షుగర్‌ రోగులకు ఉ‘సిరి’

ప్రాణాయామంతో పూర్తి కంట్రోల్‌
గుంటూరులో 120 మంది రోగులపై నాగార్జున వర్సిటీ అధ్యయనం
 
26-07-2017: జీవనశైలితో ముడిపడిన ఆరోగ్య సమస్య మధుమేహం. దేశ జనాభాలో సుమారు 20శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు నాలుగో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. మరే దేశంలోనూ ఇంతమంది షుగర్‌తో బాధపడటం కనిపించదు. అందుకనే మధుమేహ రోగుల ప్రపంచ రాజధానిగా భారత్‌ని పిలుస్తున్నారు. మన దగ్గర ఇంత ప్రబలంగా ఉన్న ఈ రుగ్మతని మనకు తెలిసిన దేశీయ పద్ధతుల్లోనే అదుపులో పెట్టేందుకు ఇప్పుడు అవకాశం లభించింది. విటమిన్‌ సీ పుష్కలంగా దొరికే ఉసిరిని తీసుకోవడం, యోగాలో కీలకమైన ప్రాణామాయం ఆచరించడం ద్వారా చాలావరకు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచొచ్చునని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాయం ఫుడ్స్‌ అండ్‌ న్యూట్రిషనల్‌ సైన్స్‌ విభాగం అధ్యయనంలో తేలింది. ఇప్పటిదాకా.. చచ్చేదాకా మందులు వాడుకోవడం తప్ప మరే నియంత్రణ మార్గం లేదనే  భావనతో ఉన్న బాధితుల్లో తిరిగి ఆశలను పుట్టించింది. 
మందులు, పథ్యం కన్నా..
ఏడాదిపాటు గుంటూరులో అధ్యయనం సాగింది. వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేవీ శాంతిశ్రీ ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌గా వ్యవహరించారు. యూజీసీ మేజర్‌ రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌ కింద... గుంటూరు జిల్లా పరిధిలో 120 మంది వలంటీర్లను ఎంపిక చేశారు. వీరంతా 40 ఏళ్ల లోపు వారే. 30 మందిని కంట్రోల్‌ గ్రూప్‌గా, 90 మందిని ఎక్స్‌పరమెంటల్‌ గ్రూపుగా విడగొట్టారు. ఎక్స్‌పరమెంటల్‌ గ్రూపు తిరిగి 30 మంది చొప్పున మూడు భాగాలు చేశారు. ఒక గ్రూపు సభ్యులకు పథ్యం పెట్టారు. రెండో గ్రూపువారితో రోజుకు గంటసేపు  ప్రాణాయామం చేయించారు. మూడో గ్రూపు సభ్యులకు పథ్యం, గంట ప్రాణాయామం, ఉసిరి అందించారు. ప్రాణాయామం చేస్తూ, ఉసిరి తిన్నవారిలో మధుమేహం నియంత్రణలోకి వచ్చింది. ఇక.. కంట్రోల్‌ గ్రూపులోని 30 మంది మందులు వాడుకొంటూ అధ్యయనంలో పాల్గొన్నారు.  
 
శ్వాస మెరుగైతే స్వస్థత దొరికినట్టే
‘‘ప్రాణాయామం ద్వారా శ్వాస మెరుగుపడి మెదడుకి అధికంగా ఆక్సిజన్‌ అందుతుంది. దీనివల్ల మెదడు ఉత్తేజితమై మానసిక ఒత్తిడి తగ్గుతుంది. షుగర్‌ నియంత్రణలోకి వచ్చేస్తుంది. మా అధ్యయనంలో పాలుపంచుకొన్నవారిలో గ్లైకోజినేటెడ్‌ హీమోగ్లోబిన్‌ స్థాయి 6.6 నుంచి 7.1 మధ్య నమోదవడం గమనించాం. వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం ఉసిరికి ఉంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు షుగర్‌ని నియంత్రణలో ఉంచడంలో దోహదపడతాయి’’. 
- డాక్టర్‌ శాంతిశ్రీ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ