నిద్రలేమితో సంతానలేమి?

10-01-2018: నిద్రలేమికీ, సంతానలేమికి సంబంధం ఉంది అంటున్నారు తైవాన్‌ పరిశోధకులు. నిద్రలేమి కారణంగా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే! అయితే సంతానలేమికి కూడా ఇది దోహదపడుతుందన్న విషయం వీరి అధ్యయనంలో వెల్లడైంది. సుమారు పది సంవత్సరాల పాటు 17వేల మంది మీద వీరు సుదీర్ఘకాలం పాటు అధ్యయనం నిర్వహించారు. వీరందరూ 25 నుంచి 45 సంవత్సరాల లోపు వయస్సు కలవారే! వీరిలో 30 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. మిగతావారు రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో రెండు శాతం మందిలో సంతానలేమి సమస్య కనిపించగా, నిద్రలేమితో బాధపడుతున్న వారిలో 3.7 శాతం సంతానలేమి సమస్య ఉండడాన్ని అధ్యయనకారులు గుర్తించారు. నిద్రలేమి అన్నది రకరకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందన్న సంగతి తెలిసిందే! ఇవే సంతానలేమికి దారితీయవచ్చని వీరు భావిస్తున్నారు. ఏదిఏమైనా సంతానం ఆశించే వారు ముందు ఈ సమస్య నుంచి బయటపడాలని వారు సూచిస్తున్నారు.