పెళ్లైనా లైంగిక బంధానికి నోచుకోని జపాన్‌ జంటలు

 

ప్చ్‌.. ఓ అచ్చటా లేదు..! ఓ ముచ్చటా లేదు..!

శృంగారం కంటే నిద్ర ముఖ్యమంటున్న యువతులు.. ఆ అనుభవం లేని 43 శాతం యువత

ఆంధ్రజ్యోతి, 12-02-2018: జపాన్‌ అంటే పని..! పని అంటే జపాన్‌! కానీ జపనీయులు జీవితంలో అతి ముఖ్యమైన పనికి దూరమవుతున్నారని సర్వేలు గగ్గోలు పెడుతున్నాయి. పెళ్లి కాని వాళ్లు ఎలా ఉన్నారో.. అయినవాళ్లూ అలాగే బతుకుతున్నారని నిట్టూరుస్తున్నాయి. ఎంత పనిమంతులైనా.. ఎంత సంపాదించినా.. ఎంత అభివృద్ధి చెందినా.. కూసింత కళాపోషణ లేకపోతే- ‘ఏమిరా మీ వల్ల ఉపయోగం దేశానికి’ అని ప్రశ్నిస్తున్నాయి!!
 
పని రాక్షసులుగా పేరొందిన జపనీయులు అసలు కార్యాన్ని కూడా మరచిపోతున్నారు. పని ఒత్తిడితో  పడకగది సంతోషాలకు దూరమవుతున్నారు. ఆఫీ్‌సలో కష్టపడి వచ్చి ఓపిక లేక.. శృంగార జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. ఇక పెళ్లికాని యువతీ యువకులైతే అసలు సెక్స్‌ ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారనీ.. ఒంటిమీదకు 30 ఏళ్లు వస్తున్నా.. సోలో బతుకే సో బెటరు అని గడిపేస్తున్నారని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాప్యులేషన్‌ అండ్‌ సోషల్‌ రీసెర్చ్‌’ సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. టోక్యోలో జంటలు ఎంత బిజీగా బతుకుతున్నాయంటే.. రోడ్డు మీద జీబ్రా క్రాసింగ్‌ల వద్ద మాట్లాడుకుంటున్నారని తెలిపింది. 18 నుంచి 49 ఏళ్ల వయసున్న పెళ్లైన జంటల్లో.. 47.2 శాతం మంది గత నెల రోజుల్లో ఒక్కసారి కూడా సెక్స్‌లో పాల్గొనలేదని చెప్పినట్లు జపాన్‌ కుటుంబ నియంత్రణ విభాగం నివేదిక వెల్లడించింది. ‘జపాన్‌లో పెరుగుతున్న సెక్స్‌లెస్‌ మ్యారేజ్‌’ ధోరణి ఆందోళన కల్గిస్తోంది’ అని పేర్కొంది. సెక్స్‌ తమకు విసుగు పుట్టించే అంశమని 22 శాతం జపాన్‌ మహిళలు అభిప్రాయపడ్డారు. ఆఫీస్‌ నుంచి అలసిపోయి వచ్చే తమకు.. భాగస్వామితో ప్రేమను పంచుకునే ఓపిక ఉండటం లేదని 35.2 శాతం పురుషులు తెలిపారు. జపాన్‌లో దాదాపు సగం మంది జంటలు బొత్తిగా బెడ్‌రూమ్‌ స్పార్క్‌ లేకుండా బతికేస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. 
 
బాయ్‌ ఫ్రెండ్‌ ఉంటే ఫ్రీడమ్‌కు పరిమితులు
18 నుంచి 34 ఏళ్ల లోపు వయసున్న 5 వేలమంది యువతీ యువకులపై గత ఏడాది సర్వే నిర్వహించారు. వారిలో 43శాతం మంది తమకు సెక్స్‌ అనుభవం లేదని తెలిపారు. 64శాతం మంది తమకు ఎలాంటి రిలేషన్‌షిప్‌ లేదని చెప్పారు. ‘అమ్మాయిలకు మా ప్రేమను వ్యక్తం చేయాలని ఉంటుంది. కానీ వాళ్లు నిరాకరిస్తే భరించడం కష్టం. నాలాగే చాలామంది అబ్బాయిలు ప్రపోజ్‌ చేయడానికి భయపడుతుంటారు. అందుకే యానిమేషన్‌ వంటి హాబీలతో సమయం గడుపుతాం’ అని అనో మాత్సూయ్‌ అనే 26 ఏళ్ల కమేడియన్‌ వెల్లడించాడు. ‘సెక్స్‌ కంటే తినడం, నిద్రపోవడమే నాకు చాలా ఇష్టం. నాకు సెక్స్‌ అవసరం లేదు. యూనివర్సిటీలో చేరిన తర్వా తే నా తల్లిదండ్రుల నుంచి కాస్త స్వేచ్ఛ దొరికింది. బాయ్‌ఫ్రెండ్‌ ఉంటే నా ఫ్రీడమ్‌కు పరిమితులు పెడతాడు. అది నాకు ఇష్టం లేదు’ అని టోక్యోలో అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న అన్నా పేర్కొం ది. జపాన్‌ యువత పని ఒత్తిడిని తగ్గించుకుని కుటుంబంతో గడిపేలా చేయడానికి ప్రభుత్వం అనే క చర్యలు చేపట్టింది. నెలకు 60 గంటలకు మించి ఓవర్‌టైమ్‌ చేయడానికి వీల్లేదని నిబంధన విఽధించింది. అయినా చాలామంది నెలకు వంద గంటలకుపైగా ఓవర్‌టైమ్‌ చేస్తూనే ఉన్నారు. యువతీ యువకులు ఇలాగే సింగిల్‌గా గడిపేస్తే.. 2060 నాటికి జపాన్‌ జనాభా 86 మిలియన్లకు పరిమితమైపోతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ప్రభావం దేశ వర్క్‌ఫోర్స్‌పై పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.