‘సెక్స్‌’ ఈజ్‌ ఆల్‌... సెక్స్‌కు దూరమైతే..!

ఆంధ్రజ్యోతి, 30-06-2017:సెక్స్‌ అనేది తాత్కాలిక సంతోషాన్నిచ్చే చర్య కాదు. శాశ్వత ఆరోగ్నాన్ని అందించే సాధనం. యవ్వనంగా కనిపించాలన్నా, వ్యాధులతో పోరాడే శక్తి సమకూరాలన్నా, నొప్పులు తగ్గాలన్నా శృంగారంలో తరచుగా పాల్గొనాలి.

యవ్వనం కోసం
స్కాట్‌ల్యాండ్‌లోని రాయల్‌ ఎడిన్‌బర్గ్‌ హాస్పిటల్‌....18 నుంచి 102 ఏళ్ల మధ్య వయసున్న 3,500 మంది మీద జరిపిన పరిశోధనలో యవ్వనంగా కనిపించటానికి లైంగిక జీవితమే కారణమనే నిజం బయల్పడింది. తరచుగా లైంగికంగా కలిసే వ్యక్తుల్లో ఒత్తిడి, సుఖ నిద్ర, జీవితాన్ని చూసే కోణం....అనే అంశాలను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ధారణకు వచ్చారు పరిశోధకులు. వారంలో కనీసం రెండు నుంచి మూడు సార్లు సెక్స్‌లో పాల్గొనే వాళ్లలో రోగనిరోధక శక్తికి కారణమైన ఇమ్యునోగ్లోబ్యులిన్‌ 30 శాతం ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నట్టు తేలింది. అలాగే యాక్టివ్‌ సెక్స్‌ లైఫ్‌ వల్ల క్యాన్సర్‌, గుండెపోట్లు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా లైంగిక జీవితాన్ని తరచుగా ఆస్వాదించేవారికి సాధారణ జలుబు, జ్వరాలు కూడా రావు.
 
సెక్సర్‌సైజ్‌
అన్ని వ్యాయామాలలాగే సెక్స్‌ కొవ్వు, క్యాలరీలను కరిగిస్తుంది. 20 నిమిషాల వ్యవధిలో 80 కిలోల వ్యక్తికి దాదాపు 96 క్యాలరీలు ఖర్చవుతాయి. లైంగిక తృప్తి పొందటం ఫలితంగా నొప్పిని తట్టుకోగలిగే శక్తి పెరుగుతుంది. లైంగిక ప్రేరణతో కలిగే ఆనందం స్త్రీలను నెలసరి నొప్పులు, కీళ్ల నొప్పులు, మైగ్రెయిన్‌, ఇతర నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. వారంలో రెండు లేదా మూడు సార్లు సెక్స్‌లో పాల్గొనే వాళ్లతో పోలిస్తే నెలలో ఒక్కసారి లేదా అసలు సెక్స్‌లో పాల్గొననివారు చనిపోయే అవకాశాలు 50 శాతం ఎక్కువ ఉంటాయని పరిశోధనల్లో రుజువైంది. వయసు, ధూమపానం, సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుని చేసిన ఈ పరిశోధన ఫలితంగా ఎంత తరచుగా సెక్స్‌లో పాల్గొంటే ఆరోగ్యం అంత మెరుగ్గా ఉంటుందని రుజువైంది.
 
సుఖ నిద్ర కోసం
లైంగిక ప్రక్రియ లైంగిక, పునరుత్పత్తి వ్యవస్థల ఆరోగ్యం నుంచి ఆనంతకరమైన జీవితం వరకూ అన్ని కోణాల్లో దీర్ఘకాలిక సత్ఫలితాల్నిస్తుంది. 1800 మంది మీద అమెరికాలో చేపట్టిన పరిశోధనలో మంచి నిద్ర పట్టడానికి సహాయపడే మత్తును కలిగించే ఆక్సిటోసిన్‌ మిగతా ఎండార్ఫిన్లు సెక్స్‌లో పాల్గొనటం వల్ల రిలీజ్‌ అవుతున్నట్టు ఈ పరిశోధనలో తేలింది. కాబట్టి కంటి నిండా నిద్ర పట్టాలంటే సెక్స్‌ను ఆశ్రయించాలి.
 
సెక్స్‌కు దూరమైతే?
లైంగిక తృప్తి లోపం ఫలితం వయసు, ఆరోగ్య స్థితి, లైంగిక సంతృప్తి పొందే విధానాల మీద ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండి భాగస్వామితో విభేదాలు లేదా అనారోగ్యం వల్ల లైంగిక జీవితానికి దూరమైతే లైంగికాసక్తి సన్నగిల్లటం సహజం. అరుదుగా కొందర్లో ఈ పరిస్థితి సెక్స్‌ ఆలోచనలను రెట్టింపు చేస్తుంది కూడా! సెక్స్‌ లోపం వల్ల కొందరు నీరసం, సెక్స్‌ మీద ఆసక్తి సన్నగిల్లటం కూడా జరుగుతుంది. సెక్స్‌ లోపం వల్ల దాని మీద ఆసక్తి క్రమక్రమంగా సన్నగిల్లటం లేదా దొరకని వస్తువు మీద ఆశ పెరిగినట్టు సెక్స్‌ కోసం వెంపర్లాడటం...ఇలా విభిన్నమైన తత్వాలు వ్యక్తుల్లో చోటు చేసుకుంటాయి. ఈ రెండూ అనారోగ్యకరమే!
 
సెక్స్‌...సగం శారీరకం, సగం మానసికం
తల్లితో బిడ్డకు అనుబంధం చర్మం స్పర్శ ద్వారా ఏర్పడినట్టే భాగస్వాముల మధ్య సఖ్యత రెండు దేహాలు ఒకదాన్ని మరొకటి తాకటం ద్వారా ఏర్పడుతుంది. మానసిక సాన్నిహిత్యం పెరగాలంటే రెండు శరీరాలు దగ్గరవ్వాలి. ఇలా జరిగి ఫీల్‌ గుడ్‌ హార్మోన్స్‌ విడుదలై మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే తరచుగా చేరువవ్వాలి. ఇది సెక్స్‌ వల్లే సాధ్యం. ఎండార్ఫిన్లతో మనసు ఉరకలేస్తూ ఉండాలంటే లైంగిక చర్యలో పాల్గొంటూ ఉండాలి. నిరాశానిస్పృహలకు, లైంగిక చర్యలకు లింక్‌ ఉన్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. లైంగిక చర్యకు దూరమైతే డిప్రెషన్‌లోకి కూరుకుపోం కానీ, ఒక బంధానికి దూరమై ఫలితంగా సెక్స్‌కు దూరమైతే కచ్చితంగా ఆ ప్రభావం మనసు మీద పడుతుంది.
 
మెనోపాజ్‌ దశలో
మెనోపాజ్‌కు చేరుకున్నప్పుడు సెక్స్‌కు దూరమైతే ఇక లైంగిక జీవితానికి ఫుల్‌స్టాప్‌ పడినట్టే! ఆ దశలో తరచుగా సెక్స్‌లో పాల్గొనకపోతే యోని గోడలు పలుచనై లైంగిక చర్య నొప్పిని కలిగిస్తుంది. మెనోపాజ్‌ తర్వాత యోని ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే తరచుగా సెక్స్‌లో పాలొనక తప్పదు. సెక్స్‌లో పాల్గొనటం వల్ల ఆ ప్రదేశానికి రక్త ప్రసరణ పెరిగి లైంగిక అవయవాల ఆరోగ్యం మెరుగవుతుంది. వయసు పైబడిన మహిళల్లో లూబ్రికేషన్‌ కొరవడటంతో తిరిగి లైంగిక జీవితం మొదలుపెడితే కొంత ఇబ్బంది ఎదురవటం సహజం. ఈ వయసు మహిళల్లో తగ్గిన ఈసో్ట్రజన్‌ వల్లే ఈ పరిస్థితి తలెత్తుతుంది. మెనోపాజ్‌ మహిళలతో పోలిస్తే సెక్స్‌లో తరచుగా పాల్గొనకపోయినా, 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న మహిళల్లో లూబ్రికేషన్‌, ఎలాస్టిసిటీ ఎక్కువ. కాబట్టి మెనోపాజ్‌కు చేరుకున్న మహిళలు తమ ఎరోటిక్‌ వీడియోలు చూడటం, పుస్తకాలు చదవటం చేయాలి లేదా పార్ట్‌నర్‌ సహాయం తీసుకోవాలి. ఇలా చేయగలిగితే పెరిగే వయసుతో తగ్గే వెజైనల్‌ లూబ్రికేషన్‌ వేగాన్ని నియంత్రించవచ్చు.
 
ఒత్తిడి పాత్ర
ఒత్తిడి తక్కువగా ఉన్నవాళ్లు ఎక్కువగా సెక్స్‌లో పాల్గొంటారు. అలాగని ఎక్కువ ఒత్తిడితో ఉన్నప్పుడు ఆసక్తి కోల్పోకూడదు. సెక్స్‌ ఒత్తిడిని తగ్గించే అద్భుతమైన సాధనం కాబట్టి ఆ సమయంలోనే ఎక్కువగా సెక్స్‌లో పాల్గొనాలి. తరచుగా సెక్స్‌లో పాల్గొనేవారి రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. కొంతమంది మహిళలకు అది దిన చర్యలో ఓ భాగం లేదా నొప్పితో కూడుకున్న పని. ఇలాంటి మహిళలు సెక్స్‌ వల్ల ఒరిగ ఆరోగ్యపరమైన లాభాల మీద అవగాహన ఏర్పరుచుకుని సెక్స్‌ కలిగించే ఇబ్బందులకు వైద్య చికిత్స తీసుకుని ముందుకు సాగాలి.
 
నెలసరి నొప్పికి మందు
సెక్స్‌లో పాల్గొనటం ద్వారా కలిగే భావప్రాప్తి వల్ల గర్భాశయం సంకోచ వ్యాకోచాలకు గురవుతుంది. పునరుత్పత్తి వ్యవస్థకు చెందిన కండరాలు సెక్స్‌ వల్ల రిలాక్స్‌ అవుతాయి. ఫలితంగా రుతుక్రమంలో రక్తస్రావం తేలికగా జరిగి నెలసరి నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఈ కారణం వల్లే పెళ్లికి ముందు స్త్రీలను వేధించే నెలసరి నొప్పులు పెళ్లయ్యాక దూరమవుతాయి. అయితే సెక్స్‌ లైఫ్‌కు మళ్లీ దూరమైతే నొప్పులు తిరగబెడతాయి.
 
సెక్స్‌తో తెలివితేటలు
యూనివర్శిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌, దక్షిణ కొరియాల్లో ఎలుకల మీద జరిపిన పరిశోధనలో సెక్స్‌కూ తెలివితేటలకూ సంబంధమున్నట్టు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. సెక్స్‌ వల్ల మెదడులో న్యూరాన్ల సంఖ్య పెరిగి, మెదడు పనితీరు మెరుగైనట్టు వాళ్లు కనుగొన్నారు. అలాగని సెక్స్‌లో పాల్గొనని వాళ్లందరికీ తెలివి తగ్గిపోతుందని చెప్పలేం. కానీ సెక్స్‌లో తరచుగా పాల్గొనటం వల్ల మెదడు చురుగ్గా ఉంటుందని మాత్రం రుజువైంది.
 
సెక్స్‌ లైఫ్‌ మెరుగవ్వాలంటే?
ప్రారంభంలో ఉండే ప్రాధాన్యత కాలక్రమేణా తగ్గటం సెక్స్‌లో అందరం చూస్తుంటాం. ఆసక్తి సన్నగిల్లటం, పని ఒత్తిళ్లు...ఇలా సెక్స్‌ మీద ఆసక్తి తగ్గటానికి ఎన్నో కారణాలుంటాయి. అయితే సెక్స్‌కు మీ జీవితంలో తిరిగి చోటు కల్పించటం కోసం కొన్ని చిట్కాలు పాటించాలి.
 
సెక్స్‌ ఈజ్‌ ది ఫస్ట్‌ ప్రయారిటీ
రోజువారీ పనులు, కుటుంబ ఒత్తిళ్లు, పిల్లల చదవులు, కట్టాల్సిన బిల్లులు వీటికి ప్రధమ ప్రాధాన్యం ఇస్తూ దంపతులు సెక్స్‌ను లిస్ట్‌లో చివరికి తోసేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం దంపతులందరూ చేసే తప్పే ఇది. ఇలా సెక్స్‌కు మలి ప్రాధాన్యం ఇస్తూ పోతే క్రమక్రమంగా అది కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అందుకోసం సమయాన్ని కేటాయించుకోవాలి. తీరిక చేసుకోవాలి. ఒకర్నొకరు సంప్రదించుకుని ఏకాంతాన్ని సమకూర్చుకోవాలి.
 
ముద్దులాటలు
ప్రారంభంలో ముద్దులు, కౌగిలింతలతో ఎక్కువ సమయం గడిపేవాళ్లు తర్వాత వాటికి ప్రాధాన్యమివ్వటం మానేస్తారు. రెండు దేహాల కలయికతో సెక్స్‌ను ముగించేద్దాం అన్నట్టు వ్యవహరించే క్రమంలో కాలక్రమేణా ముద్దులు, కౌగిలింతలు కనుమరుగవుతాయి. కానీ దంపతుల మధ్య తిరిగి లైంగిక మెరుపు మెరవాలంటే దుస్తులతోనే ముద్దులకు పూనుకోవాలి. అప్పుడే ముద్దులు, కౌగిలింతలను పూర్తిగా, స్వచ్ఛంగా ఆస్వాదించగలుగుతారు. వాటితో కొనసాగే సెక్స్‌ అంతకుముందు ఇవ్వనంత సంతృప్తిని అందిస్తుందని లైంగిక నిపుణలు సూచిస్తున్నారు.
 
ప్రశంశలు, అభినందనలు
మనల్ని మన భాగస్వామి ప్రేమిస్తున్నట్టు, ఆకర్షితులవుతున్నట్టు కలిగే భావనను మించిన ఆనందం మరొకటుండదు. ఇలాంటి అనుభూతి పొందాలంటే తరచుగా ఒకర్నొకరు అభినందించుకుంటూ, ప్రశంశించుకుంటూ ఉండాలి. మనల్ని మనం తక్కువగా భావించే సందర్భంలో ఇలాంటి మెచ్చుకోళ్లు మానసిక స్థయిర్యాన్ని అందిస్తాయి. కాబట్టి భాగస్వామిలో నచ్చిన విషయాలను బాహాటంగా పొగడాలి. విమర్శలను సున్నితంగా బయట పెట్టాలి. ఇలాంటి ప్రవర్తన వల్ల పడక గదిలో దంపతుల మధ్య అరమరికల పరదాలు తొలగిపోయి స్వేచ్ఛాయుత లైంగిక జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు.
 
అభ్యంతరపెట్టకూడదు
ఒక్కోసారి సెక్స్‌కు మనసు సహకరించదు. ఇది దంపతుల్లో ఇద్దరికీ జరిగేదే! అయితే అందుకు బలమైన కారణం ఉంటే తప్ప సెక్స్‌కు అభ్యంతరం చెప్పకూడదు. దగ్గరకొచ్చిన వ్యక్తిని ఏదో ఓ వంకతో దూరం పెట్టేయటం తరచుగా జరుగుతే ఉంటే మానసిక దూరం పెరగటం ఖాయం. ఇది శరీరాల మధ్య శాశ్వత దూరానికి దారి తీస్తుంది. కాబట్టి ప్రతిసారీ లైంగిక కోరిక లేకపోయినా, స్పందనలు కలగకపోయినా అందుకోసం ప్రయత్నించటంలో తప్పు లేదు. ప్రేరణ కోసం పరిస్థితిని విప్పి చెప్పి భాగస్వామి సహాయం తీసుకోవాలి.