వేడి టీతో కేన్సర్‌?

28-02-2018: చాలామందికి వేడి వేడి టీ తాగడం అలవాటు. ఈ అలవాటే చివరికి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది అంటున్నారు చైనా పరిశోధకులు. వేడి వేడి టీ తాగితే అన్నవాహిక కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ అన్న విషయం వీరి పరిశోధనలో వెల్లడైంది. మద్యపానం, ధూమపానం కంటే కూడా వేడి వేడి టీ తాగడం వలన ఈ కేన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్న విషయం వీరి పరిశోధనల్లో స్పష్టమైంది. సుమారు నాలుగున్నర లక్షల మంది మీద దాదాపు పది సంవత్సరాల పాటు సుదీర్ఘ అధ్యయనం చేశారు. వీరందరూ 30నుంచి 80సంవత్సరాల లోపు వయస్సువారే. వీరిలో సగానికి పైగా వేడి వేడి టీ తాగే అలవాటు ఉంది. అధ్యయనం కాలం ముగిసే సమయానికి 1800 మంది అన్నవాహిక కేన్సర్‌ బారిన పడిన విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. వీరందరికీ వేడి వేడి టీ తాగడం వలనే కేన్సర్‌ వచ్చిందా? లేక మరేదైనా కారణం ఉందా అనే విషయం మీద ఇంకా పరిశోధనలు కొనసాగించాలని అంటున్నారు. ఏది ఏమైనా 65 సెంటీగ్రేడ్‌ కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసిన టీని తాగడం మంచిదని వీరు సూచిస్తున్నారు.