మతనం నిలిచి గెలిచింది!

31-07-2018:‘సబర్‌ కా ఫల్‌ మీఠా హోతా హై’! (ఎదురుచూపుల ఫలితం తీయగా ఉంటుంది) అందుకు మా పాపే నిదర్శనం!’ పసిగుడ్డ్డును గుండెలకు హత్తుకుంటూ చెప్పిన ఆ తల్లి కళ్లల్లో ఆనందభాష్పాలు! ఒకటి కాదు... రెండు కాదు... ఐదోసారి దాల్చిన గర్భం నిలుస్తుందో లేదో అనే ఆందోళనతో ఛత్తీస్‌గఢ్‌ నుంచి హైదరాబాద్‌కు పరుగెత్తుకొచ్చారు నిఖిత, సౌరభ్‌ అజుమానీ దంపతులు. ఎట్టకేలకు 375 గ్రాములతో పుట్టిన బిడ్డ వైద్యులకు సవాలు విసిరింది. 128 రోజులపాటు ఇంక్యుబేటర్‌లో పోరాడి గెలిచింది. ఆ సమయంలో క్షణమొక యుగంగా గడిపిన ఆ తల్లితండ్రుల భావోద్వేగాలు... వారి మాటల్లోనే...
 
నాకే ఎందుకీ శిక్ష.. అనుకున్నా!
మాది ఛత్తీస్‌గఢ్‌! పెద్దలు కుదిర్చిన వివాహం. నేనూ, ఆయనా ఇద్దరం ఆరోగ్యవంతులం. ఇరువైపు కుటుంబాల్లోనూ ఎవరికీ ఎటువంటి వ్యాధులు లేవు. అయినా నా మొదటి గర్భం ఆరో నెలలోనే పోయింది. ఆ రోజు ఏం జరిగిందో ఇప్పటికీ గుర్తుంది. నాకు హఠాత్తుగా ఆరో నెలలోనే నొప్పులు మొదలయ్యాయి. కొందరికి ప్రీ మెచ్యూర్‌ డెలివరీ అవుతూ ఉంటుంది కాబట్టి, నాకూ అలా జరుగుతుందేమో? అనుకుని ఆస్పత్రికి చేరుకున్నాం! ఉమ్మనీరు తక్కువగా ఉందని, నాకు సిజేరియన్‌ చేసి, రూమ్‌లో పడుకోబెట్టారు. తెలివొచ్చాక చూస్తే పక్కనున్న ఉయ్యాల ఖాళీగా కనిపించింది. ‘పాప పుట్టింది’ అని చెప్పారు, ‘ఏదీ?’ అని అడిగితే వైద్యులూ, నర్సులూ, ఆఖరికి మా వారు కూడా... ‘పాపకు కొద్దిగా సుస్తీగా ఉంది. అందుకే ఇంక్యుబేటర్‌లో పెట్టాం!’ అన్నారు. అలా దాదాపు 15 రోజులపాటు పాపను నాకు చూపించలేదు.
 
నాకెందుకో అనుమానం వచ్చి, నిలదీశాను. అప్పుడు గుండెలు పగిలే వార్త చెప్పారు. పాప పుట్టిన వెంటనే ప్రాణాలు కోల్పోయింది. సర్జరీ నుంచి కోలుకుంటున్న నా పరిస్థితి చూసి ఆ నిజాన్ని నా దగ్గర దాచారు. ‘ఓరి భగవంతుడా! తొలి చూలును ఎందుకిలా చేశావు?’ అంటూ ఎంతో బాధ పడ్డాను. ఆ తర్వాత గుండె దిటవు చేసుకుని, ‘రెండోసారి జాగ్రత్తగా ఉండాలి!’ అనుకున్నా. అయితే వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రెండోసారి, మూడోసారి, నాలుగోసారి.... వరుసగా అబార్షన్లు అయ్యాయి. దెబ్బ మీద దెబ్బ మా దంపతులిద్దరినీ కుంగదీసింది. పండంటి బిడ్డతో ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్తున్న జంటల్ని చూసి.. ‘ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో! మాకే ఎందుకీ శిక్ష?’ అని భోరున ఏడ్చేవాళ్లం! ‘అసలీ జన్మకి బిడ్డను ఎత్తుకోగలమా? భగవంతుడు ఈసారైనా కరుణిస్తాడా?’ అనుకునేవాళ్లం!
 
వరుసగా నలుగురు బిడ్డల్ని కోల్పోవడంతో నిరాశ మమ్మల్ని ఆవహించింది. అయుతే నెమ్మదిగా ఒకరికొకరం ధైర్యం చెప్పుకుని ‘విధితో పోరాడైనా సరే... ఈసారి బిడ్డను బతికించుకోవాలి’ అని ప్రతిన బూనాం! అలా ఐదవసారి గర్భం దాల్చిన తర్వాత ఆరో నెలలోకి అడుగు పెట్టగానే హైదరాబాద్‌కు వచ్చేశాం! ఫిబ్రవరి 27న రెయిన్‌ బో ఆస్పత్రికి వెళ్లగానే పరీక్షలు చేసి, అదే రోజు సర్జరీ చేసి పాపను బయటకు తీశారు. తక్కువ బరువుతో పుట్టడంతో కోలుకునే వరకూ ఇంక్యుబేటర్‌లో ఉంచాలన్నారు. అలా అప్పటి నుంచి 128 రోజులపాటు, దిన దిన గండంగా గడిపాను. చివరికి వైద్యుల కృషి వల్ల 375 గ్రాముల బరువుతో పుట్టిన నా కూతురు చెర్రీ (ముద్దుపేరు) 2.45 కిలోల బరువుతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. మేం అనుకున్నది సాధించాం! చివరికి పండంటి బిడ్డకు నేను తల్లినయ్యాను. ఇంతకంటే నా జీవితంలో ఆనందించదగిన విషయం మరొకటి లేదు, ఉండదు!
 
నా కూతురు ఫైటర్‌!
ఛత్తీస్‌గఢ్‌లో మాకు వ్యాపారాలున్నాయి. దేనికీ కొదవ లేదు. ఇంట్లో నేను పెద్ద కొడుకుని. పెళ్లయ్యాక పెద్దలు మనవడు లేదా మనవరాలి కోసం ఎదురు చూస్తారు కదా. మా తల్లితండ్రులూ వంశాంకురం కోసం అలాగే ఎదురు చూశారు. కానీ దురదృష్టవశాత్తూ నాలుగుసార్లు బిడ్డలను కోల్పోయాం! ఛత్తీస్‌గఢ్‌లో వైద్య సౌకర్యాలు తక్కువ. దాంతో గర్భం కోల్పోవడానికి, పుట్టిన వెంటనే బిడ్డలు చనిపోవడానికి కారణాలు కనిపెట్టలేకపోయాం! ఐదోసారి మాత్రం ఈ విషయాన్ని సవాలుగా తీసుకుని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు వచ్చాం. ఆస్పత్రిలో నిఖితకు సర్జరీ చేసి ‘చెర్రీ’ని నాకు చూపించారు. మాంసపు ముద్దలా ఉంది నా కూతురు. అరచేతిలో ఇమిడిపోయేంత పరిమాణంలో ఉన్న పాపను చూసి ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. 24 గంటలు గడిస్తేనేగానీ ఏ విషయం చెప్పలేం అన్నారు ఆ సమయం కాస్తా గడిచింది.
 
అయినా, ఊపిరి పీల్చుకోవడానికి లేదు. ఎప్పుడు, ఏమైనా జరగొచ్చు. పాపను బ్రతికించడం కోసం వైద్యులు, నర్సులు ఎంతో కష్టపడ్డారు. నిజమే! కానీ వాళ్లందరికంటే గొప్ప ఫైటర్‌ నా కూతురే! ఆస్పత్రిపాలైన 128 రోజుల్లో, 105 రోజులు వెంటిలేటర్‌లో ఉండి, ప్రాణాలతో పోరాడి, విజయవంతంగా మా ఒళ్లోకి చేరింది. ఐదోసారి మా కల నెరవేరింది. ‘ఇక మీకు బిడ్డలు పుట్టడం కష్టం. సరొగసీకి ప్రయత్నించండి!’ అని చెప్పి, మా మనసు నొప్పించిన వాళ్లందరికీ గొంతు పగిలేలా గట్టిగా అరిచి చెప్పాలని ఉంది. అసలు ఇంతవరకూ స్నేహితులకు, ఆప్తులకు ఎవరికీ ఐదోసారి గర్భం దాల్చినట్టు, వైద్యం కోసం హైదరాబాద్‌ వచ్చినట్టు చెప్పలేదు. అంతా సవ్యంగా జరిగిన తర్వాత చెప్పడమే మేలనిపించింది. ఇప్పుడిక అందరికీ ఆనందంగా చెప్తాను. నా భార్య నిఖిత బిడ్డ కోసం ఎంతో కష్టపడింది. ఎంతో శారీరక, మానసిక శ్రమకు లోనయింది. చివరికి పండంటి బిడ్డను నాకిచ్చింది.
 
అయితే ఫిబ్రవరిలో పాప పుట్టినప్పుడు, మరో ఐదు నెలలు బిడ్డ ఆస్పత్రిలోనే ఉండాలని చెప్పడంతో హైదరాబాద్‌లో ఎక్కడ ఉండాలో అర్థం కాలేదు. మాకిది కొత్త ప్రదేశం. అన్ని రోజులు హోటల్‌లో బసకు చాలా ఖర్చవుతుంది. అందుకే ఒక రూమ్‌ అద్దెకు తీసుకుని, అవసరమైన సామాన్లు ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెప్పించాను. ఆ రూమ్‌ కోసం ఎంత వెతికానో, సిటీకి అలవాటు పడడానికి ఎంత ఇబ్బంది పడ్డానో నాకు మాత్రమే తెలుసు. అయితే మా కష్టం వృథా పోలేదు. అంతా అనుకున్నట్టుగానే జరిగి, చెర్రీ మా సొంతమైంది. ఛత్తీస్‌గఢ్‌ తిరిగి వెళ్లిపోతున్నాం! పాపకు ‘రిధిమ’ అని పేరు పెట్టుకున్నాం! పెద్దయ్యాక రిధిమను ‘నియోనాటాలజిస్ట్‌’ చేయాలనేది నా కోరిక. మాలాగా ఏ తల్లితండ్రులూ బిడ్డల్ని కోల్పోకూడదు. అందుకే ఆ చదువు చదివించి, మాలాంటి జంటలకు పాప చేత ఉచితంగా సేవలు అందించాలన్నది నా ఆశయం!
 
తక్కువ బరువుతో పుట్టినా..
డెలివరీ అయ్యే ఒక రోజు ముందు, 25 వారాల గర్భంతో సౌరభ్‌ దంపతులు మా ఆస్పత్రికి వచ్చారు.నిఖితలాగా వరుసగా బిడ్డల్ని కోల్పోయే పరిస్థితిని ‘ఆప్లా సిండ్రోమ్‌’ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు గర్భంలో ఉన్న బిడ్డకు వ్యతిరేకమైన యాంటీబాడీలు తల్లిలో తయారవుతాయి. ఫలితంగా బిడ్డకు తల్లి నుంచి రక్తప్రసరణ అందకపోవడం, ఉమ్మనీరు తగ్గిపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యతో ఫిబ్రవరి 27న సౌరభ్‌ దంపతులు కలిసినప్పుడు పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని అర్థమైంది. వెంటనే సర్జరీ చేసి బిడ్డను ఇంక్యుబేటర్‌లో ఉంచి, సత్వర చికిత్స మొదలుపెట్టాం. వాళ్లు రావడం 12 గంటలు ఆలస్యమైనా బిడ్డ గర్భంలోనే చనిపోయి ఉండేది. బిడ్డను బయటికి తీసి చికిత్స అందిస్తున్నా, కచ్చితంగా బ్రతుకుతుందని చెప్పడానికి 24 గంటల సమయం తీసుకోవలసి వచ్చింది.
 
ఆ తర్వాత కూడా బిడ్డలో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఊపిరితిత్తుల్లో రక్తస్రావమైంది. రక్తపోటులో తేడాలొచ్చాయి. అయితే అన్నిటినీ జాగ్రత్తగా సరిదిద్దాం! నిజం చెప్పాలంటే 400 గ్రాముల కంటే తక్కువ బరువున్న పసికందులను బ్రతికించడం చాలా కష్టం. కానీ ఇప్పుడున్న అత్యాధునిక వైద్య విధానాల ద్వారా ఇలాంటి పిల్లలను బ్రతికించుకోగలిగే వీలుంది. అయితే ఈ పరిస్థితికి వచ్చి తిప్పలు పడేకంటే గర్భిణిగా ఉన్నప్పుడే గుర్తెరిగి జాగ్రత్త పడగలగాలి. ఇందుకోసం గర్భిణిగా ఉన్నప్పుడే వైద్యుల సూచనల మేరకు స్కానింగ్‌లు తీయించుకుంటే, నెలలు నిండకుండా బిడ్డ పుట్టే అవకాశాలను ముందుగానే గుర్తించవచ్చు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించక నెలలు నిండకుండా బిడ్డ పుట్టినా, పుట్టిన బిడ్డ తక్కువ బరువుతో ఉన్నా బ్రతికించుకునే వెసులుబాటు వైద్య రంగంలో ఉంది!
 
- డా.దినేశ్‌ కుమార్‌ చిర్ల
పిడియాట్రీషియన్‌
నియో నాటాలజిస్ట్‌