పడకగదిలో ఈ ‘స్కోర్‌బోర్డ్‌’ ఎందుకు?

28-01-2018:‘డాక్టరుగారూ.... ఇదీ నా స్కోరు. నా పర్ఫార్మెన్‌ ఎలా ఉందో మీరే చెప్పాలి?’ ... అంటూ ఓ స్ర్పెడ్‌షీట్‌ నాముందు పరిచాడు ఆ యువకుడు. మనిషి దిట్టంగా ఉన్నాడు. క్రికెటర్‌లా అనిపించాడు. ఆసక్తిగా ఆ కాగితం వైపు చూశాను. సోమవారం-3, మంగళవారం-2, బుధవారం-0, గురువారం-1... దాదాపు నెల రోజుల సమాచారం ఉంది. అప్పుడప్పుడూ ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌లు చూసిన అనుభవంతో... ‘ఫోర్లు మరీ తక్కువగా ఉన్నాయ్‌?’ అన్నాను. విచారంగా తలూపాడు.

‘సిక్సర్లు కొట్టినట్టు లేరే?’ రెట్టించాను.
చిన్నబుచ్చుకున్నాడు.
‘ఒక్క సెంచరీ కూడా లేదా?’
‘సెం...చ...రీ....లు... కూడా చేస్తారా సార్‌?’... నిరాశ, బాధ కలగలిశాయి ఆ గొంతులో.
‘అంటే, నేను రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్నానంటారా?’ - మళ్లీ తనే అడిగాడు. ఆటంటే ప్రాణంలా ఉంది.
 
        ‘ఆ మాట నేనెలా చెబుతాను. బాగా ప్రాక్టీస్‌ చేయండి. సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లీ, ధోనీ కూడా....’ ‘వాళ్ల స్కోర్‌షీట్‌ కూడా మీ దగ్గరుందా?’ - గొంతులో కుతూహలం.
అసలే, బయట చాలామంది పేషెంట్లు ఎదురుచూస్తున్నారు. ‘మీరు ఏ క్రికెట్‌ అకాడమీ వాళ్లనో సంప్రదిస్తే బావుంటుంది’ - ఇక వెళ్లిపోవచ్చన్నట్టు ముక్తాయించాను.
‘సార్‌, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ స్ర్పెడ్‌షీట్‌ క్రికెట్‌కు సంబంధించింది కాదు. పడకగదిలో నా పర్ఫార్మెన్స్‌’ - గుక్కతిప్పుకోకుండా బదులిచ్చాడు.
ఓహ్‌... అసలు విషయం బయటపడింది.
 
             ఇంకోసారి, ఆ కాగితం వైపు చూశాను. సెక్స్‌ పరిజ్ఞానం ఎలా ఉన్నా, కంప్యూటర్‌ నైపుణ్యం బాగానే ఉన్నట్టుంది. ఆ యువకుడి సమస్య ఏమిటో అర్థమైంది. పర్ఫార్మెన్స్‌ యాంగ్జయిటీ! తమ లైంగిక సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలన్న అర్థం లేని ఆరాటం! ఆ పరుగులో వెనకబడ్డానేమో అన్న ఆత్మన్యూనత! ఇలాంటి కేసులు తరచూ వస్తుంటాయి. కొత్తగా పెళ్లయిన యువకుల్లో ఆ ఆందోళన మరీ ఎక్కువ. ఏ వీకెండ్‌ పార్టీలోనో ఫ్రెండ్స్‌, కొలీగ్స్‌... రోజుకు రెండుసార్లు, మూడుసార్లు, నాలుగుసార్లు, ఐదు సార్లు...’ అంటూ ఒకటికి రెండు జోడించి వ్యక్తిగత స్కోరు పెంచేస్తారు. అవన్నీ నిజాలేననుకుంటూ, తామెక్కడున్నారో పోల్చుకుంటూ... తమకు తామే ఫెయిల్‌ మార్కులు ఇచ్చుకుంటూ కుమిలిపోయే అమాయకులు చాలామందే ఉన్నారు. ఆ బాపతే ఈ కుర్రాడూ.
 
           సెక్సువల్‌ ఫ్రీక్వెన్సీకి సంబంధించి అంతర్జాతీయంగా చాలా అధ్యయనాలు జరిగాయి. ఏ రెండు అధ్యయన ఫలితాలూ ఒకేలా లేవు. ప్రఖ్యాత సెక్సాలజిస్టు ఆల్‌ఫ్రెడ్‌ కిన్సే సర్వేనే తీసుకుందాం. ముప్పై ఏళ్లలో ఒక్కసారంటే ఒక్కసారే సెక్స్‌లో పాల్గొన్న వ్యక్తి ఆయనకు తారసపడ్డాడు. అదే సమయంలో, రోజుకు మూడునాలుగుసార్లు అవలీలగా లైంగిక చర్యలో పాల్గొనే మన్మథరావులూ ఎదురయ్యారు. ఇవన్నీ పరిశీలించాక... రోజుకు ఎన్నిసార్లు అయితే సాధారణమో, ఎన్నిసార్లు అయితే అసాధారణమో ఓపట్టాన తేల్చలేక అంతటి మహానుభావుడే చేతులెత్తేశాడు.
 
         సెక్సాలజీలో పురుషత్వానికి సంబంధించి ఐఎస్‌ఐ మార్కుల్లాంటివేం లేవు. స్వచ్ఛమైన బంగారంలా అచ్చమైన మగాడికి హాల్‌మార్క్‌ ఇచ్చే వ్యవస్థలూ లేవు. సాధారణంగా.... పెళ్లయిన కొత్తలో రోజువారీ స్కోరు... ఆరోహణ క్రమంలో ఉంటుంది. మెల్లమెల్లగా అవరోహణ దారిపట్టి... పాతబడేకొద్దీ ఏదో ఓ అంకె దగ్గర స్థిరపడిపోతుంది.
ఓ పరిశీలన ప్రకారం... పెళ్లయిన తొలి ఏడాది నెలకు పద్దెనిమిది సార్లు, తర్వాత ఓ ఐదేళ్లపాటూ నెలకు పదిహేనుసార్లు, ఆతర్వాత ఇంకో ఐదేళ్లు నెలకు తొమ్మిదిసార్లూ... పెళ్లయిన పదిహేనేళ్ల తర్వాత నెలకు ఏ రెండుమూడు సార్లకో పరిమితం - అన్నది ఓ అంచనా. బాధ్యతలు పెరిగిపోవడం, ఏకాంతం తగ్గిపోవడం, వృత్తి ఉద్యోగాల్లోని ఒత్తిడి, చిన్నాపెద్దా అనారోగ్యాలు... ఆ సగటు పడిపోడానికి కారణాలు.
 
             కబడ్డీ పాయింట్లతో టెన్నిస్‌ స్కోర్‌ను పోల్చగలమా? లేదు కదా! ఇదీ అంతే! ఎవరి జీవితం వారిది, ఎవరి ఆట వారిది! ఎన్నిసార్లు అన్నదానికంటే, ఎంత నాణ్యంగా ఆ కలయిక జరిగిందనేది ముఖ్యం. సూటిగా చెప్పాలంటే, సెక్స్‌ నంబర్‌గేమ్‌ కానే కాదు. అదో అనుభూతి క్రీడ! నువ్వు తృప్తి చెందుతున్నావా, జీవిత భాగస్వామికి తృప్తినిస్తున్నావా? - అన్నది ముఖ్యం. ప్రపంచంతో నీకేం పని? శృంగారం అంటే... సంభోగమే కాదు, సమభోగం కూడా! శృంగార నాణ్యతను నిర్ణయించడంలో ఫోర్‌ప్లే పాత్ర ముఖ్యమైనది.
 
            సెక్స్‌కు సంబంధించినంత వరకూ... నీ ఆటకు నువ్వే రెఫరీ! నీ నైపుణ్యానికి నీ జీవిత భాగస్వామే తీర్పరి! అరమోడ్పు కళ్లే ధ్రువీకరణ పత్రాలు. నిశ్శబ్దమైన నిట్టూర్పులే ప్రశంసావాక్యాలు! అతను సెలవు తీసుకుని బయల్దేరుతుంటే... ‘అర్థమైందా?’ అని అడిగాను. ‘అర్థమైంది సార్‌ ’ అన్నాడు. ‘ఏం అర్థమైంది?’ మళ్లీ అడిగాను. ‘రెండు ఒకట్లు రెండు కాదు... ఒకటే!’ - కాన్ఫిడెంట్‌గా జవాబిచ్చాడు. ఆ అద్వైత స్థితికి చేరుకోగలిగితే చాలు. ఇంకే కొలమానాలూ అక్కర్లేదు. ఆ క్షణంలో ఆ కుర్రాడు... బ్యాటింగ్‌కు బయల్దేరుతున్న కోహ్లిలా అనిపించాడు.
 
డాక్టర్‌ డి.నారాయణరెడ్డి
కన్సల్టెంట్‌, సెక్సువల్‌ మెడిసిన్‌
డేగ ఇన్‌స్టిట్యూట్‌, చెన్నై.
www.degainstitute.com