సెక్స్‌ ఎంత తరచుగా ?

 

ప్రశ్న: డాక్టర్‌! మాకు కొత్తగా పెళ్లైంది. మా దాంపత్యం ఆనందంగా సాగాలంటే మేం ఎంత తరచుగా సెక్స్‌లో పాల్గొనాలి? సంతృప్తికరమైన లైంగిక జీవితం గురించి ఒక్కొకరు ఒక్కో రకంగా చెపుతున్నారు. మా ఇద్దరికీ ఈ అనుభవం కొత్త. దాంతో అయోమయానికి లోనవుతున్నాం. తగిన సలహా ఇవ్వగలరు.
- స్వప్న, గుంటూరు.
 
జవాబు: సెక్స్‌ ఎంత ఎక్కువ ఉంటే ఆనందం అంత ఎక్కువ. అయితే దీనికీ ఓ కొలమానం ఉంది. ఆనందకరమైన లైంగిక జీవితం కోసం వారానికి కనీసం ఒకసారైనా సెక్స్‌లో పాల్గొనాలి. వయసు, జెండర్‌, బంధం...వీటన్నిటితో సంబంధం లేకుండా ఈ సూత్రం ఎవరికైనా వర్తిస్తుంది. అయితే సెక్స్‌ అనేది ఇద్దరి మధ్య సమ సంసిద్ధతతో జరపాల్సిన కార్యం. పడగ్గదిలో దంపతుల అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. కొందరికి వారంలో ఒకసారి చాలనిపిస్తే, మరొకరికి రోజులో రెండు సార్లు అవసరమనిపించవచ్చు.
 
కాబట్టి ఈ విషయం గురించి దంపతుల మధ్య మంచి అవగాహన ఉండాలి. అలాగని ఒకరికి ఇష్టం లేకపోయినా బలవంతపెట్టడం తప్పు. ఇంకొకరు కోరుకున్నప్పుడు వద్దని వారించటమూ కరెక్టు కాదు. దంపతుల మధ్య సెక్స్‌ను మించిన అన్యోన్యత ఉంటే లైంగికతృప్తి సమంగా పొందే వీలుంటుంది. ఇక మీ విషయంలో చెప్పాలంటే కొత్తగా పెళ్లయిన దంపతులు కాబట్టి తరచుగా సెక్స్‌లో పాల్గొనటం సహజం. దీనికి లెక్కలు పాటించాల్సిన అవసరం లేదు. అయితే సెక్స్‌ అనేది అన్యోన్యతను పెంచే సాధనం మాత్రమేననే వాస్తవం గ్రహించి మసలుకోవాలి. ఒకరి అవసరాలు మరొకరు గుర్తెరికి నడుచుకోవాలి. ఎన్ని సార్లు? అని కాకుండా...ఎంత తృప్తి పొందామనేది ముఖ్యం.
 
- డాక్టర్‌. షర్మిలా మజుందార్‌
చీఫ్‌ సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకోఅనలిస్ట్‌,
ఏవిస్‌ హాస్పిటల్‌, జూబ్లీ హిల్స్‌, హైదరాబాద్‌.
Email mili77@gmail.com
Website- www.doctorsharmila.in