శాశ్వత పరిష్కారం లేదా?

ఆంధ్రజ్యోతి, 15-01-2019:

ప్రశ్న: డాక్టర్‌! నా వయసు 25 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. కొంతకాలంగా అంగస్తంభన సమస్య వేధిస్తోంది. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, హెర్బల్‌... ఇలా అన్ని రకాల మందులు వాడుతున్నాను. వాడినప్పుడు సమస్య కనిపించకపోయినా, ఆపిన వెంటనే తిరగబెడుతోంది. ఈ మందులకే నా నెలసరి ఖర్చు 8 వేల రూపాయాలు మించిపోతోంది. నా సమస్యకు శాశ్వత పరిష్కారం లేదా? ఇలా జీవితాంతం మందులు వాడవలసిందేనా? ఈ సమస్యతో పెళ్లి చేసుకోవాలంటేనే భయమేస్తోంది.

- (ఓ సోదరుడు, మంచిర్యాల)

అంగస్తంభన సమస్య ప్రతి పురుషుడు జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనేదే! సరైన కారణాన్ని కనిపెట్టి సరిదిద్దగలిగితే ఈ సమస్య కచ్చితంగా పరిష్కారమవుతుంది. అంగస్తంభన సమస్యకు ప్రధానంగా మూడు కారణాలుంటాయి. అవి.... 1. మానసికమైన కారణాలు 2. రక్తనాళ సమస్యలు 3. హార్మోన్‌ సమస్యలు. వీటిలో ఏ కారణాన్నైనా సరిదిద్దే చికిత్సలున్నాయి. రక్తనాళ సమస్యలకు మాత్రమే కొంత దీర్ఘకాల చికిత్స అవసరమవుతుంది. మిగతా రెండు కారణాలనూ రెండు నుంచి మూడు నెలల్లోనే సరిదిద్దవచ్చు. కాబట్టి అంగస్తంభన సమస్యకు ఫలవంతమైన చికిత్సలున్నాయి. కాబట్టి కంగారు పడకండి. ఇక మీ విషయంలో చెప్పాలంటే....మందులతో ఫలితం కనిపిస్తోంది కాబట్టి, మీ సమస్య శారీరకమైనది కాకపోవచ్చు. మానసిక కారణాలకు మందులతో పనిలేని చికిత్స ఉంది. పెళ్లికి ముందు, తర్వాత కొన్ని రోజులపాటు ఆత్మస్థయిర్యం పెంచే కౌన్సెలింగ్‌ తీసుకుంటే మీ సమస్య పరిష్కారమవుతుంది. కాబట్టి ఆండ్రాలజిస్ట్‌ని కలిసి సమస్యకు తగిన చికిత్స తీసుకోండి. నిర్భయంగా పెళ్లి చేసుకోండి.
డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి
ఆండ్రాలజిస్ట్‌,
ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌.
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)