అంగస్తంభన వైఫల్యానికి ఆసనాలతో చెక్‌

కర్ణాటకలోని శ్రీధర్మస్థల మంజునాథేశ్వర

ఆయుర్వేద కళాశాల పరిశోధకుల వెల్లడి
మరీ ముఖ్యంగా 5 ఆసనాలతో చెక్‌
యోగా వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఆందోళన దూరమవుతుంది. ఫిట్‌నెస్‌ పెరుగుతుంది.
ఆరోగ్యంగా ఉంటాం.. ఇలా చెప్పుకొంటూ పోతే యోగా ఉపాయాల జాబితా చాంతాడంత!
ఈ జాబితాలో ఇంకో లాభం చేరింది.అదీ పురుషులకు మాత్రమే ప్రత్యేకం!!
 
01-02-2018: పురుషుల్లో వచ్చే అంగస్తంభన సమస్యను రోజూ యోగా చేయడం ద్వారా నివారించుకోవచ్చట! కర్ణాటకలోని శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఆయుర్వేద అండ్‌ హాస్పిటల్‌ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వివరాలతో వారు రాసిన వ్యాసం ‘జర్నల్‌ ఆఫ్‌ ఆయుర్వేద అండ్‌ ఇంటిగ్రేటెడ్‌ మెడికల్‌ సైన్సె్‌స’లో ప్రచురితమైంది. అంగస్తంభన వైఫల్యానికి చాలావరకూ.. ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలే కారణమవుతాయని వివరించారు. యోగా వల్ల స్ట్రెస్‌, డిప్రెషన్‌ వంటివి తగ్గి శృంగారపరంగా చురుగ్గా ఉంటారని పేర్కొన్నారు. వారు చేసిన సిఫారసుల ఆధారంగా.. పెన్సిల్వేనియాకు చెందిన డేనియల్‌ బుబ్నిస్‌ అనే యోగా శిక్షకుడు అంగస్తంభన వైఫల్యానికి 5 ఆసనాలు చెక్‌ పెడతాయని వివరించారు. ఆయన చెబుతున్న ఆ ప్రత్యేక ఆసనాలు ఏంటంటే...
 
తస్మాత్‌ జాగ్రత్త
యోగాసనాలతో అంగస్తంభన వైఫల్యం తగ్గుతుందో లేదోగానీ.. భవిష్యత్తులో రాబోయే హృద్రోగాలకు అది ముందస్తు సూచన కూడా కావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, రక్తం గడ్డకట్టడం వంటివాటివల్ల కూడా అంగస్తంభన సమస్య ఏర్పడవచ్చని, కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, నిపుణులైన వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
 
పవనముక్తాసనం

ఈ ఆసనం గ్యాస్‌, మలబద్ధకం సమస్యను పోగొట్టడమే కాక.. పొత్తికడుపు భాగంలోని కండరాలను, పునరుత్పత్తి అవయవాలను ఉత్తేజితం చేస్తుంది.

 
గరుడాసనం
ఈ ఆసనం కూడా పొత్తికడుపు భాగానికి రక్తసరఫరాను పెంచుతుంది.

సిద్ధాసనం

అంతర్జాతీయంగా యోగా శిక్షకులు దీన్ని ‘పర్‌ఫెక్ట్‌ పోజ్‌’గా వ్యవహరిస్తుంటారు. ఈ ఆసనం వల్ల పొత్తికడుపు భాగం ఉత్తేజితమవుతుంది.

శవాసనం

నేరుగా అంగస్తంభన సమస్యకు ఈ ఆసనంతో సంబంధం లేదుగానీ.. ఒత్తిడిని తొలగించే ఆసనమిది.

 
అర్ధ మత్స్యేంద్రాసనం

ఈ ఆసనం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. కాలేయం, ప్లీహం, క్లోమం, పొత్తికడుపు భాగం సహా పలు ప్రధాన అవయవాలకు రక్త సరఫరా మెరుగవుతుంది.