ఎక్కువగా టీవీ చూస్తే షుగర్‌?

17-08-2017: షుగర్‌ (చక్కెర వ్యాధి) రావడానికి పలు అంశాలు కారణం అవుతాయన్న విషయం తెలిసిందే! ఆ అంశాల్లో ఇప్పుడు టీవీ వీక్షణం కూడా చేర్చుకోవాలని పరిశోధకులు అంటున్నారు. లండన్‌లో సుమారు ఐదువేల మంది పిల్లల మీద సెయింట్‌ జార్జ్‌ యూనివర్శిటీ పరిశోధకులు దాదాపు మూడు సంవత్సరాల పాటు అధ్యయనం నిర్వహించారు. వీరిలో 60 శాతం మందికి రోజులో ఎక్కువ శాతం టీవీ చూడడం, ఎక్కువ సేపు కంప్యూటర్‌ ముందు గడపడం అలవాటు. మూడు సంవత్సరాల తరువాత వీరిలో 30 శాతం మంది పిల్లల్లో చక్కెర వ్యాధి లక్షణాలను పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా ఆకలిని ప్రేరేపించే హార్మోన్లు కూడా ఎక్కువ శాతం విడుదల అవడాన్ని వీరు గమనించారు. కేవలం టీవీ చూడడం వలనే వీరిలో షుగర్‌ లక్షణాలు పొడసూపాయా? అన్న విషయాన్ని మాత్రం వీరు నిర్ధారించలేకపోతున్నారు. దీని మీద ఇంకా అధ్యయనాలు నిర్వహించాలని వీరు అంటున్నారు.