కాలుష్యంతో లైంగిక సమస్యలు

ఆంధ్రజ్యోతి,3-1-2017:పరిశ్రమలు, వాహనాలు రోజురోజుకు పెరిగి పోతున్నాయి. దీంతో వాయుకాలుష్యం పెరిగిపోయి మానవ శరీరంలోని అన్ని భాగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇటీవల పారిశ్రామిక ప్రాంతాల్లో తాజాగా నిర్వహించిన ఒక పరిశోధనలో లైంగిక పరమైన సమస్యలకు కాలుష్యం అనేది ఒక కారణం అయ్యే అవకాశం ఉందని వెల్లడైంది. ఈ పరిశోధనని దేశరాజధాని ఢిల్లీలో జరిపారు. అక్కడ కాలుష్యరేటు రోజురోజుకీ పెరుగుతుండడం అది పురుషుల శృంగార జీవితంపై ప్రభావం చూపిస్తుండడం వారు గమ నించారు. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం గాలి కాలుష్యం అనేది 30శాతం శృంగారజీవితంపై ప్రభావం చూపిస్తుంది. మనదేశంలో పదిహేను శాతం మంది పురుషులు ఈ వాయుకాలుష్యం వల్ల శృంగార జీవితాన్ని అనుభవించడం లేదు. ఈ విలువ మహిళలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందని తేలింది. 

కాలుష్య వాతావరణంలో జీవించే పురుషుల్లో చాలామంది లైంగికసామర్థ్యం కోల్పోతున్నారనీ, వీర్యకణాలు తగ్గిపోతున్నాయనీ ఈ అధ్యయనంలో వెల్లడైంది. అందువల్ల సంతానోత్పత్తి కూడా తగ్గే అవకాశాలున్నాయని నిపుణులు తేల్చి చెప్పేస్తు న్నారు. దీనికి గల కారణం గాలిలో ఉండే పాలీసైక్లిక్‌ ఏరోమేటిక్‌ హైడ్రోకార్బన్లు, పాదరసం, లెడ్‌కాడ్మియం వంటి హానికారక రసాయనాలు గాలిలో కలిసి శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇవి పురుషుల హార్మోన్ల సమతుల్యతపై ప్రభావం కలిగిస్తున్నాయి. దీనివల్ల వారిలో వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది. ఇలాంటి లోపాలు తలెత్తకముందే ప్రతి ఆరునెలలకోసారి వీర్య పరీక్ష చేసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. 

ఒకప్పుడు సంతానం కలుగకపోతే దానికి మహిళలే కారణమని అందరూ నిందించేవారు. అయితే 60శాతం వరకు సంతానం కలుగక పోవడానికి పురుషుల్లో లైంగిక సామర్థ్యం కొరవడటమే ప్రధాన కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. అందు కోసం వాయుకాలుష్యానికి దూరంగా ఉండమని వైద్యులు చెబుతున్నారు.