ఎప్పుడు అనుమానించాలి?

 

ఆంధ్రజ్యోతి, 02-10-2018: డాక్టర్‌! మా పెళ్లయి ఏడాది దాటింది. ఎటువంటి గర్భనిరోధక పద్ధతులూ అవలంబించకుండా లైంగికంగా కలుస్తున్నా నేను గర్భం దాల్చలేకపోతున్నాను. పిల్లలు కలగడానికి ఎంత కాలం వరకూ ఆగవచ్చు? దయచేసి తగిన సలహా ఇవ్వగలరు?
(ఓ సోదరి, హైదరాబాద్‌)
 
మీ వయసు 30 ఏళ్లయి, పెళ్లయినప్పటి నుంచి ఏడాదిగా ప్రయత్నం చేస్తున్నా పిల్లలు కలగలేదంటే వెంటనే వైద్యుల్ని సంప్రతించండి. ఒకవేళ మీ వయసు 35 అయితే ఏడాదిపాటు ఆగకుండా పెళ్లయిన ఆరు నెలల్లోగానే వైద్యుల్ని కలవాలి. మొదట జనరల్‌ ప్రాక్టీషనర్‌ని కలిస్తే దంపతులిద్దరినీ శారీరకంగా పరీక్షించి, తేలికపాటి పరీక్షలు చేసి, గర్భం దాల్చకపోవడానికి కారణాలను కనుక్కుంటారు. ఒకవేళ ఆ పరీక్షల్లో ఇబ్బందులు ఉన్నట్టు తెలిస్తే మరింత లోతైన పరీక్షలు సూచించి, ఫలితాలనుబట్టి చికిత్స మొదలు పెడతారు. ఒకవేళ ఆ పరీక్షల్లో అంతా నార్మల్‌గా ఉన్నట్టు తేలితే మరికొంత కాలంపాటు వేచి చూడవలసి ఉంటుంది. కాబట్టి నెలసరి సక్రమంగా ఉండి, శారీరక అనారోగ్యాలేవీ లేనప్పుడు పెళ్లయిన ఏడాదిలోగా గర్భం దాల్చకపోతే వెంటనే వైద్యుల్ని సంప్రతించడం మేలు. వయసుతోపాటు మహిళల్లో అండాల సంఖ్య, వాటి నాణ్యత తగ్గుతూ ఉంటుంది కాబట్టి, 35 ఏళ్లకు పెళ్లయిన మహిళలు పెళ్లయిన ఆరు నెలల్లోగా గర్భం దాల్చకపోతే వెంటనే వైద్యుల్ని కలవాలి. 
 
 డాక్టర్‌ షర్మిలా మజుందార్‌,
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకోఎనలిస్ట్‌
mili77@gmail.com (కన్సల్టేషన్‌ కోసం)