తిండి తగ్గించేకొద్దీ... షుగర్‌ పెరుగుతోందేమిటి?

28-08-2017:నా వయసు 36,. గత మూడేళ్లుగా నాకు మధుమేహం ఉంది. మాత్రలు వేసుకుంటున్నా, షుగర్‌ నియంత్రణలోకి రాకపోవడంతో ఇటీవల తినే ఆహారపు మోతాదును బాగా తగ్గించాను. అప్పుడూ ఇప్పుడూ మూడు పూటల తిండే... కాకపోతే తినే మోతాదే సగానికి తగ్గించాను. దీనివల్ల శరీరం నీరసించిపోతోందే తప్ప షుగర్‌ మాత్రం తగ్గడం లేదు. పైగా ఒక్కోసారి పెరుగుతోంది కూడా. నేనున్నది మార్కెటింగ్‌ రంగంలో. షుగర్‌ నియంత్రణ కోసం వాకింగ్‌, జాగింగ్‌ లాంటివి చేసే టైం నాకెలాగూ లేదు. ఈ స్థితిలో నన్నేం చేయమంటారో చెప్పండి?

                                                                                                                                                                                           కె. ప్రవీణ్‌, విశాఖపట్నం

మీ భోజనం మోతాదును సగానికి తగ్గించానంటున్నారు. అయితే అంతకు ముందు ఏం తినే వారు, ఇప్పుడు ఏం తింటున్నారు? ఈ వివరాలేమీ రాయలేదు. సాధారణంగా ఎక్కువ మంది తీసుకునేది కార్బోహైడ్రేట్లే కాబట్టి వాటి స్థానంలో ప్రొటీన్‌ మోతాదును, ఫైబర్‌ మోతాదును పెంచాలి. క్యాల్షియం, ఐరన్‌, జింక్‌ , పొటాషియం, మెగ్నీషియం మోతాదును పెంచాలి. అలా కాకుండా అప్పటికే చాలీ చాలని పోషకాలు తీసుకుంటూ ఉన్నారనుకోండి, ఇప్పుడు మీరు, వాటిల్లోనే ఇంకా సగం తగ్గించేస్తే శరీరం నీరసించిపోకుండా ఏమవుతుంది? దీనికి తోడు ఆ లోటును బలవర్థక ఆహారంతో పూరించకపోతే, ఎముకలు, కండరాలు రోజురోజూ బలహీనపడతాయి. దీనివల్ల ఎముకలు గుళ్లబారిపోయి ఆస్టియో పొరోసిస్‌ వ్యాధి మొదలయ్యే ప్రమాదం ఉంది. అన్నింటినీ మించి షుగర్‌కు సంబంధించిన జీవక్రియలు అత్యధికంగా జరిగేది కండరాల్లోనే. కండరాలు బలహీనపడే కొద్దీ ఈ జీవక్రియలు మరింత కుంటుపడిపోయి షుగర్‌ నిలువలు అలా పెరుగుతూ వెళతాయి. అందువల్ల కండరాల, ఎముకల శక్తి ఏ మాత్రం తగ్గని రీతిలో మీరు తీసుకునే ఆహారం ఉండాలి. ఆకు కూరలకు ప్రాధాన్యతనివ్వాలి. పైగా మధుమేహం మొదలయ్యాక భోజనం చేయడాన్ని మూడు పూటలకే పరిమితం చేయడం ఎంత మాత్రం సరికాదు. అంతకన్నా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు అంటే ఓ ఐదు సార్లు తీసుకోవడం ఉత్తమం. అయితే ఎంత మంచి పౌష్టికాహారం తీసుకున్నా, శరీర శ్రమ ఏదీ చేయకపోతే అందులోని పోషకాలేవీ ఒంటికి పట్టవు. మీకు మీ వృత్తిపరమైన ఒత్తిళ్లు ఎంతగా ఉన్నా వీరు వ్యాయామాకి సమయం కేటాయించాల్సిందే. పార్కులకో, మైదానాలకో వెళ్లడం కుదరకపోతే ఇంట్లోనే ఆ ఏర్పాట్లు చేసుకోండి. రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు చేయగలిగితే, మీ చక్కెర తప్పకుండా నియంత్రణలోకి వస్తుంది.

                                                                                                                                                            డాక్టర్‌ జె. శరచ్చ్చంద్ర, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌