స్మార్ట్‌ఫోన్‌తో వీర్య నాణ్యత పరీక్ష

 బోస్టన్‌, మార్చి 23: వీర్య నాణ్యతను పరీక్షించేందుకు ఓ వినూత్న పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది స్మార్ట్‌ఫోన్‌ ఆధారంగా పనిచేస్తుందని చెప్పారు. ప్రపంచంలో చాలా దేశాల్లో సంతానసాఫల్య పరీక్షలు ఇప్పటికీ అందుబాటులో లేవు. ఈ క్రమంలో తాజా ఆవిష్కరణ ఆయా దేశాలకు వరప్రసాదంగా మారనుందని మసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌ పరిశోధకులు వెల్లడించారు. ఈ అనలైజర్‌తో పాటు దీన్ని స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించేందుకు ఓ ఆప్టికల్‌ కేబుల్‌, వీర్యాన్ని ఉంచేందుకు డిస్పోజబుల్‌ పరికరాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇందులోని మైక్రోచిప్‌ వీర్య నమూనాను పరీక్షించి ఆప్టికల్‌ కేబుల్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు సమాచారం చేరవేస్తుందని చెప్పారు. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన యాప్‌ ఈ సమాచారాన్ని విశ్లేషించి ఫలితాలను 98 శాతం కచ్చితత్వంతో వెల్లడిస్తుందన్నారు.