పొగరాయుళ్లకు సెగ తప్పదుమరి..!

ఆంధ్రజ్యోతి, 2-3-2017:సిగరెట్‌ తాగడం ఆరోగ్యానికి హానికరం.. అని దాని ముఖంపై రాసి ఉన్నా, సినిమా థియేటర్లలో మొత్తుకున్నా ఏ మాత్రం లాభం ఉండటం లేదు. కానీ పొగరాయుళ్లకు సంతానం కలగడం కష్టమేనని తెలియజేస్తే లాభం ఉంటుందేమో. సిగరెట్‌ను గుప్పుగుప్పుమని తాగేవాళ్లకు పిల్లలు పుట్టే యోగ్యం తక్కువేనట. సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగే వాళ్లల్లో 13శాతం మంది సిగరెట్‌ తాగే అలవాటు ఉన్నవాళ్లేనని అమెరికన్ సొసైటీ ఆఫ్‌ రిప్రొడక్టివ్‌ మెడిసిన్ చేసిన పరిశోధనలో తేలింది. మహిళల్లో అండోత్పత్తికి సిగరెట్‌ అలవాటు అడ్డుపడితే, పురుషుల్లో వీర్యకణాల వృద్ధిని నాశనం చేస్తుంది. యువకులు, కొత్తగా పెళ్ళయిన వాళ్లయినా ఈ విషయం తెలుసుకుని సిగరెట్‌ మానితే సంసార బంధం చక్కగా సాగిపోతుంది.