దృష్టి దాటిన లోపలి దృశ్యం

పడగ్గది శృంగారం సెల్‌ఫోన్‌లో బహిరంగం
అనుకోకుండా బయటపడి ఐదింట ఒక జంటకు నరకం
సర్వేలో వెల్లడి
 
దృశ్యం మనుషులను కదిలిస్తుంది. అయితే కదిలే ప్రతి దృశ్యాన్నీ భద్రపరుచుకోవాలన్న ఆరాటం.. భవిష్యత్తును అదృశ్యశక్తుల చేతుల్లో పెడుతోంది. స్నేహం, ప్రేమ చివరకు శృంగారాన్ని కూడా స్మార్ట్‌ ఫోన్లో బంధించే పోకడలు చివరకు విషాదాన్ని మిగులుస్తున్నాయి. పడక గదిలో సన్నిహితంగా గడిపిన దృశ్యాలు.. లక్షల మొబైల్స్‌లోకి చేరి..యువతీ యువకుల మధ్య కలహాలు, విడాకులు చివరకు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. మెట్రో నగరాల్లో పెరుగుతున్న సెల్ఫ్‌ పోర్న్‌ పోకడలను అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
 
రాహుల్‌, రాగిణి (పేర్లు మార్చం)లకు కొత్తగా పెళ్లైంది. తమ తేనె రాత్రుల అనుభూతులు జీవితాంతం గుర్తుండిపోవాలనుకున్నారు. మొబైల్‌ కెమెరాలో తమ తొలి రేయి కలయికను బంధించారు. రెండు రోజులు గడిచిపోయాయి. హనీమూన్‌ నుంచి ఇంటికి వచ్చారు. కానీ ముఖాల్లో ఆనందంలేదు. కారణం ప్రయాణంలో రాహుల్‌ ఫోన్‌ పోయింది. దానికి పాస్‌వర్డ్‌ కూడా లేదు. ఏ మధురక్షణాలు గుర్తుండి పోవాలనుకున్నారో..ఇప్పుడవే చంపుతున్నాయి. తమకే సొంతమైన ఆ దృశ్యాలు ఎన్ని లక్షల మందికి చేరిపోయాయో అన్న ఆందోళన, అవమానం వారిని కుంగదీస్తున్నాయి.
ప్రతి ఐదు జంటల్లో ఒకరు
ఇది ఒక్క జంటకి సంబంధించిన సమస్య కాదు. ఇండియా టుడే సెక్స్‌ సర్వే-2017 ప్రకారం, ప్రతి 5 జంటల్లో ఒక జంట..తమ శృంగార దృశ్యాలను స్మార్ట్‌ఫోన్లో చిత్రీకరించామని అంగీకరించింది. నగరాల్లో యువతీ యువకులు తెలిసి ఇల్లీగల్‌ పోర్నోగ్రఫీకి బాధితులుగా మిగులుతున్నారనిపేర్కొంది. ఇతరుల నగ్న దృశ్యాలను చూసి ఆనందించేవారి చేతుల్లోకి ప్రైవేటు టేపులు వెళ్లి బెదిరింపులు ఎదుర్కొంటున్న భార్యభర్తలు వేలల్లో ఉన్నారని వెల్లడించింది. ప్రైవసీ దృశ్యాలు పబ్లిక్‌లోకి వెళ్లిపోవడంతో ఎంతోమంది సిగ్గుతో బయటకు రాలేకపోతున్నారనీ, భార్యాభర్తల మధ్య కలహాలు, విడాకులు చివరకు ఆత్మహత్యల కూడా స్మార్ట్‌ ఫోనులో దృశ్యాలు కారణంగా మారుతున్నాయని రిపోర్టు వివరించింది.
కామన్‌గా మారిన క్యాజువల్‌ సెక్స్‌
అర్బన్‌ ఇండియాలో గత పదిహేనేళ్లలో వచ్చిన భారీ మార్పు క్యాజువల్‌ సెక్స్‌! మెట్రో నగరాల్లో 41శాతం మంది యువకులు,
29శాతం మంది యువతులు ఒక రాత్రి అనుభవానికి సుముఖంగా ఉన్నట్టు సర్వే తెలిపింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ప్రతి ఏడుగురిలో ఒకరు.. తమకు పరిచయంలేనివారితో రాత్రి గడిపామని అంగీకరించారనీ, సెల్ఫ్‌ పోర్న్‌ను ట్రెండ్‌గాభావిస్తున్నారని రిపోర్టు పేర్కొంది.
అందరితో ‘ఆ’ దృశ్యాలు
ఉదయం లేచిన దగ్గర్నుంచి తిన్నా, తాగినా, ఏం జరిగినా, ఎక్కడకు వెళ్లినా సెల్ఫీ తీసుకోవడం చాలామందికి అలవాటు.
మెట్రో నగరాల్లో ఈ పిచ్చి మరింత ముదిరి.. బెడ్‌రూమ్‌లోకి కూడా చొరబడింది. మెట్రో నగరాల్లో జంటలు తమ రతిక్రీడ దృశ్యాలను మొబైల్స్‌లో చిత్రీకరించడం..సన్నిహితులతో పంచుకోవడం కామన్‌గా మారిందని రిపోర్టులు చెబుతున్నాయి. ఇంకా వాట్సాప్‌ తదితర సామాజిక మాధ్యమాలలో నగ్న దృశ్యాలతో కవ్వించుకోవడం.. చివరకు అవి చేరకూడని చేతుల్లోకి వెళ్లడం సర్వసాధారణంగా మారాయంటున్నాయి.
సరసాన్ని మింగేస్తున్న పోర్న్‌
నెట్‌లో పోర్న్‌ వీడియోలు తమ సెక్స్‌ లైఫ్‌పై ప్రభావం చూపుతున్నాయని 42శాతం జంటలు అంగీకరించాయి. ఇంటర్నెట్‌, యాప్స్‌, సోషల్‌ మీడియా తమ సంసారంలో సరసాన్ని దూరం చేశాయని జంటలు వాపోయినట్టు సర్వే వెల్లడించింది. సరసం పండాల్సిన ‘ఆ’ వేళలో సెల్‌ఫోన్లు మోగకూడదని హితవు పలుకుతోంది.