‘ఆ’ ఇన్‌ఫెక్షన్లకు ఆమడ దూరంలో...!

ఆంధ్రజ్యోతి,11-04-2017: ప్రపంచం మొత్తంలో అత్యధిక లైంగిక ఇన్‌ఫెక్షన్లు కలిగి ఉన్న రెండో అతి పెద్ద దేశం...భారతదేశం. అంతేకాదు. లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్ల విషయంలో తెలుగు రాష్ట్రాలే అగ్రస్థానంలో ఉన్నాయి. దీన్నిబట్టి ఈ సమస్య పట్ల అవగాహన, అప్రమత్తత, ముందు జాగ్రత్త చర్యల గురించి చర్చించుకోవలసిన అవసరం ఉందంటున్నారు వైద్యులు. అసలు ఈ ఇన్‌ఫెక్షన్లు ఎలా సంక్రమిస్తాయి? రాకుండా ఏం చేయాలి? వస్తే చికిత్సలేంటి?.... 
 
 
1970ల్లో లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్ల సంఖ్య కేవలం రెండు! అవి...సిఫిలిస్‌, గనేరియా! ఇప్పుడీ సంఖ్య 30కి పెరిగింది. మన దేశంలో 15 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్కులైన ప్రతి ఐదుగురిలో ఒకరికి...ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సెక్సువల్‌ ఇన్‌ఫెక్షన్లు ఉంటున్నట్టు పరిశీలనలో తేలింది. సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ ఇన్‌ఫెక్షన్ల విషయంలో పురుషులు ‘ట్రాన్స్‌మిటర్స్‌’ (సంక్రమింపజేసేవారు)గా, స్త్రీలు ‘క్యారియర్స్‌’ (వాహకాలు)గా ఉంటూ ఉంటారు. ఎవరి నుంచి ఎవరికైనా ఈ రకమైన ఇన్‌ఫెక్షన్లు సోకవచ్చు. కొందరికి ఒక రకం ఇన్‌ఫెక్షన్‌ సంక్రమించొచ్చు. ఇంకొందరికి రెండు, మూడు రకాల ఇన్‌ఫెక్షన్లు కలిసి ఉండొచ్చు. లైంగికపరమైన ఇన్‌ఫెక్షన్‌ ఏదైనా....శారీరక అసౌకర్యంతోపాటు, మానసిక వేదనను కలిగించి జీవితాన్ని నరకప్రాయం చేస్తాయి. ఇవి వైరస్‌, బ్యాక్టీరియా, ప్యారసైట్స్‌ (పరాన్నజీవులు) ద్వారా సంక్రమిస్తాయి. బ్యాక్టీరియా, పరాన్నజీవుల ఇన్‌ఫెక్షన్లను యాంటీబయాటిక్‌ మందులతో నయం చేయొచ్చు. కానీ వైరల్‌ ఇన్‌ఫెక్షన్లను మందులతో నియంత్రించగలం కానీ శాశ్వతంగా నయం చేయలేం.
 
సంక్రమించే మార్గాలివే!  
రక్షణ చర్యలు పాటించకుండా లైంగిక చర్యలో పాల్గొనటం.
శారీరక ద్రవాలు (ఉమ్మి, వీర్యం, వెజైనల్‌ ఫ్లూయిడ్‌, రక్తం)
ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ తుంపర్లను పీల్చుకున్నా!
రేజర్లు, బ్లేడ్లు (ఇవి ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వ్యక్తికి సంబంధించినవైతే వాటి ద్వారా వ్యాధి సంక్రమిస్తుంది)
ఇంజక్షన్లు (ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వ్యక్తి వాడినవే ఇతరులు వాడటం వల్ల)
టాటూలు (పచ్చబొట్లు): వీటి కోసం వాడే పరికరాలు సరిగా స్టెరిలైజ్‌ చేయకపోయినా ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి.

పరిశుభ్రత పాటించని పబ్లిక్‌ టాయిలెట్స్‌ వాడటం.

ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు! 
లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్‌ ఎలాంటిదైనా లక్షణాలు వెంటనే బయట పడవు. ఆలస్యంగా కనిపించినా అన్ని రకాల లైంగిక ఇన్‌ఫెక్షన్ల లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. అవేంటంటే... 
 • ఒంటి మీద దద్దుర్లు 
 •  జ్వరం
 • తగ్గని దగ్గు, గొంతు నొప్పి
 • ఫ్లూ లక్షణాలు 
 • బరువు తగ్గటం
 • అలసట, నీరసం 
 • కండరాల నొప్పులు
 • లింఫ్‌ నోడ్స్‌ వాపు
 • మర్మావయవాల నుంచి దుర్వాసనతో కూడిన స్రావం.
 • ఆ ప్రదేశాల్లో దురద, మంట, నొప్పి
 • లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు తట్టుకోలేనంత నొప్పి.
 • పొత్తి కడుపులో నొప్పి 
 • వృషణాల వాపు
 • నీటి పొక్కులు 
 • పొక్కులు, మొటిమలు, పులిపిరులు
చికిత్సలు ఇవే! 
ఒకసారి లైంగిక ఇన్‌ఫెక్షన్‌ సోకితే సాధ్యమైనంత త్వరగా చికిత్స మెదలుపెట్టాలి. లక్షణాలు కనిపించిన వెంటనే ఈ విభాగంలో అనుభవజ్ఞులైన వైద్యుల్ని కలవాలి. సాధారణంగా సెక్సువల్‌ ఇన్‌ఫెక్షన్ల విషయంలో గోప్యత పాటిస్తూ వైద్యులను సంప్రదించటానికి సిగ్గుపడి సొంత వైద్యం మీద ఆధారపడుతూ ఉంటారు. నలుగురికీ తెలిస్తే పరువు పోతుందనో, ఇంట్లో తెలిస్తే తిడతారనో....ఇలా రకరకాల కారణాలతో వైద్యాన్ని ఆలస్యం చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది లైంగిక ఆరోగ్యం మీద అవగాహన లేని సెక్స్‌ క్లినిక్‌ వైద్యుల చేత అరకొర వైద్యం తీసుకుని ఊరుకుంటారు. కానీ ఈ రకమైన ఇన్‌ఫెక్షన్లకు ఎంత త్వరగా చికిత్స అందిస్తే అంత త్వరగా అవి అదుపులోకొస్తాయి, మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా ఉంటాయి. లక్షణాలు, రక్త పరీక్షలతో కనిపెట్టగలిగే ఈ రకమైన ఇన్‌ఫెక్షన్లకు సమర్ధమైన చికిత్సలున్నాయి. అవేంటంటే...
 
బ్యాక్టీరియల్‌, ప్యారసైటిక్‌: గనేరియా, సిఫిలిస్‌, చాల్మాడియా, చాంక్రాయిడ్‌...ప్రధానమైన బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు. పరాన్నజీవుల రూపంలో సంక్రమించే ఇన్‌ఫెక్షన్స్‌...‘స్కేబీస్‌, స్ట్రిచ్‌’. ఈ రెండు రకాల ఇన్‌ఫెక్షన్లను యాంటీ బయాటిక్‌ మందులతో నయం చేయవచ్చు. ఈ ఇన్‌ఫెక్షన్లకు మళ్లీ మళ్లీ తిరగబెట్టే లక్షణం ఉంటుంది. ఒకవేళ మందులు వాడాక తగ్గి మళ్లీ తిరగబెట్టినా అంతకంటే సమర్థమైన మందులతో శాశ్వతంగా నయం చేసే వీలుంది.
 
వైరల్‌: ఇవి ప్రమాదకరమైనవి, ప్రాణాంతకమైనవి. వీటిలో హ్యూమన్‌ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్‌ (హెచ్‌ఐవి), హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పివి), హెర్పిస్‌ సింప్లెక్స్‌...ప్రధానమైనవి. ఒకసారి సంక్రమిస్తే వీటిని శాశ్వతంగా నివారించటం అసంభవం. అయినా యాంటీ రిట్రోవైరల్‌ థెరపీతో ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతను అదుపు చేయవచ్చు. కాబట్టి ఇన్‌ఫెక్షన్‌ సోకిందనే అనుమానం ఉన్నప్పుడు మౌనంగా బాధను భరించే బదులు వ్యాధి తీవ్రతను అదుపులో ఉంచే మందులు వాడుతూ మెరుగైన జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయాలి. వైరస్‌ శరీరంలో దాగి ఉండి ఇన్‌ఫెక్షన్‌ రూపంలో బయట పడటానికి ఎక్కువ సమయం పట్టడం, లక్షణాలు ఆలస్యంగా కనిపించటం వల్ల కొన్నిసార్లు చికిత్స ఆలస్యం కావచ్చు. అయినా చికిత్స తీసుకోవటం మాత్రం మానకూడదు. అలాగే చికిత్సలో ఉన్నప్పుడు లైంగిక చర్యకు దూరంగా ఉండటం కూడా ఎంతో అవసరం. లేదంటే శరీరంలో ఏ కొద్ది పరిమాణంలోనో దాగి ఉన్న వ్యాధికారక క్రిములు రెండో వ్యక్తికీ సోకుతాయి. ఏదేమైనా ఈ ఇన్‌ఫెక్షన్ల నుంచి విముక్తి పొందాలంటే...తెలియని వ్యక్తులతో సెక్స్‌లో పాల్గొన్నా, లైంగిక దాడి జరిగినా వెంటనే వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకోవాలి.
 
ఎయిడ్స్‌ పరీక్ష ఎప్పుడు చేయించాలి?  
ఎయిడ్స్‌ వ్యాధిలో హెచ్‌ఐవి వైరస్‌ ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ (శరీరంలో వైరస్‌ వృద్ధి చెందే కాలం) ఎక్కువ. ఈ వైరస్‌ సంక్రమించినా బయట పడటానికి మూడు నుంచి తొమ్మిది నెలల కాలం పట్టొచ్చు. ఈలోగా హెచ్‌ఐవి పరీక్ష చేయించుకున్నా ఫలితం నెగిటివ్‌గానే రావొచ్చు. కాబట్టి లైంగిక చర్యలో పాల్గొని హెచ్‌ఐవి సంక్రమించిందేమోననే అనుమానం ఉంటే లైంగిక క్రీడలో పాల్గొన్న 10 రోజుల్లోగా హెచ్‌ఐవి ‘ర్యాపిడ్‌ టెస్ట్’ చేయుంచుకోవాలి. ఒకవేళ ఆ పరీక్షలో నెగిటివ్‌ వచ్చినా మూడు నెలలకు ఒకసారి, తర్వాత తొమ్మిది నెలలకు మరోసారి పరీక్ష చేయించుకోవాలి. ఈ మూడు పరీక్షల్లో నెగిటివ్‌ అని ఫలితం వస్తే హెచ్‌ఐవి సోకనట్టే భావించాలి. వ్యాధి ఉందని నిర్ధారణ అయినా మందులు వాడుతూ జీవిత కాలాన్ని పొడిగించుకునే వీలుంది. 
 
 
సేఫ్‌ సెక్స్‌  
లైంగిక చర్య మన జీవితంలో భాగం. అలాగని దాని ద్వారా వ్యాధులను కొని తెచ్చుకోవటం అవివేకమే అవుతుంది. ఇన్‌ఫెక్షన్లు సంక్రమించకుండా అడ్డుకునే మార్గాలున్నప్పుడు వాటిని ఆశ్రయించకుండా లైంగిక చర్యలో పాల్గొనటం ఎంత వరకూ సమంజసం? ఈ దిశగా ఆలోచించి ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా పాటించాలి.
 
పరిచయం లేని వ్యక్తులతో, ఒకరికంటే ఎక్కువమందితో సెక్స్‌ ఎప్పటికీ ప్రమాదకరమే! కాబట్టి ఈ అలవాటు మానుకోవాలి. లైంగిక అవసరాల కోసం ఒకే వ్యక్తి మీద ఆధారపడే పద్ధతిని స్త్రీ, పురుషులిద్దరూ పాటించాలి.
పురుషులు, స్త్రీలు తప్పనిసరిగా కండోమ్స్‌ ఉపయోగించాలి. స్వలింగ సంపర్కులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఒకరితోనే సంబంధం కలిగి ఉన్నా కండోమ్స్‌ తప్పనిసరిగా వాడాలి. ఒకే వ్యక్తితో ఆనల్‌, వెజైనల్‌ సెక్స్‌ చేయటం వల్ల సెక్సువల్‌ ఇన్‌ఫెక్షన్లు తేలికగా, త్వరగా సంక్రమిస్తాయి. క్యాజువల్‌, ర్యాండమ్‌ సెక్స్‌, వన్‌ నైట్‌ స్టాండ్స్‌ అలవాట్లు అలవరుచుకోకపోవటమే మంచిది. లైంగిక శుభ్రత కూడా అత్యవసరం. స్త్రీలు, పురుషులు మర్మావయవాల దగ్గరి వెంట్రుకలను రేజర్‌తో తొలగించుకోకుండా కత్తెరతో కట్‌ చేసుకోవటం మేలు. జంటలో ఒకరు కండోమ్‌ ధరించటానికి ఇష్టపడనప్పుడు రెండో వ్యక్తి తప్పనిసరిగా కండోమ్‌ ధరించాలి. 
 
పెళ్లికి ముందే పరీక్షలు  
కాబోయే జీవిత భాగస్వామికి ఎటువంటి లైంగిక వ్యాధులూ లేవని నిర్ధారించే పరీక్షలు చేయించటం ఎంతో అవసరం. ఇది ఇప్పుడు చట్టబద్ధం కూడా! కాబట్టి పెళ్లికి ముందే లైంగికపరమైన పరీక్షలు చేయించి వ్యాధులేవీ లేవని నిర్ధారించుకున్న తర్వాతే ముందడుగు వేయాలి. ఇలా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇద్దరూ ఎటువంటి వ్యాధులూ లేవని నిర్ధారించుకున్న తర్వాతే పెళ్లి చేసుకోగలిగితే వాళ్లకు ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు. సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ ఇన్‌ఫెక్షన్లు తల్లితోపాటు బిడ్డకూ సంక్రమించే అవకాశం ఉంది. ఒకవేళ ఇలాంటి పరీక్షలేవీ చేయించుకోకుండా పెళ్లి చేసుకుని, ఇన్‌ఫెక్షన్‌ సోకి గర్భం దాల్చితే అబార్షన్‌ అయిపోవటం, లేదా పుట్టే బిడ్డ శారీరక అవలక్షణాలతో పుట్టడం లాంటివి జరుగుతాయి. ఒకవేళ లైంగిక ఇన్‌ఫెక్షన్‌ ఉందని తెలిసీ గర్భం దాల్చితే వెంటనే వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. కొన్ని అరుదైన సందర్భాల్లో గర్భంలో ఉన్న బిడ్డకే నేరుగా చికిత్స అందించే వీలుంటుంది. 
 
ఎలాంటి కండోమ్స్‌ వాడాలి?  
కండోమ్స్‌లో లేటెక్స్‌, పాలీ యుథిరీన్‌ అనే రెండు రకాలుంటాయి. లేటెక్స్‌ కండోమ్స్‌ తేలికగా చిరుగుతాయి. కానీ పాలీ యుథిరీన్‌ కండోమ్స్‌ లైంగికపరమైన ఇన్‌ఫెక్షన్‌లను సమర్ధంగా అడ్డుకోగలవని శాస్త్రీయంగా నిరూపితమైంది. కాబట్టి వీటినే ఎంచుకోవాలి. స్త్రీలు కూడా కండోమ్స్‌ వాడొచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా తయారైన పాలీ యుథిరీన్‌ ఫిమేల్‌ కండోమ్స్‌నే వాడాలి. స్త్రీలకోసం తయారయ్యే కండోమ్స్‌ మొదటిసారి ఉపయోగించినప్పుడు కొంత అసౌకర్యంగా అనిపించినా తర్వాత అలవాటవుతాయి. ముఖ్యంగా కండోమ్స్‌ ఏ రకానికి చెందినవనేది ఆ ప్యాకెట్ల మీదే ముద్రించి ఉంటుంది. కాబట్టి పరిశీలించి ఎంచుకోవాలి.
 
 
డాక్టర్‌. షర్మిలా మజుందార్‌
కన్సల్టెంట్‌ సెక్సాలజిస్ట్‌,
సెక్సువల్‌ అండ్‌ మెంటల్‌ హెల్త్‌ క్లినిక్‌, ఆవిస్‌ హాస్పిటల్‌,
హైదరాబాద్‌