గర్భిణీలు స్వైన్‌ ఫ్లూ బారిన పడితే

ఆంధ్రజ్యోతి: స్వైన్‌ ఫ్లూ మళ్లీ విజృంభించింది. మరీముఖ్యంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఈ వ్యాధి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. సాధారణ వ్యక్తులతో పోలిస్తే గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు స్వైన్‌ ఫ్లూ వైరస్‌ వల్ల కలిగే నష్టం ఎక్కువ. అందుకే వ్యాధి రాకుండా టీకాలు ఇప్పించాలి. ఒకవేళ పొరపాటున ఆ వ్యాధికి గురైతే మెరుగైన వైద్య చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ ఆలూరి విజయలక్ష్మి.

గర్భిణీలకు స్వైన్‌ ఫ్లూ
గర్భిణీల మీద స్వైన్‌ఫ్లూ ప్రభావం ఎక్కువ. ఇతర అనారోగ్యాలు కూడా ఉన్న గర్భిణీలకు ఈ వ్యాధి వల్ల మరింత ప్రమాదం. ఈ వ్యాధి బారిన పడిన కొందరు గర్భిణీలు మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. గర్భం ధరించిన తొలి నెలల్లో తీవ్రమైన జ్వరం వస్తే శిశువుకు అంగవైకల్యం వచ్చే ప్రమాదం ఉంది. తర్వాత నెలల్లో గర్భస్రావం లేదా నెలలు నిండకుండానే ప్రసవించటం, గర్భంలో శిశువుకు ఊపిరి అందకపోవడంలాంటి సమస్యలు  తలెత్తుతాయి. కాబట్టి స్వైన్‌ ఫ్లూ బారిన పడిన గర్భిణీలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
 
గర్భిణీలు - జాగ్రత్తలు
గర్భిణీలకు స్వైన్‌ ఫ్లూ వైరస్‌ తేలికగా సోకుతుంది. కాబట్టి వీళ్లు రోగులకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. అలాగే స్వైన్‌  ఫ్లూ ఉన్న వ్యక్తుల సంరక్షణలో గర్భిణీలు ఉండకూడదు. స్వైన్‌ ఫ్లూ వ్యాప్తిలో ఉన్నప్పుడు జన సమ్మర్దం ఉండే హాస్పిటల్‌, సినిమా హాళ్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు గర్భిణీలు వెళ్లకూడదు. 
 
ప్రసవ సమయంలో, తర్వాత జాగ్రత్తలు
ప్రసవ సమయంలో, ప్రసవమయ్యాక స్వైన్‌ ఫ్లూ వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్లూ లక్షణాలున్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. బాలింతతోపాటు, కుటుంబ సభ్యులు కూడా స్వైన్‌ఫ్లూ పట్ల అవగాహన కలిగి ఉండి జాగ్రత్తలు పాటించాలి. ప్రసవమయ్యాక బాలింతలు సాధ్యమైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలి. బిడ్డ పుట్టిన గంటలోపే పాలివ్వటం ప్రారంభించాలి. ఇలా చేస్తే శిశువులో రోగనిరోధకశక్తి పెరిగి స్వైన్‌ఫ్లూ వైరస్‌ నుంచి రక్షణ దొరుకుతుంది.
 
స్వైన్‌ ఫ్లూ గర్భిణీల జాగ్రత్తలు
 హెచ్‌1 ఎన్‌1 వైరస్‌ ఉందని నిర్ధారణ అయితే ఆ గర్భిణీలకు సపోర్టివ్‌ చికిత్సతోపాటు యాంటీవైరల్‌ చికిత్స కూడా ఇప్పించాలి.
 స్వైన్‌ ఫ్లూ ఉన్న గర్భిణీలు లేని గర్భిణీలకు దూరంగా ఉండాలి. 
 ప్రత్యేకమైన గదిలో ప్రసవం చేయాలి.
 గదిలో గాలి ధారాళంగా రావాలి.
శిశువును తల్లి నుంచి వేరు చేయకూడదు. తల్లి దగ్గరే శిశువుకు రక్షణ ఉంటుంది.
తల్లి పాలలో ఇన్‌ఫెక్షన్‌తోపాటు దాన్నుంచి రక్షణ కల్పించే యాంటీబాడీలు కూడా ఉంటాయి. కాబట్టి తల్లి పాలను మాత్రమే శిశువుకు పట్టించాలి.
 ఈ వ్యాధి ఉందని అనుమానం ఉన్నప్పుడు ఫలితాల కోసం వేచి చూడకుండా వెంటనే వైద్యం ప్రారంభించాలి.
 స్వైన్‌ ఫ్లూ   బాధిత గర్భిణీలు, బాలింతల సంరక్షకులు వ్యాక్సీన్‌ తీసుకోవాలి.
 గర్భిణి ప్రసవించేటప్పుడు చిందే రక్తం, ఉమ్మనీటి ద్వారా కూడా స్వైన్‌ ఫ్లూ వైరస్‌ వ్యాపిస్తుంది. కాబట్టి ఆ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
హెచ్‌1ఎన్‌1 టీకా ఎప్పుడు తీసుకోవాలి?
ఈ టీకా స్వైన్‌ ఫ్లూను సమర్ధంగా నయం చేయగలదు. అయితే గర్భిణీలు, బాలింతలకు ఈ టీకా ఇప్పించటానికి కొన్ని నియమాలు పాటించాలి.
 ఇనాక్టివేటెడ్‌ లేక నిర్జీవ టీకా మాత్రమే వేయాలి.
 గర్భిణీలు మొదటి మూడు నెలల్లో టీకా వేయించుకోకూడదు.
 4 నుంచి 6 నెలల మధ్యలో ఒకసారి టీకా వేయించుకుంటే తల్లితోపాటు శిశువుకు కూడా స్వైన్‌ ఫ్లూ నుంచి రక్షణ లభిస్తుంది.