పడకగది సుఖం కోసం ఇలాంటి తప్పు చేస్తున్నారా?

04-02-2018: నా ఎదురుగా కూర్చున్నాడో యువకుడు. ఏదో బహుళజాతి సంస్థలో పనిచేస్తున్నానని చెప్పాడు. కొత్తగా పెళ్లయిందట. నిద్ర తగ్గడం వల్ల కావచ్చు. మొహమంతా పీక్కుపోయినట్టుంది.

‘రాత్రంతానా?’ అడిగాను.
‘అవున్సార్‌. అరగంటకోసారి’ చెప్పాడు.
రాత్రంతా... అరగంటకోసారి - అనేది ఆ కర్రాడి కల!
తొలిరాత్రి నుంచే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అది అసాధ్యమని త్వరగానే అర్థమైపోయింది. ఆతర్వాత ఏదో పార్టీలో మిత్రులు బోల్డన్ని డే అండ్‌ నైట్‌ లవ్‌ మ్యాచ్‌లు ఆడామని చెప్పారట.
 
             దీంతో మనవాడికి దిగులు ఎక్కువైపోయింది. ఆ ఒత్తిడిలో అరగంట టార్కెట్‌ను పక్కనపెడితే, రోజుకొక్కసారి కూడా కుదరడం లేదు. ఆ బాధలో గడ్డం పెంచేశాడు. ఆఫీసుకెళ్లడం మానేశాడు. టీవీ ముందు కూర్చున్నా ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్తున్నాయి. అలా, ఓ రోజు యథాలాపంగా రిమోట్‌ నొక్కుతున్నప్పుడు ఓ ఊరూపేరూ లేని ఛానల్‌ కనబడింది. దాంట్లో ఓ ప్రకటన వస్తోంది. ఓ జంట.. ఎదురుగా గడియారం పెట్టుకుని మరీ రొమాన్స్‌ చేస్తుంటారు. అరగంటకో గంట ఠంగున మోగుతుంది.
మేం ‘గంటా’పథంగా చెప్పగలం...
మిమ్మల్ని నిద్రపోనివ్వదు రాత్రంతా!
...అంటూ ఏదో లేహ్యం డబ్బా చూపిస్తాడు హీరో. పన్లోపనిగా కన్నుగీటి హీరోయిన్‌నూ రెచ్చగొడతాడు.
 
       ఆ కర్రాడు కళ్లప్పగించి మరీ చూశాడు. ప్రకటన కింద ఓ వెబ్‌సైట్‌ కనిపిస్తోంది. చకచకా స్మార్ట్‌ఫోన్‌లో ఆ సైట్‌లోకి వెళ్లాడు. పాతికవేలు చెల్లించి, ఓ పెద్ద డబ్బా ఆర్డర్‌ చేశాడు. త్వరలోనే తన లక్ష్యం నెరవేరబోతోందన్న ఆనందంలో ఆ రాత్రి కంటినిండా నిద్రపోయాడు. తెల్లారేలోపు కొరియర్‌బాయ్‌ తలుపుతట్టి మరీ పార్సిల్‌ ఇచ్చాడు. దాన్ని అపురూపంగా అందుకున్నాడు. ఒకటికి పదిసార్లు అట్టమీదున్న బొమ్మలవైపే చూశాడు. వాటిలో తననూ తన భార్యనూ ఊహించుకున్నాడు. ఎప్పుడు చీకటి పడుతుందా అని ఎదురుచూడసాగాడు.
 
           ఇదంతా ఆ అమ్మాయికి తెలియదు. మొగుడు మహా ఉత్సాహంగా ఉండటంతో, ‘ఆయన తీరే అంత. ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ అర్థం కాదు’ అంటూ ముసిముసిగా నవ్వుకోసాగింది. రోజూ కంటే ఓ అరగంట ముందే పడకగదికి గొళ్లెం పెట్టాశారు అబ్బాయిగారు. ఎందుకంటే, అరగంట క్రితమే తిరుపతి లడ్డూ అంత లేహ్యం ముద్ద మింగాడు. ఏ క్షణంలో అయినా యాక్షన్‌ మొదలైపోవచ్చు.
నిజంగానే మొదలైంది...
 
 అరగంటకోసారి ఠంచనుగా, నిజంగానే గంట కొట్టినట్టుగా!
ఒకటి, రెండు, మూడు...నాలుగు...ఐదు.... పది!
ఇక ఓపికలేక మంచం మీద వాలిపోయాడు.
అబ్బే! అది, వలపు బడలిక కాదు.
విరేచనాల ప్రభావం.
 
        ఎవరో అలారమ్‌ పెట్టినట్టు ముప్పై నిమిషాలకోసారి టాయిలెట్‌కు పరుగులు పెట్టిస్తోంది. పొద్దున్నే డాక్టరు దగ్గరికి తీసుకెళ్లిందా అమ్మాయి. ఓ రెండ్రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. చికిత్సతో విరేచనాలు నిలువడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాంటి నకిలీ మందులు కొన్నిసార్లు మూత్రపిండాల్నీ దెబ్బతీస్తాయి.
ఆ దెబ్బ నుంచీ కోలుకోకముందే నా దగ్గరికి వచ్చాడు. రిపోర్ట్స్‌ చూశాను. లైంగికంగా పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. నాణ్యమైన శృంగార జీవితాన్నే గడుపుతున్నాడు. భార్యకు కూడా తన విషయంలో ఎలాంటి ఫిర్యాదులూ లేవు. అర్థంలేని అంచనాలూ, తెలిసీ తెలియని విషయాలూ, ఎవరో చెప్పే కట్టు కథలూ... తనని ఇబ్బందుల పాలు చేశాయి. నకిలీ నవనన్మథమాత్రల దెబ్బకి అటు ఆర్థికంగా, ఇటు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నవారు చాలామంది.
 
      ఆమధ్య ఓ దినపత్రికలో చదివాను. భారతీయ మగ పులుల జననాంగంతో సూప్‌ చేసుకుని తాగితే... పురుషుడి లైంగిక శక్తి వందరెట్లు పెరుగుతుందని చైనీయుల నమ్మకమట. అందుకు ఎంతైనా ఖర్చుపెట్టడానికి సిద్ధపడుతున్నారట. దీంతో వన్యప్రాణి మాఫియాలు విజృంభిస్తున్నారు. అడవిలో దర్జాగా తిరగాల్సిన పులి బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోంది. భారతీయులూ తక్కువ తినలేదు. చివరికి పునుగుపిల్లిని కూడా వదలడం లేదు. వాటి విసర్జకాల్ని సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు. మనిషి స్వార్థం కారణంగా ఆ సంతతి అంతరిస్తోంది. నక్షత్ర తాబేళ్లకూ చుక్కలు చూపిస్తున్నారు. ఖడ్గమృగాల్ని మానవ మృగాలు వెంటాడి వేటాడి చంపేస్తున్నాయి.
 
           లైంగికత చాలా సున్నితమైన అంశం. ఏ చిన్న ఇబ్బంది కలిగినా దంపతుల్లో ఏ ఒక్కరూ... పరిపూర్ణ శృంగార అనుభూతిని ఆస్వాదించలేరు. అలాంటి సమయంలో ఏ సెక్సాలజిస్టునో సంప్రదించాలి. ఆ ఒక్కటీ తప్పించి అన్ని ప్రయత్నాలూ చేస్తారు. మరికొందరిలో... ఏ సమస్యా ఉండదు. ఇంకాస్త లైంగిక శక్తిని పెంచుకోవాలన్న ఆరాటం, మరికాస్త అనుభూతిని జుర్రుకోవాలన్న తపన, వయసుతో పాటూ వచ్చే పరిమితుల్ని ఒక్క పూటలో గెలవాలన్న దురాశ... వారిని పక్కదార్లు పట్టిస్తుంది. ఆధునిక వైద్యంలోనూ లైంగిక ఉద్దీపన ఔషధాలు ఉన్నాయి. అయితే, వాటిని వైద్యుల సిఫార్సుతోనే వాడాలి. వీటికి దుష్ప్రభావాలు ఎక్కువ. కొన్నిసార్లు ప్రాణాంతకమూ కావచ్చు.
 
అలాంటివారికి నా సలహా ఒకటే...
‘మీలో కోరికల్ని రగిలించే శక్తి... పిట్టలూ జంతువుల కంటే, చెట్టుమందులూ పుట్టమందుల కంటే... మీ జీవిత భాగస్వామికే ఎక్కువ. ఇలాంటి సమయాల్లో లైంగిక జీవితంలో నిన్నటి వరకూ పేరుకుపోయిన నిర్లిప్తతను తొలగించాలి. జీవితభాగస్వామిని మరో ప్రేమయాత్రకు తీసుకెళ్లాలి. పడకగదిని సరికొత్తగా అలంకరించుకోవాలి. ఏకాంతంలో చక్కని సంగీతాన్ని ఆస్వాదించాలి. గాలికి గంధం పూయాలి. పాతవైనా, తీపి జ్ఞాపకాల్ని కొత్తగా నెమరేసుకోవాలి. దీనివల్ల మనసుకు మట్టిన మబ్బులు తొలగిపోతాయి. దీనికితోడు... చక్కని జీవనశైలి, సమతుల ఆహారం, పాజిటివ్‌ దృక్పథం... శృంగార జీవితాన్ని ఒడుదొడుకుల్లేకుండా నడిపిస్తాయి’

  

డాక్టర్ డి. నారాయణరెడ్డి
కన్సల్టెంట్, సెక్సువల్ మెడిసిన్
డేగ ఇన్‌స్టిట్యూట్, చెన్నై.
www.degainstitute.com