10 నిమిషాల తీవ్ర వ్యాయామం

పిల్లల్లో మధుమేహ ముప్పు దూరం

వాషింగ్టన్‌, మార్చి 25: ప్రతి రోజూ పది నిమిషాల పాటు తీవ్ర వ్యాయామం చేసే పిల్లలకు మధుమేహం బారినపడే ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. అలాగే హృద్రోగాల బారిన పడే ప్రమాదం కూడా తగ్గుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం జంక్‌ ఫుడ్‌ వినియోగం పెరగడం, శారీరక శ్రమకు పూర్తిగా దూరమవ్వడం వల్ల చిన్న వయసులోనే మధుమేహం, హృద్రోగాలు వంటి జీవక్రియ సంబంధ వ్యాధుల బారినపడుతున్నారు. తక్కువ వయసులోనే స్థూలకాయులుగా మారడమే ఇందుకు ఒక ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని వేక్‌ ఫోరెస్ట్‌ బాప్టిస్ట్‌ మెడికల్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు 4 నుంచి 18 ఏళ్ల వయసున్న 11,588 మంది పిల్లలపై అధ్యయనం చేశారు. వారితో రోజూ తీవ్ర స్థాయిలో వ్యాయామం చేయించారు. అనంతరం వారి బీపీ, రక్తంలో కొవ్వు స్థాయిలు, ట్రైగ్లిస్ రైడ్స్‌, గ్లూకోజ్‌, ఇన్సులిన్‌ వంటి 32 బయోమార్కర్ల స్థాయిలను పరిశీలించారు. ముఖ్యంగా నడుము చుట్టుకొలత తగ్గించడంతో పాటు పలు రకాల కొవ్వు స్థాయిలను తగ్గించడానికి సాయపడే పలు బయోమార్కర్లపై ఈ వ్యాయామం సానుకూల ప్రభావం చూపిందని శాస్త్రవేత్తలు తెలిపారు.