రొమాన్స్ సక్సెస్

ఆంధ్రజ్యోతి, 19-201-2017): సెక్స్‌ అనేది చర్య కాదు..అదొక ప్రక్రియ. ఈ తేడా తెలుసుకుంటే విజయవంతమైన లైంగిక జీవితాన్ని అందరూ సొంతం చేసుకోవచ్చు. కానీ అరకొర పరిజ్ఙానం, లేనిపోని అపోహలు, అవగాహనాలోపాలతో జంటల మధ్య, లైంగికపరమైన సమస్యలు, అభిప్రాయభేదాలు, మనస్పర్థలు, గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. అసలు సెక్స్‌ ప్రాధాన్యం ఎంత? దాంతో ముడిపడి ఉన్న అంశాలేంటి? సెక్స్‌ సక్సెస్‌ అవ్వాలంటే ఏం చేయాలి?

 
 చదువరుల్లోనే సమస్యలు అధికం
 లైంగికపరమైన విషయాల్లో, అవగాహనపరంగా గ్రామీణులే మెరుగ్గా ఉంటున్నారు. వారితో పోల్చుకుంటే పట్నాల్లో ఉండే చదువరులు ఈ విషయాల్లో వెనకబడి ఉన్నారనే చెప్పాలి. చిన్నప్పటి నుంచి చదువు, ఇల్లే ప్రపంచంగా పెరిగిన పిల్లలు పెరిగి పెద్దయి ఉన్నతమైన వృత్తుల్లో స్థిరపడగలుగుతారు. కానీ వారికి ఉండవలసినంత లైంగిక జ్ఞానం ఉండదు. పెళ్లై నెలలు గడుస్తున్నా, లైంగిక క్రీడలో పాల్గొనే తీరు తెలియక, పిల్లలు పుట్టట్లేదని వైద్యులను కలిసే సాఫ్ట్‌వేర్‌ దంపతులూ ఉన్నారు. తొలి రాత్రి ఏం చేయాలో తెలియక తికమక పడతారు.
 
చేస్తున్నది తప్పా, ఒప్పా అనేది తెలుసుకోలేరు. పెద్దలను అడగటానికి జంకుతారు. దాంతో తొలిరాత్రే భార్య ముందు పరాభవంపాలవుతారు. ఫలితంగా గొడవలు జరిగి విడాకుల వరకూ వెళ్తారు. ఇదే తీరు మహిళల్లోనూ ఉంటుంది. ఈ కోవకు చెందిన వాళ్ల సమస్య పేరు... ‘హైపో యాక్టివ్‌ సెక్సువల్‌ డిజైర్‌ డిజార్డర్‌’. ఇక రెండో రకం ‘హైపర్‌ యాక్టివ్‌ సెక్సువల్‌ డిజైర్‌ డిజార్డర్‌’. విపరీతంగా స్వీయతృప్తికి అలవాటు పడి, ఇలా చేస్తున్నాం కాబట్టి సెక్స్‌కి పనికిరామేమో అని భయపడి ఫెయిలయ్యేవాళ్లు ఈ రకం. వీళ్లు పోర్న్‌ వీడియోలు చూసి అపోహలకు లోనై, లేనిపోని అనుమానాలతో విపరీతమైన ఆందోళనకు గురవుతారు.
డాక్టర్‌. రాహుల్‌ రెడ్డి
కన్సల్టెంట్‌ మైక్రోసర్జికల్‌ యాండ్రాలజిస్ట్‌, యాండ్రో కేర్‌, జూబ్లీ హిల్స్‌, హైదరాబాద్‌.
 
 ఆయన అదో టైపు!
స్వలింగ సంపర్కం సంస్కృతి చాప కింద నీరులా విజృంభిస్తూనే ఉంది. చిన్నప్పటి నుంచి కుటుంబ వాతారణానికి దూరంగా హాస్టళ్లలో ఉండటం, బాల్యంలో బలాత్కారానికి గురవటం, స్త్రీ లేదా పురుష హార్మోన్ల పెరుగుదల... ఇలా స్వలింగ సంపర్కులుగా మారటానికి ఎన్నో కారణాలుంటాయి. అయితే ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా 18 ఏళ్లు దాటిన మేజర్లు స్వలింగ సంపర్కులైతే, వారి మీద చట్టపరంగా చర్య తీసుకునే హక్కు తల్లితండ్రులతో సహా ఎవరికీ లేదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. తమ పిల్లలు గే లేదా లెస్బియన్‌లని తల్లితండ్రులకు తెలిస్తే వారి జీవితం నాశనమవుతుందని కుంగిపోవటం సహజమే!
 
పెళ్లి జరిపిస్తే ఆ అలవాటు మానుకుంటారని తల్లితండ్రులు భావిస్తారు. పిల్లలను భయపెట్టి, బ్రతిమిలాడి బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తారు. కానీ దానివల్ల ఫలితం ఉంటుందా? తల్లితండ్రులు ఇలాంటి స్టెప్‌ తీసుకోబోయేముందు లోతుగా ఆలోచించాలి. స్వలింగ సంపర్క మూలాలను అన్వేషించి, పిల్లలతో మాట్లాడాలి. అది శారీరక సమస్య కాదని నిర్ధారించుకోవటం కోసం వైద్యుల దగ్గర పరీక్షలు చేయుంచాలి. ఎంత కౌన్సిలింగ్‌ ఇచ్చినా పిల్లలు తమ స్వభావాన్ని మార్చుకోకపోతే బలవంతంగా పెళ్లి చేయటం వృధా ప్రయాసే అవుతుంది.
డాక్టర్‌. నరేష్‌ వడ్లమాని

చీఫ్‌ కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌, కొలంబస్‌ హాస్పిటల్‌, బేగం పేట్‌, హైదరాబాద్‌.

శారీరకం
పెళ్లంటే నూరేళ్ల పంట. దంపతులిద్దరినీ నూరేళ్లూ కలిపి ఉంచే అంశాల్లో ‘సెక్స్‌’ది పెద్ద పీటే! అయితే సమర్ధమైన సెక్స్‌ కోసం ఇరువురి శరీరాల్లో హార్మోన్ల సమతౌల్యం సమంగా ఉండాలి. పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ ఎక్కువగా, తగుమాత్రంగా ఈస్ట్రోజన్‌ ఉంటాయి. ఇందుకు విరుద్ధమైన పరిస్థితి స్త్రీలలో ఉంటుంది. ఈ హార్మోన్లలో సమతౌల్యం దెబ్బతింటే లైంగిక శక్తి, ఆసక్తి సన్నగిల్లటం, స్వజాతీయుల మీద ఆకర్షణ ఏర్పడటంలాంటి లక్షణాలు తలెత్తుతాయి. వీటిని అలక్ష్యం చేయకూడదు.
 
యవ్వనంలో ఎవరికి వారు తమలో వచ్చిన మార్పులను గమనిస్తూ పెద్దల దృష్టికి తీసుకురావాలి. లేదా వైద్యుల్ని సంప్రదించాలి. కౌమారం దశకు చేరుకునేసరికి ఆడా, మగా ఇద్దరి పునరుత్పత్తి అవయవాల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. అలా జరగకుండా లోపం ఉందనిపిస్తే... ప్రీ మారిటల్‌ ఫర్టిలిటీ కౌన్సిలింగ్‌ చెక్‌: అంగ స్తంభన, శీఘ్రస్కలనం, అంగం గట్టిపడకపోవటం, గట్టిపడినా ఎక్కువసేపు నిలిపి ఉంచలేకపోవటం...ఇలా పురుషుల్లో ఎన్నో సమస్యలు తలెత్తవచ్చు. పురుషులతో పోల్చుకుంటే మహిళల్లో దాగిన లైంగిక సమస్యలను కనిపెట్టడం కష్టం. కొందర్లో అంతర్లీనంగా కొన్ని సమస్యలుంటాయి.
 
యోని కండరాలు బిగదీసుకుపోవటం (ఫ్రిజిడిటీ), సెక్స్‌ మీద ఎంత ఆసక్తి ఉన్నా సమయానికి తమకు తెలియకుండానే యోని కండరాలు కుంచించుకుపోవటం (వెజిన్మైసిస్‌) మొదలైన సమస్యలు స్త్రీలకు ఉంటాయి. ఇవి మొదటి రాత్రి వరకూ బయల్పడవు. పురుషల్లోలా స్త్రీల సమస్యలను పెళ్లికి ముందే పరీక్షలతో గుర్తించటమూ కష్టమే! అయితే ఇలాంటి సమస్యలేవీ తలెత్తకుండా ఉండాలంటే అమ్మాయిలకు సెక్స్‌ పట్ల భయం పోగొట్టే కౌన్సిలింగ్‌ ఇంట్లోనే, యుక్త వయసు నుంచే మొదలవ్వాలి. పెళ్లికి ముందు ఇద్దరికీ ‘పీర మారిటల్‌ ఫర్టిలిటీ కౌన్సిలింగ్‌ చెక్‌’ చేయించాలి. శరీరంలో హార్మోన్లు, లైంగికావయవాల ఎదుగుదలతో, లైంగిక స్పందనలు మొదలైనవన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో కనిపెట్టే పరీక్ష ఇది.

మహిళల సమస్యలు సరిదిద్దడం సులువే!
ఫ్రిజిడిటీ, వెజిన్మైసిస్‌ సమస్యలను కౌన్సిలింగ్‌, మందులతో సరిదిద్దొచ్చు. మొదటి కలయికలోనే ఈ లక్షణాలు కనిపిస్తే దాన్నొక శారీరక సమస్యగా భావించాలేగానీ, పెళ్లికి పనికిరారనే నిర్ధారణకు రాకూడదు. సాధారణంగా ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు భార్య ఇష్టం లేకుండానే తనను పెళ్లి చేసుకుందని, లేదా ఇంకెవరినో ఆమె ఇష్టపడుతోంది కాబట్టే సెక్స్‌కు సహకరించటం లేదని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. కొంతమంది అమ్మాయిలకు తొలిరాత్రి భయం ఉంటుంది. భరించలేనంత నొప్పి ఉంటుందని, రక్తస్రావం అవుతుందనీ...స్నేహితుల ద్వారా విని, అపోహలకు లోనై, ఆ భయంతో బిగుసుకుపోతారు. కాబట్టి ఇలాంటప్పుడు భర్త సహనంతో వ్యవహరించక తప్పదు. జీవితంలో సెక్స్‌ పాత్ర, అవసరం, లైంగికానందం పొందే తీరు గురించి భార్యకు అర్థమయ్యేలా చెప్పటంతోపాటు తనంతట తానుగా ఆమె ఆసక్తి చూపించేవరకూ బలవంతపెట్టకుండా ఉండాలి. ఒకవేళ అప్పటికీ సమస్య పరిష్కారమవకపోతే వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాలి.
 
పురుషుల్లో సెక్స్‌ సమస్యలకు సమర్థమైన చికిత్సలు
అంగానికి రక్త సరఫరాలో అడ్డంకి ఏర్పడినా, రక్తనాళాలు డ్యామేజీ అయినా, హోర్మోన్ల ఉత్పత్తి తగ్గినా చికిత్సతో సరిదిద్దొచ్చు. విపరీతంగా మద్యం సేవించేవారిలో, పుట్టుకతోనే గ్రంథుల్లో లోపం ఉన్నవాళ్లలో మేల్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గి పురుషులమీదే ఆసక్తి కలగటం మొదలవుతుంది. రక్తపరీక్షతో హార్మోన్‌ స్థాయిని కనిపెట్టి లేదా గ్రంథికి చికిత్స చేసి సమస్యను సరిదిద్దితే తిరిగి మామూలుగా మారతారు. స్తంభన శక్తిని అంచానా వేసే మరో పరీక్ష ‘పినైల్‌ డాప్లర్‌’. ఈ పరీక్షతో అంగస్తంభన ఉందా...లేదా? ఉంటే ఏమేరకు ఉంది? అనేది పరీక్షించి తర్వాత తగిన చికిత్స చేయవలసి ఉంటుంది.
 
పురుషుల కోసం స్వీయ పరీక్ష
మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ను ఎలాగైతే స్వీయ పరీక్షతో గుర్తించే వీలుందో పురుషులు కూడా తమ లైంగిక ఆరోగ్యాన్ని స్వీయ పరీక్షతో తెలుసుకునే వీలుంది. పెళ్లికి సిద్ధపడేముందు తమలో ఏలోపం లేదని గ్రహించాలంటే ఈ స్వీయ పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలి.
 
ఈ ఉదయం శరీరంలో టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి ఉధృతంగా ఉంటుంది కాబట్టి అంగస్తంభనలు కలుగుతాయి. పెరిగే వయసుతోపాటు ఈ రకమైన స్తంభనలు తగ్గుతూ పోతాయి. 20 ఏళ్ల వయసులో రోజూ కనిపిస్తే, 25-30 వయసులో వారానికి 4,5 సార్లు, 30-35 వయసులో వారానికి రెండు సార్లు స్తంభనలు ఉంటాయి. ఇలా ఉంటే లైంగికంగా ఆరోగ్యంగా ఉన్నారని అర్థం.
 
 స్వప్న స్ఖలనాలు కూడా తరచుగా కనిపిస్తూ ఉంటాయి.
 ఏదైనా పని ఒత్తిడిలో ఉంటే తప్ప, లైంగికపరమైన ఆలోచనలు, ఆసక్తి రోజు మొత్తంలో ఉంటుంది.
 నగ్న చిత్రాలు, వీడియోలు చూసినప్పుడు స్తంభన కలుగుతుంది.
 హస్తప్రయోగంతో సంతృప్తి పడుతూ ఉంటారు.
నపుంసకత్వం లేనే లేదు!
నపుంసకత్వం అనే పదానికి అర్థం లేదు. పూర్తి నపుంసకత్వానికి చికిత్స లేదు కాబట్టి ఎప్పటికీ లైంగిక క్రీడకు పనికిరాడు అనే అర్థంతో అలా అనేవారు. కానీ ఇప్పుడు వైద్యరంగం ఎంతో అభివృద్ధి సాధించింది. లైంగిక సమస్యతో నపుంసకత్వం బారిన పడితే చికిత్సతో పూర్తిగా సమస్యను సరిదిద్దే వీలుంది. ‘పినైల్‌ షాక్‌వేవ్‌ థెరపీ’తో అంగంలో డ్యామేజీ అయిన రక్తనాళాలను సరిదిద్ది స్తంభనలను పునరిద్ధరించవచ్చు. ఆ చికిత్సతో ఫలితం కనిపించకపోతే ‘పినైల్‌ ఇంప్లాంట్‌’ను అమర్చవచ్చు. ఈ కృత్రిమ సిలికాన్‌ అంగం సహజ అంగంలాగే పనిచేసి ఇద్దరికీ సమమైన లైంగిక తృప్తిని అందిస్తుంది.
మానసికం
సాధారణంగా లైంగికపరమైన ఆలోచనలు 12-13 ఏళ్ల నుంచే మొదలవుతాయి. శారీరక మార్పులు, హార్మోన్ల ఉధృతి లైంగికపరమైన విషయాల మీద ఆసక్తి రేపుతుంది. ఆపోజిట్‌ సెక్స్‌ మీద ఆకర్షణనూ కలిగిస్తుంది. అయితే ఆ ఆలోచనలను, భావనలను మరింత ఆస్వాదించుకోవటం కోసం స్వీయ ప్రేరేపణతో స్వయంతృప్తి అలవాటు మొదలవుతుంది. టీనేజీకి చేరుకునేసరికి...పుస్తకాలు, వీడియోలు, స్నేహితుల ద్వారా తెలుసుకున్న లైంగిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరూ తమకు తాము సెక్స్‌ గురించి ఓ నిశ్చితాభిప్రాయం ఏర్పరుచుకుంటారు.
 
తమకు తెలిసిందే సరైనదనే భావనలో ఉంటారు. అంతకుమించి అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఎదుటివ్యక్తి శరీర స్పందనలు, లైంగికపరమైన కోరికలు, ఇష్టాఇష్టాలను తెలుసుకోవాలని, వాటికి ప్రాధాన్యం ఇవ్వాలనే దిశగా ఆలోచించరు. ఎదుటి వ్యక్తి గురించే కాదు, తమ లైంగిక శక్తి, లోపాలు, అసహజత్వాల గురించి కూడా ఎవరికి వారు గ్రహించలేరు. తాము పుట్టి పెరిగిన వాతావరణం, కట్టుబాట్లు, సంస్కృతి...ఇలా ఎన్నో అంశాలు ఒక వ్యక్తి లైంగిక ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తాయి. ఆ ప్రభావాలన్నిటితో రూపుదిద్దుకున్న సెక్సువల్‌ క్యారెక్టర్‌తో కూడిన ఇద్దరు వ్యక్తులు తొలిరాత్రితో శారీరకంగా కలిసే ప్రయత్నం చేస్తే ఎన్నో కొత్త కోణాలు బయల్పడతాయి. అవేంటంటే....
 
ఈ పర్‌ఫార్మెన్స్‌ ప్రెషర్‌: దాదాపు 50 శాతం మంది శోభనం రాత్రే ఫెయిలవుతూ ఉంటారని వైద్యులంటున్నారు. ఎందుకిలా? అంటే...అదే తొలి అనుభవం అయితే కచ్చితంగా ఇద్దరికీ ఒత్తిడి ఉంటుంది. కంగారూ ఉంటుంది. పైగా ఒకరికొకరు కొత్త. శోభనం గది చుట్టూ రెండు కుటుంబాల బంధువులు. ఇన్ని ఇబ్బందులున్నప్పుడు అంతో ఇంతో ఒత్తిడి పెరగటం సహజం. దాంతో కార్యాన్ని సక్రమంగా పూర్తి చేయలేకపోవచ్చు.
ఈ శారీరక లోపాలు: ప్రీమెచ్యూర్‌ ఇజాక్యులేషన్‌, ఇరెక్టైల్‌ డిస్‌ఫంక్షన్‌, డిలేయ్‌డ్‌ ఇజాక్యులేషన్‌...ఇలా పురుషుల్లో స్తంభన సమస్యలు ఉండవచ్చు. మహిళల్లో కూడా రిజిడిటీ, హైపర్‌ సెక్సువల్‌ సిండ్రోమ్‌ లాంటి సమస్యలూ ఉండి ఉండొచ్చు. విపరీతమైన లైంగిక కోరికలున్న అమ్మాయి, కొన్ని క్షణాల్లోనే వీర్యస్కలనం జరిగిపోయే ప్రీమెచ్యూర్‌ ఇజాక్యులేషన్‌ సమస్య ఉన్న అబ్బాయి కలిస్తే....కచ్చితంగా ఇద్దరి మధ్యా గొడవలొస్తాయి. అది పెళ్లికి ముందైతే పరస్పర అంగీకారంతో విడిపోవచ్చు. కానీ అలా తొలిరాత్రి జరిగితే పరిణామాలు దారుణంగా ఉంటాయి.
 
 
ఈ పెరిగిన వాతావరణం: సెక్స్‌ తప్పు, మహా పాపం! అనే వాతావరణంలో పెరిగిన వాళ్లు జీవితంలో సెక్స్‌కు అత్యంత తక్కువ ప్రాధాన్యం ఇస్తారు. లేదా ఆపోజిట్‌ సెక్స్‌ను తాకటం, లైంగిక క్రీడలో పాల్గొనటానికి ఇష్టపడరు. లేదా సెక్స్‌లో పాల్గొన్నా మొక్కుబడిగా పని ముగిస్తారే తప్ప తగిన సమయాన్ని వెచ్చించరు. మరీ ముఖ్యంగా ఫోర్‌ ప్లే జరపరు. ఇక అమ్మాయిలైతే ‘రిజిడిటీ’తో ముడుచుకుపోతారు. దాంతో లైంగిక చర్య ఇబ్బందికరంగా మారుతుంది. బాల్యంలో జరిగిన బలాత్కారం మూలంగా కొంతమంది సెక్స్‌ పట్ల ఏహ్యభావాన్ని, భయాన్నీ ఏర్పరుచుకుంటారు లేదా అందుకు భిన్నంగా విపరీతమైన సెక్స్‌ పర్వర్షన్స్‌కు అలవాటు పడతారు.
 
ఈ స్పందించే తీరు: స్పందన, ప్రతిస్పందన సెక్స్‌లో ఎంతో కీలకం. ఎదుటి వ్యక్తి స్పందించే తీరునుబట్టి లైంగికపరమైన ఇష్టానిష్టాలను అంచనావేసి అందుకు తగ్గట్టు మసలుకోగలిగితే ఏ ఇబ్బందీ ఉండదు. అందుకోసం సఖ్యత, అర్థం చేసుకోగలిగే స్వభావం, ఓర్పు, నేర్పు ఉండాలి. ఇవన్నీ ఒక్క రాత్రితో సమకూరేవి కావని ఇద్దరూ గ్రహించాలి.
 
ఈ సెక్స్‌ అవేర్‌నెస్‌: లైంగికంగా సంసిద్ధపడే సమయం వ్యక్తికీ, వ్యక్తికీ మారుతుంది. భావప్రాప్తి పొందే సమయం కూడా భిన్నంగా ఉంటుంది. కాబట్టి వీడియోలు చూసి, స్నేహితుల ద్వారా విని పొందిన పరిజ్ఞానంతో పడగ్గదిలోకి అడుగుపెట్టి భంగపడకుండా, జీవిత భాగస్వామితో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అందుకు కొన్ని రోజుల సమయం పట్టినా ఫర్వాలేదు. మిడిమిడి జ్ఞానంతో ప్రయత్నం చేసి ఫెయిలై భంగపడేకంటే కాస్త ఆలస్యమైనా మెలకువలు నేర్చుకుని లైంగిక జీవితాన్ని విజయవంతం చేసుకోవటం మేలేగా!
 
సెక్స్‌ ఎడ్యుకేషన్‌ అవసరమే!
పిల్లలకు 18 వయసు నుంచి సెక్స్‌ ఎడ్యుకేషన్‌ ఇవ్వాలి. ఇది ఇంటినుంచే మొదలవ్వాలి. తల్లితండ్రులిద్దరూ తమ ఆడా, మగా పిల్లలిద్దరితో విడివిడిగా చర్చించాలి. శరీరంలో వచ్చిన మార్పులు, మనసులో రేగే లైంగిక ఆలోచనల గురించి ఆరా తీయాలి. లోపం ఉందనిపిస్తే వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాలి. అంతా సక్రమంగా ఉందనిపిస్తే సెక్స్‌ అవసరం? ప్రాధాన్యం? దాని పట్ల సానుకూల దృక్ఫథం ఏర్పరుచుకోవటం, పెళ్లివరకూ ఆగవలసిన అవసరం? పెళ్లయ్యాక లైంగిక క్రీడలో పాల్గొనే విధానం....ఇలా అన్ని కోణాల నుంచీ పిల్లలకు ఆరోగ్యకరమైన లైంగిక జీవితం గురించిన అవగాహన కల్పించటం ఎంతో అవసరం. ఇలాంటి సెక్స్‌ ఎడ్యుకేషన్‌ వల్ల పిల్లల్లో దాగిన అనుమానాలు, భయాలు తొలగిపోతాయి. అంతేకాకుండా, పెద్దలు చెప్పినదానికి తమలో కలుగుతున్న మార్పులకు తేడాలుంటే ఆ విషయాన్ని తల్లితండ్రుల దృష్టికి తీసుకొస్తారు.
 
వాస్తవదూరాలు అనేకం!
తొలిసారి ది బెస్ట్‌ అనిపించుకోవాలనే తాపత్రయం అందరికీ ఉండటం సహజం. అయితే ఇందుకోసం విపరీతంగా ఎక్సయిట్‌ అయిపోయి ఖంగు తినేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా అబ్బాయిలు. దాంతో వాళ్ల వాలకం చూసి అమ్మాయిలు అతనికేదో లోపం ఉందనే నిర్థారణకొస్తారు. కంగారు, ఒత్తిడి వల్ల అబ్బాయిల్లో అంగం స్తంభించకపోవటం, పర్‌ఫార్మెన్స్‌ లోపం, శీఘ్ర స్ఖలనం...ఇలా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఇక అమ్మాయిలు కూడా సెక్స్‌, పార్ట్‌నర్‌ గురించి ఏదేదో ఊహించుకుంటారు. ఎక్కువ సమయంపాటు కార్యాన్ని కొనసాగించలేకపోయారని, అనుకున్నంత స్థాయిలో సంతృప్తిపరచలేకపోయారని, ఫోర్‌ప్లే మీద దృష్టి పెట్టలేదనీ...ఇలా ఎన్నో అసంతృప్తులకు లోనవుతారు. ఎవరికి ఉండాల్సిన కారణాలు వారికున్నా... ఇరువురూ సెక్స్‌ను సంపూర్తిగా ఆస్వాదించాలంటే తమకు తెలిసినదానికీ, నిజ జీవితానికీ తేడా ఉంటుందనే విషయాన్ని ముందుగా గ్రహించాలి. వాస్తవికంగా ఆలోచించి, అర్థం చేసుకోవాలి.