ఆ తీపితో హ్యాపీయే!

ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న స్వీట్లు

షుగర్‌ బాధితులకు అందుబాట్లోకి..
డాక్టర్ల ధ్రువీకరణతో బాగా గిరాకీ..
25-04-2018: ‘‘తీపి తినకూడదు. నాకు షుగర్‌ ఉంది’’ అని ఇక ఎవరూ బాధపడనవసరం లేదు. నచ్చిన స్వీట్లు ఇష్టంగానే తినొచ్చు. రాగి లడ్డూ, సున్నుండలు, కోవా, కలకండ, పూతరేకులు, కాజాలు... ఇలా స్వీట్లు పేర్లు తలుసుకొనో, కళ్లతో మాత్రం చూసో సరిపెట్టుకోవాల్సిన పని లేదు. ఏ రకం కావాలన్నా, ఎంత కావాలన్నా నిస్సంకోశంగా తినేయొచ్చు. అలాంటి స్వీట్లు ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, తాపేశ్వరంతోపాటు అనేక స్వీట్‌ షాపుల్లో ఈ షుగర్‌ లెస్‌ స్వీట్లకు గిరాకీ బాగా పెరిగింది. ప్రత్యేకించి మధుమేహ బాధితుల కోసమే ఇవి సిద్ధమయ్యాయి. తీపి రుచి నోటికి కమ్మగా తగిలినా, ఆరోగ్యానికి ఏమాత్రం ఇబ్బంది లేకపోవడమే ఈ స్వీట్ల ప్రత్యేకత. ఈ విషయంలో ‘మాదీ భరోసా’ అని దుకాణదారులు ధైర్యం చెబుతున్నారు.
 
ఈ మేరకు సికింద్రాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌ ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని వినియోగదారులకు చూపిస్తున్నారు. డయాబ్లైస్‌ షుగర్‌లో గ్లూక్లోజ్‌ శాతం తక్కువ ఉంటుంది. దానివల్ల ఈ షుగర్‌తో తయారుచేసిన స్వీట్లు మధుమేహ బాధితులు తీసుకోవచ్చు. అలాగని రుచిలో ఏమీ తేడా ఉండదు. కాకపోతే, ఈ స్వీట్ల ధర మిగతా వాటికన్నా కాస్త ఎక్కువే. ప్రస్తుతం మార్కెట్‌లో పంచదారతో చేసిన రాగి లడ్డూ కిలో రూ.280 ఉంటే, షుగర్‌ లెస్‌ రాగి లడ్డూ ధర రూ.400 పలుకుతోంది. సున్నుండ కిలో సాధారణ ధర రూ.360 ఉండగా, షుగర్‌ లెస్‌ సున్నుండ ధర రూ.400, కాజా కిలో రూ.400 ఉంటే, మామూలు రకం కాజా ధర కిలో రూ.200 మాత్రమే. పూతరేకులు సాధారణంగా కిలో ధర రూ.500కి దొరికితే, ఈ రకం రూ.600కి విక్రయిస్తున్నారు.