వీటిని తీసుకుంటే మేలు!

ఆంధ్రజ్యోతి, 02-10-2018:సరైన ఆహారంతో సీజనల్‌ జలుబు, వైరల్‌ జ్వరాలను నివారించవచ్చు. వంటింటి పదార్ధాలు కొన్ని శరీరానికి అవసరమైన పోషకాలను అందించి, నిరోధకశక్తిని పెంచుతాయి. సీజనల్‌ జ్వరాల నుంచి రక్షిస్తాయి. అవేమిటంటే..

వెల్లుల్లి: దీనిలో యాంటీ వైరల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఉంటాయి. రోజూ పచ్చి వెల్లుల్లి ఒకటి తింటే జలుబు, ఇతర వైరల్‌ జబ్బులు దరిచేరవు.
 
యోగర్ట్‌, లస్సీ: శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉత్పత్తికి ప్రో బయోటిక్‌ ఫుడ్స్‌ లస్సీ, యోగర్ట్‌ ఎంతో అవసరం. ఇవి జీర్ణక్రియ సవ్యంగా సాగేలా చేస్తాయి. రోగనిరోధకశక్తిని పెంచుతాయి కూడా. వాపు, ఇన్‌ఫెక్షన్లను నివారించడమే కాక జీవక్రియను నియంత్రిస్తాయి.
 
అల్లం: శరీరానికి శక్తిని ఇస్తుంది. శరీరంలో వేడిని కలిగించి, శ్వాస సంబంధ ఇబ్బందులను తగ్గిస్తుంది. తాజా అల్లం టీ తాగడం, అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు.
 
బచ్చలి, క్యాబేజీ, బ్రకోలి: ఈ సీజన్‌లో కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. వీటిలో విటమిన్‌ ఎ, సి, ఇ అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
 
నిమ్మజాతి పండ్లు: నారింజ, నిమ్మ, టొమాటో, అనాస వంటి పండ్లల్లో విటమిన్‌ సీ ఎక్కువగా ఉంటుంది. విటమిన్‌ సీ రోగనిరోధక శక్తిని పటిష్టం చేస్తుంది. నిమ్మజాతి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని విషపదార్ధాలను, మలినాలను తొలగిస్తాయి.
 
పుట్టగొడుగులు: వీటిలో విటమిన్‌ డి, శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. పుట్టగొడుగులను సూప్‌లు, సలాడ్‌ రూపంలో తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.