వీడియో ఫోన్లతో క్యాన్సర్‌ రిస్క్‌

28-11-2018: ఫోన్లు పెద్దవారి ఆరోగ్యం మీద కన్నా పిల్లల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ఇతర గాడ్జెట్లలో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేసే పిల్లల ఆరోగ్యం విషయంలో పెద్దవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.  రోజంతా వీడియో గేమ్స్ ఆడే పిల్లలకు దృష్టి మాంద్యం, ఇతర రుగ్మతలు, ఒబేసిటీనే కాకుండా, చివరకు క్యాన్సర్ సైతం సోకే ప్రమాదముందట. ఈ విషయం మీద బ్రిటన్‌లోని వాల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్, సోఫియా లోవెస్ క్యాన్సర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వంటి సంస్థలు సుదీర్ఘకాలం అధ్యయనం చేశాయి. మామూలు పిల్లలతో పోల్చుకుంటే రోజంతా వీడియో ఫోన్లతో ఆడే పిల్లలకు ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు.. వీరు సుమారు రెండు వేలమంది పిల్లలపై అధ్యయనం చేశారు. ఫోన్లే కాకుండా టీవీల్లో జంక్‌ఫుడ్‌పై వచ్చే యాడ్స్ కూడా వీళ్ళ మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్న విషయం వీరి అధ్యయనంలో స్పష్టమైంది. తమ పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు.