సంతానలేమికి గసగసాల వైద్యం?

20-7-2017:ఇది నిజంగా వైద్యం కాదు. ఓ పరీక్ష మాత్రమే! స్త్రీలలో సంతానలేమికి ఫెలోపియన్‌ ట్యూబ్‌లు(Fallopian tubes ) కొంత వరకూ కారణం అవుతుంటాయి. వీటిని శుభ్రం చేయడం ద్వారా కొందరిలో సంతానలేమి సమస్యను దూరం చేయవచ్చు. మామూలుగా ఈ ట్యూబ్‌లను శుభ్రం చేయడానికి వీటిలోకి నీటిని ఫ్లష్‌ చేస్తుంటారు. కానీ ఆస్ర్టేలియాలోని అడిలైడ్‌ విశ్వవిద్యాలయం, నెదర్లాండ్‌ విశ్వవిద్యాలయంలోని 28 మంది పరిశోధకుల బృందం సంతానలేమితో బాధపడుతున్న 112 మంది మహిళల మీద పరిశోధన నిర్వహించారు. వీరిలో సగం మందికి ఫెలోపియన్‌ ట్యూబ్‌లలోకి గసగసాల నూనెను ఫ్లష్‌ చేసి శుభ్రం చేయగా మిగతావారికి నీటిని మాత్రమే ఉపయోగించారు. కొన్ని నెలల అనంతరం వీరిని పరీక్షించగా, గసగసాల నూనె వైద్యం చేసిన వారిలో 40 శాతం మంది గర్భం దాల్చగా, నీటితో వైద్యం చేసిన వారిలో 18 శాతం మాత్రమే గర్భవతులయ్యారు. అయితే గసగసాల నూనె ఉపయోగించడం వలనే వీరు గర్భవతులయ్యారా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న విషయాన్ని మాత్రం వీరు స్పష్టం చేయలేకపోతున్నారు. గసగసాల వైద్యం కొత్తదేమీ కాదనీ, 1914వ సంవత్సరంలోనే ఈ ట్యూబ్‌లను శుభ్రం చేయడానికి ఈ నూనెను ఉపయోగించేవారనీ, కాలక్రమంలో చాలా పద్ధతులు అమల్లోకి వచ్చాయనిన వారు చెబుతున్నారు. గసగసాల నూనె వలన కలిగే ప్రయోజనాల గురించి ఇంకా విస్తృతంగా పరిశోధనలు నిర్వహించాల్సి ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.