నెమ్మదిగా తింటేనే మేలు!

07-03-2018: గబగబా నోట్లో కుక్కుకుని తినకండి, నెమ్మదిగా తినండి అని పెద్దవాళ్ళు ఎప్పుడూ చెబుతుంటారు. కానీ వారి మాటను ఆచరించేవారు చాలా తక్కువ మంది. అలా పెద్దల మాటను ఆచరించకపోవడం వలనే అధికబరువు సమస్య తలెత్తుతోందంటున్నాయి ఇటీవలి అధ్యయనాలు. సుమారు అరవై వేల మంది మీద ఆరు సంవత్సరాల పాటు సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. అధ్యయనం ప్రారంభించే సమయానికి వీరి బిఎంఐని పరిగణనలోకి తీసుకున్నారు వీరిలో 70 శాతానికి పైగా 25 బిఎంఐలోపు ఉన్నవారే! కాగా వీరిలో 40 శాతం మందికి ఆహారాన్ని గబగబా తినే అలవాటు ఉంది. మిగతా వారిలో చాలా శాతం ఆహారాన్ని నెమ్మదిగా నమిలి మింగే వారే ఉన్నారు. ఆరు సంవత్సరాల అధ్యయనం ముగిసే సమయానికి గబగబా ఆహారం తీసుకునేవారి బిఎంఐ25 దాటడం వీరు గుర్తించారు. నెమ్మదిగా తిన్న వారిలో బిఎంఐ చాలా కొద్దిగా మాత్రమే పెరగడాన్ని గమనించారు. ఆహారం గబగబా తినడం వలనే వీరిలో బిఎంఐ పెరిగిందని అధ్యయనకారులు స్పష్టం చేస్తున్నారు.