లేపనాలు పని చేయవా..?

08-01-2019, (ఆంధ్రజ్యోతి): 

డాక్టర్‌! నా అంగం చిన్నదిగా ఉందని అనుమానం! దాంతో అంగ పరిమాణాన్ని పెంచే ప్రకటనలు ఇంటర్నెట్‌లో చూసి, లేపనాలను తెప్పించి వాడాను. అయినా ప్రయోజనం లేదు. ఎందుకని?
(ఓ సోదరుడు, నెల్లూరు)
 
జవాబు: అంగ పరిమాణం గురించి ఎక్కువశాతం మంది పురుషుల్లో రకరకాల అనుమానాలుంటాయి. వీటిలో ఎక్కువ అర్థం లేనివే! స్తంభించినప్పుడు కనీసం 3 అంగుళాల పొడవు ఉంటే, మీ అంగం తగిన పరిమాణంలోనే ఉందని అర్థం. అంగ పరిమాణం పెంచే మందులు లేవు. అలా ఎవరైనా ప్రకటనలు ఇస్తే వాటిని బోగస్‌విగా భావించాలి. లేపనాల వల్ల అంగ పరిమాణం పెరిగే అవకాశం లేదు. ఇతరులు తమ అంగం చిన్నదిగా ఉందని ఎక్కడ కనిపెట్టేస్తారో? అనే అర్ధం లేని భయాలతో అంగ పరిమాణాన్ని పెంచే మందుల కోసం వైద్యులను కలుస్తూ ఉంటారు. కానీ అలాంటి మందులు ఎక్కడా ఉండవు.
 
అరుదుగా కొందరు మగపిల్లల్లో చిన్న వయసులోనే అంగం మరీ చిన్నదిగా, పెరగకుండా ఉండిపోతుంది. తోటి పిల్లలతో పోల్చినప్పుడు ఆ తేడా స్పష్టంగా కనిపిస్తే వైద్యులను సంప్రతించాలి. అందుకు కారణాన్ని కనిపెట్టి, సరిదిద్దితే పిల్లల్లో అంగం తిరిగి పెరగడం మొదలుపెడుతుంది. ఇలా పెద్దల్లో సాధ్యం కాదు. కాబట్టి బూటకపు ప్రకటనలను నమ్మకండి. అలాగే అశ్లీల వీడియోలలో కనిపించే పురుషులతో పోల్చుకుని నిరాశ చెందకండి. ఆ వీడియోల్లో కనిపించేదంతా నిజం కాదు. మీకు ఇంకా సందేహం ఉంటే వైద్యులను సంప్రతించి సలహా తీసుకోండి.
 
 
డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి,
ఆండ్రాలజిస్ట్‌,
ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)